కాకా క్రికెట్ టోర్నీ.. గోదావరిఖని, యైటింక్లయిన్ టీమ్స్ గెలుపు

కాకా క్రికెట్ టోర్నీ.. గోదావరిఖని, యైటింక్లయిన్ టీమ్స్ గెలుపు

గోదావరిఖని/యైటింక్లయిన్ కాలనీ, వెలుగు: పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్ కాలనీలోని అబ్దుల్ కలాం స్టేడియంలో కాకా వెంకటస్వామి స్మారక రామగుండం నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నీ బుధవారం ఉత్కంఠభరితంగా సాగింది. ఉదయం మొదటి మ్యాచ్ గోదావరిఖని, పాలకుర్తి జట్ల మధ్య జరుగగా, గోదావరిఖని టీమ్​విజయం సాధించింది. మొదట బ్యాటింగ్​చేసిన గోదావరిఖని టీమ్​ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 157 రన్స్ చేసింది. తర్వాత చేజింగ్​కు దిగిన పాలకుర్తి టీమ్​15.3 ఓవర్లలో  82 రన్స్​కే ఆలౌట్ అయింది.

గోదావరిఖని ప్లేయర్లు సాయి 20 బాల్స్ లో 30 రన్స్, సంతోష్ 15 బాల్స్​లో 22 రన్స్, పాలకుర్తి ప్లేయర్లు శ్రవణ్ 18 బాల్స్ లో 26 రన్స్ చేసి ప్రతిభ కనబరిచారు. మధ్యాహ్నం జరిగిన రెండో మ్యాచ్​లో యైటింక్లయిన్ కాలనీ, రామగుండం జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన యైటింక్లయిన్ కాలనీ టీమ్​20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 156 రన్స్ చేయగా, తర్వాత బ్యాటింగ్​కు దిగిన రామగుండం టీమ్​20 ఓవర్స్ లో ఐదు వికెట్లు కోల్పోయి 151 రన్స్ చేసి ఓడిపోయింది. యైటింక్లయిన్ కాలనీ ప్లేయర్ మాధవ్ 45 బాల్స్​లో 63 రన్స్, రామగుండం ప్లేయర్​ప్రవీణ్ 47 బాల్స్ లో 45 రన్స్ చేశారు.