భారత దేశంలో ఆయన ఒక శిఖరాగ్రం. నవతరానికి ఒక దిక్సూచి. తెలంగాణ వాదానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. పేదల పెన్నిధి, కార్మిక సూర్యుడు. కులం, మతం, జాతి భేదం లేకుండా యావత్ తెలుగు సమాజంలో అందరూ నోరారా ‘కాకా’ అని పిలుచుకుంటున్న ఏకైక వ్యక్తి గడ్డం వెంకటస్వామి. నాడు నిజాం కాలంలో పారిశ్రామిక రంగంలో ఎంతో అభివృద్ధి చెందిన నగరం హైదరాబాద్. ఇక్కడ పరిశ్రమలన్ని
పెద్దపెద్ద పారిశ్రామికవేత్తల చేతుల్లో ఉండేవి. ఆనాటి ప్రభుత్వంలో వాళ్లకు గొప్ప పలుకుబడి ఉండేది. హైదరాబాద్ చుట్టూ ఉన్న పరిశ్రమలను నమ్ముకొని దాదాపు 30 నుంచి 40వేల మంది కార్మికులు జీవనం సాగించేవారు. వీళ్లతోపాటే నగరంలో అడ్డా కూలీలు, రిక్షా కార్మికులుగా అనేకమంది పనిచేసేవారు. కాకా హైదరాబాద్ స్టేట్ ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్‌గా కార్మికుల సంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేశాడు. కాకా ఒక సందర్భంలో రాజేంద్రనగర్‌లో ఉన్న నిజాం అగ్రికల్చరల్
ఫామ్‌కి చేరుకున్నాడు. అక్కడ పనిచేస్తున్న దాదాపు 300 మంది కూలీలతో మాట్లాడాడు. యజమానులు కూలీలకు తక్కువ కూలి ఇస్తూ తమ ఇష్టానుసారంగా వేధిస్తున్న విషయాలను కూలీలు ఆవేదనతో చెప్పగా కాకా చలించిపోయాడు. వెంటనే కూలీలతో ఒక యూనియన్ ఏర్పాటుచేయడంతోపాటు కూలి పెంచాలన్న న్యాయమైన డిమాండ్‌తో యూనియన్ తరఫున సమ్మెకు నోటీసు ఇచ్చారు. అలా అరవై రోజులు సమ్మె సాగింది. సమ్మె తీవ్రత పెంచేందుకు కాకా ఆందోళన కార్యక్రమం చేపట్టాడు. రాజేంద్రనగర్ నుంచి పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. దాంతో పోలీసులు లాఠీచార్జి చేసి కాకాతోపాటు అనేక మంది కూలీలను అరెస్టు చేశారు. కాకా అరెస్టు అయిన సంగతి తెలుసుకున్న ఐఎన్టీయూసీ మాజీ అధ్యక్షుడు హరిశ్చంద్ర హెడా ప్రభుత్వ తీరును తప్పుపడుతూ వెంకటస్వామిని విడుదల చేయాలని నాటి సీఎం బూర్గుల రామకృష్ణారావుని కోరారు. దాంతో వెంకటస్వామిని విడుదల చేయండని పోలీసులకు బూర్గుల ఆదేశాలు ఇవ్వడంతో కాకాను విడుదల చేశారు. అయితే, కాకా తనతోపాటు అరెస్టయిన కూలీలను కూడా విడిపించారు.
రిక్షా కార్మికులతో కాకా ర్యాలీ
తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్న సందర్భంలో దొరలు, భూస్వాములు, రజాకార్లు, పటేల్, పట్వారీ దౌర్జన్యాలకు తాళలేక పల్లె నుంచి పేదలు పొట్టచేత పట్టుకుని పట్టణానికి చేరుకున్నారు. హైదారాబాద్ నగరం రోడ్లపై రిక్షా కార్మికులుగా మారారు. వారిపై పోలీసులు ఆగడాలను కాకా సహించలేక హైదరాబాద్ నగరంలో రిక్షాలతో ఐదు కిలోమీటర్ల ర్యాలీ చేశారు. దాంతో విరుచుకుపడిన పోలీసులు లాఠీ చార్జ్‌కి దిగారు. అయినా, వెనక్కి తగ్గని రిక్షా కార్మికులపై ముందస్తు హెచ్చరికలు చేయకుండానే కాల్పులు జరపడంతో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అమాయకపు రిక్షా కార్మికులపై పోలీసులు కాల్పులు జరపడం కళ్లారా చూసి చలించిపోయిన కాకా చనిపోయిన కార్మికుల మృతదేహాలతో అంతిమ యాత్రకు శ్రీకారం చుట్టారు. దీంతో భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి చేదాటిపోతున్నదని గ్రహించిన నాటి హోంమంత్రి కొండా వెంకట రంగారెడ్డి జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం కోసం కృషి చేశాడు.
నెహ్రూ ఇంటికి కాకా
షాబాద్ సిమెంట్ కర్మాగారంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ ఏర్పాటు చేసి ఎన్నికల్లో గెలుపొందారు. అప్పట్లో సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లును బిర్లాలు నడిపేవారు. అక్కడ కార్మికులను పర్మినెంట్ చేయకుండా తక్కువ వేతనాలు ఇచ్చేవారు. కాకా తమ యూనియన్ సభ్యుడు సంజీవరెడ్డి చేత యాజమాన్యానికి నోటీసు ఇప్పించాడు. యాజమాన్యం చర్చలకు సిద్ధం కాకపోవడంతో పేపర్ మిల్లులో మొదటిసారి సమ్మె సైరన్ మోగించారు. కాకా సారథ్యంలో వందలాది మంది కార్మికులతో కాగజ్ నగర్ వేదికగా భారీ ర్యాలీ ప్రారంభించి ఫ్యాక్టరీ వైపు సాగుతుండగా మార్గం మధ్యలో పోలీసులు అడ్డుపడి లాఠీచార్జి చేశారు. పోలీసులు ఫైరింగ్ షురూ చేయడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగజ్ నగర్లో కార్మికుల ఉద్యమ ఉధృతం అవడంతో ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకత్వం సమస్య తీవ్రతను నాటి ప్రధాని నెహ్రూ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. కాకా, అంజయ్య, సంజీవరెడ్డి నెహ్రూ ఇంటికి వెళ్లారు. నెహ్రూ విషయం తెలుసుకొని పోరాటంలో మృతి చెందిన కార్మికుల పట్ల విచారం వ్యక్తం చేసి తన సెక్రటరీనీ పిలిపించి బిర్లాతో మాట్లాడమని చెప్పాడు.
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం కృషి
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన కాకా 15 సంవత్సరాలు బీహెచ్ఎఈఎల్లో యూనియన్ అధ్యక్షుడిగా పనిచేసి ఎంతోమంది ఉద్యోగాల కోసం కృషి చేశాడు. నాగార్జున సాగర్ డ్యాం, శ్రీశైలం ప్రాజెక్టు కట్టిన కార్మికులకు, పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణం కోసం శ్రమించిన కార్మికులకు న్యాయం జరగాలని యూనియన్ ఏర్పాటు చేసి కాకా దిశానిర్దేశం చేశాడు. మరోవైపు వాళ్ళు నివసించే ప్రాంతాల్లో గుడిసెల పోరాటం చేయించాడు. రామగుండం ఎలక్ట్రిసిటీ యూనియన్, హైదరాబాద్ ఎలక్ట్రిసిటీ యూనియన్స్ ఏర్పాటు చేసి వాటికి కాకా అధ్యక్షుడిగా పనిచేశాడు. సింగరేణి కార్మికులతో కాకా, ఆయన కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉంది. కార్మికులు తమ హృదయాల్లో కాకాని దాచుకున్నారు. బొగ్గు కార్మికుల కోసం ప్రత్యేక పీఎఫ్, పెన్షన్ సౌకర్యం కల్పించాలని పోరాటం చేసి సాధించాడు. బోనస్ లతో కూడిన వేతనాలను అందుకుంటున్నారు. అలాగే ప్రైవేట్ రంగంలోని కార్మికులకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని తొలిసారి ఆలోచన చేసిన నేత కాకా. జీవితాంతం కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం నిస్వార్థంగా కాకా కృషి చేశాడు.
- ఎనుపోతుల వెంకటేష్,
డా. బి.ఆర్. అంబేద్కర్ డిగ్రీ కళాశాల, తెలుగు శాఖ