కేంద్ర మాజీ మంత్రి, జాతీయ స్థాయి దళిత నేత, తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీలో సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఉండి సమావేశంలో ఒత్తిడి చేయడమే కాకుండా, సభను బహిష్కరించి, నిరసన తెలిపిన ఉద్యమకారుడు ‘కాకా’ వెంకటస్వామి. తెలంగాణ అంటే ఆయనకు అంత ఇష్టం.
ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నరు
తెలంగాణ వచ్చిన తర్వాతనే కళ్లార తెలంగాణన చూసి కన్ను మూస్తానని కాకా చెప్పేవారు. అదేవిధంగా ఆయన 2014 డిసెంబర్ 22న తన 81వ ఏట కన్నుమూశారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలనే తత్వం కాకాది. వ్యక్తిగతంగా నాకు కూడా కాకాతో ఎంతో అనుబంధం ఉండేది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా పలుమార్లు ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కోదండరాం, ఇంకా పలువురు పెద్దలతో సమావేశాలు జరిగినప్పుడు నేను కూడా అందులో కూర్చునే వాడిని. కాకా నన్నెంతో ఆప్యాయంగా, ప్రేమగా కుటుంబ సభ్యుడిగా చూసేవారు. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడేవారు. నియోజకవర్గానికి ఆయన వచ్చినప్పుడైన, నియోజకవర్గం ప్రజలు ఆయన వద్దకు వెళ్లినప్పుడైనా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వారి సమస్యలను ఎంతో ఓపిగ్గా వినేవారు. అధికారులను పిలిపించి సమస్యను పరిష్కరించాలని సూచించేవారు. తన నియోజకవర్గాన్ని వెంకటస్వామి సొంత కుటుంబంగా భావించేవారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా 2004లో కాంగ్రెస్ తో టీఆర్ఎస్కు పొత్తు కుదుర్చడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. 2009 ఎన్నికల బరి నుంచి కాకా స్వచ్ఛందంగా తప్పుకుని ఆ స్థానంలో చిన్న కుమారుడైన వివేకానందకు పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించారు. తెలంగాణ ఉద్యమంలో తండ్రితోపాటు ఎంపీగా వివేక్ కూడా కీలకంగా వ్యవహరించారు.
కాకా అందరికీ ఆదర్శం
తెలంగాణ రాష్ట్ర సాధనతోపాటు, ప్రాణహిత– చేవెళ్ల లాంటి ప్రాజెక్టును సాధించడంలో, బీఏఎస్ఆర్ నుంచి రక్షించడం కోసం సింగరేణి జాతీయ కార్మిక సంఘాల కోరిక మేరకు కేంద్రం నుంచి రూ. 1,100 కోట్లు అప్పు సింగరేణికి ఇప్పించిన ఘనత కాకాదే. ఒకానొక సందర్భంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీకి పార్టీ కోసం ఢిల్లీలో తనకు కేటాయించిన ఇల్లును సైతం ఇచ్చేసిన మహా వ్యక్తిత్వంగల నాయకుడాయన. దేశంలోని, రాష్ట్రంలోని పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ప్రధానంగా బొగ్గుగని కార్మికులు.. మరోవైపు అసంఘటిత కార్మికులు, నిరుపేదలు అంటే ఆయన అమితంగా ఇష్టపడేవారు. బొగ్గుగని కార్మికులకు ఇన్ కమ్ ట్యాక్సును మాఫీ చేయాలని కేంద్రంలో మంత్రిగా ఉండి పార్లమెంటులో గొంతెత్తిన మొట్టమొదటి వ్యక్తి కాకా. తెలంగాణ ఎన్నటికీ కాకా సేవలు మరచిపోదు. ఆయన అడుగుజాడలు, ఆయన కుటుంబ సభ్యులకే కాకుండా ఎందరికో ఆదర్శం.– ఎండీ మునీర్, సీనియర్ జర్నలిస్టు.