కాకా చొరవతోనే కార్మికులకు పెన్షన్ స్కీం అమలవుతుంది

కాకా చొరవతోనే కార్మికులకు పెన్షన్ స్కీం అమలవుతుంది

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ కేంద్రమంత్రి కాకా వెంకటస్వామి 10 వ  వర్థంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిర్వహించారు.  కాకా వెంకటస్వామి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.  కాకా వెంకటస్వామి బడుగు.. బలహీన వర్గాలకు  చేసిన సేవలను కాకా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు  కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవా కార్యక్రమాలు కాకా వెంకటస్వామికే దక్కుతాయన్నారు. మాజీ కేంద్రమంత్రి కాకా వెంకటస్వామి చొరవతోనే కార్మికులకు పెన్షన్ స్కీం ను ప్రవేశ పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.  పేదలకు.. బలహీన వర్గాల కుటుంబాలకు గుడిసెలు ఇప్పించి.. తన ఇంటి పేరునే గుడిసెల వెంకటస్వామిగా  మార్చుకున్నారని తెలిపారు. 

పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి 10వ వర్థంతి కార్యక్రమం జరిగింది.  ఈ కార్యక్రమంలో మేయర్ అనిల్ కుమార్, , కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కాకా అభిమానులు పాల్గొన్నారు.  కాకా తన రాజకీయ జీవితంలో మచ్చలేని గొప్ప నాయకుడన్నారు.  సింగరేణి సంస్థ మనుగడ కోసం కేంద్ర మాజీ మంత్రి.. దివంగత నేత కాకా వెంకటస్వామి సేవలు మరువలేనివని మేయర్ అనిల్ కుమార్ అన్నారు.  

బెల్లంపల్లిలో...

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేంద్రమాజీమంత్రి .. దివంగత నేత కాకా వెంకటస్వామి 10వ వర్థంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  నిరుపేదలకు దుప్పట్లు పంచి బెట్టారు.స్థానిక అండేద్కర్  చౌరస్తాలో కూలీలకు అల్పాహారం అందజేశారు.

జగిత్యాల నియోజకవర్గం కోరుట్లలో...

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో కేంద్ర మాజీ మంత్రి.. కాకా వెంకటస్వామి  వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నర్సింగరావు, కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగాయి.  కాకా చిత్రపటానికి కాంగ్రెస్ కార్యకర్తలు  పూలమాల వేసి నివాళులు అర్పించారు.  కాకా.. బడుగు.. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారన్నారు.  ప్రస్తుతం ఆయన కుటుంబం కూడా కాకా ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని బలహీన వర్గాల కోసం పని చేస్తుందన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు కీలక పాత్ర పోషించిన  మహోన్నత వ్యక్తి కాకా అని తెలిపిన జువ్వాడి నర్సింగరావు అన్నారు.