-
జి.వెంకటస్వామి సేవలను గుర్తుచేసుకున్న మంత్రులు, నేతలు..
-
ట్యాంక్ బండ్ విగ్రహం వద్ద నివాళులు
హైదరాబాద్ సిటీ, వెలుగు:బడుగుల కోసం జీవితాంతం పోరాడిన గొప్ప వ్యక్తి జి.వెంకటస్వామి(కాకా) అని పలువురు కొనియాడారు. ఇండ్లు లేని వేల మంది పేదలకు గుడిసెలు, ఇండ్ల స్థలాలు ఇప్పించారని గుర్తుచేసుకున్నారు. పేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రిగా సేవలందించారని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి 95వ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పైనున్న ఆయన విగ్రహానికి పలువురు నివాళి అర్పించారు. పేదలకు, కార్మికులకు కాకా చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. బడుగుల బాంధవుడు కాకా అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీనియర్ నేతలు జానారెడ్డి, కేశవరావు, శంకర్రావు, ఎమ్మెల్సీ ప్రభాకర్, కేంద్ర మాజీ మంత్రి వేణు గోపాల్ చారి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
నాన్న నాకు విలువలు నేర్పారు
మా నాన్న వెంకటస్వామి పేద ప్రజల కోసం పోరాడారు. హైదరాబాద్‌లో 75 వేల మందికి ఇండ్ల స్థలాలు ఇప్పించారు. ఉపాధి హామీ స్కీమ్ గురించి నాటి ప్రధాని మన్మోహన్ తో ఎంతో మాట్లాడారు. సింగరేణిని కాపాడి, వేలమందికి ఉపాధి కల్పించారు. రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీ రుణాలు మాఫీ చేయించారు. పేద విద్యార్థుల కోసం విద్యాసంస్థలు స్థాపించారు. నాన్న నాకు విలువలు నేర్పారు. విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నా. నాన్న వెంకటస్వామి ఆశయాలను మా ఫ్యామిలీ ముందుకు తీసుకెళ్తున్నది.
- చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి-
తాత బాటలో ప్రజా సేవ చేస్త
మా తాత వెంకటస్వామి 95వ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు. కాకా ఆశీర్వాదంతో పెద్దపల్లి ఎంపీగా ఎన్నికయ్యాను. ఆయన బాటలో నడుస్తూ పెద్దపల్లి ప్రజలకు సేవ చేస్తాను. తాత ప్రాతినిధ్యం వహించిన స్థానం పెద్దపల్లి నుంచి నేను ఎంపీగా గెలవడం నా అదృష్టం.
- పెద్దపల్లి ఎంపీ ..గడ్డం వంశీకృష్ణ-
కాకా వల్లే రాజకీయాల్లో ఉన్న
వెంకటస్వామి నైతిక విలువలు, ప్రజాస్వామ్య విలువలతో కూడిన రాజకీయం చేశారు. ఏ విధంగానూ పరిష్కరించరించలేని అంశాలను కూడా అవలీలగా అధిగమించిన నేత ఆయన. మమ్మల్ని ప్రోత్సహించి, వెనుకుండి నడిపించారు. ఈరోజు నేను రాజకీయాల్లో ఉన్నానంటే కాకానే కారణం. ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం ఆయన అహర్నిశలు కృషి చేశారు. బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి ఆయన గొంతుగా మేమంతా ముందుకు పోతున్నాం.
- మంత్రి పొన్నం ప్రభాకర్
ఇందిరమ్మ రాజ్యంలోనే నిజమైన గౌరవం
పేదల కోసం నిరంతరం పనిచేసిన కాకాకు ఇందిరమ్మ రాజ్యంలోనే నిజమైన గౌరవం దక్కింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కాకా జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ.. గౌరవాన్ని ఇచ్చింది. కాకా వెంకటస్వామి ఆశయాల సాధనకు నా వంతు కృషి చేస్త. కాకా ఆశయాలు నెరవేర్చేలా ఆయన కుమారులు ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్, మనుమడు ఎంపీ వంశీకృష్ణ పనిచేస్తున్నారు. నిరంతరం పేద ప్రజలకు అండగా నిలుస్తున్నా రు. కాకా సేవలు ఎప్పటికీ పేదల గుండెల్లో నిలిచిపోతాయి.
– మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి-
కాకా మాకు మార్గదర్శి
కేంద్ర రాజకీయాలను మలుపు తిప్పిన వ్యక్తి వెంకటస్వామి. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారు. మా నాన్న, కాకా చాలా సన్నిహితులు. అధికార పక్షంలో ఉన్నప్పడులు ప్రజల కోసం ఎలా పనిచేయాలి.. ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వంతో ఎలా పనిచేయించాలో తెలిసిన వ్యక్తి కాకా. తెలంగాణ కోసం ఎంతో పోరాడారు. ఆయన మాకు మార్గదర్శి.
- మంత్రి శ్రీధర్ బాబు
ఆశయాలు ముందుకు తీసుకెళ్తం
పేదల జీవితాల్లో వెలుగు నింపడానికి జీవితాంతం పోరాడిన గొప్ప వ్యక్తి కాకా వెంకటస్వామి. గుడిసెలు అనే పేరుకు సార్థకత కల్పించి పేద వాళ్లకు ఇండ్ల స్థలాలు వచ్చేలా కృషి చేశారు. కాకా ఆశయాలను ముందుకు తీసుకెళ్తం.
- మంత్రి సీతక్క
తెలంగాణ కోసం పోరాడారు
వెంకటస్వామి తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేశారు. ఇండ్లులేని లక్షల మంది పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇప్పించిన గొప్ప వ్యక్తి. తెలంగాణ కోసం సోనియాగాంధీని ఒప్పించారు. తెలంగాణ వచ్చాకే ఆయన తుదిశ్వాస విడిచారు.
- మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య