కాకా అలుపెరగని ఆమ్ ఆద్మీ

కాకలు తీరిన రాజకీయ ఉద్ధండుడు మన ‘కాకా’. ఇంటి పేరు ‘గడ్డం’తో కాకుండా, ఒక రక్త సంబంధీకుడిగా అందరి నోళ్లల్లో ‘కాకా’గా పిలువబడే స్వర్గీయ వెంకటస్వామి 91వ జయంతి ఇవాళ. కాకా ఒక విలక్షణమైన వ్యక్తి. అలుపెరగని ఆమ్ ఆద్మీ. భయమెరుగని బడుగు వర్గాల ప్రతినిధి. బతికున్నంతకాలం అంబేద్కరిజాన్ని నమ్మి గరీబోళ్ల జీవితాల్లో వెలుగు నింపిన నిఖార్సయిన నాయకుడు. ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతుందంటే ఎంతటి వారినైనా ఎదిరించి నిలిచి ఎదిగిన స్వాభిమాని. ‘మరొ యా మారో’ అన్న సిద్ధాంతాన్ని ఒంటబట్టించుకున్న నిబద్ధత ఆయనది.

నిలువ నీడలేని నిరుపేదలకు కనీసం గూడు ఉండాలన్న ధ్యేయంతో గుడిసెల పోరాటం చేసిన మానవతావాది కాకా. 1949లో ‘నేషనల్ హట్స్ యూనియన్’ స్థాపించి ఖాళీ జాగల్లో గుడిసెలు వేయించి, సర్కారు, బడా భూస్వాముల స్థలాల్లో గుడిసెలు వేసుకుని బతుకుతున్న పేదోళ్ల పక్షాన నిలబడ్డారు. అటువంటి యూనియన్ ఏర్పాటు కావటం దేశంలో అదే మొదటి సారి. ఆఖరిసారి కూడా. 20 ఏండ్ల పాటు ఆ యూనియన్ తరఫున పోరాడి దాదాపు 80వేల పైచిలుకు గుడిసెల్ని వేయించిన ఘనత కాకాకే దక్కుతుంది. ‘గుడిసెల వెంకటస్వామి’గా గరీబోళ్ల గుండెల్లో ‘కాకా’ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.

రేషన్ షాపులు ఆయన ఐడియానే

నిరుపేదలకు గూడుతోపాటు కూడు కూడా ఉండాలన్న తపనతో నిత్యావసర వస్తువుల్ని తక్కువ ధరకు అందించే ‘రేషన్ షాపు’ల ద్వారా కోట్లాది మంది పేదలకు తినడానికి తిండి దొరికేలా కృషి చేశారు. అప్పటి దాకా దేశంలో అటువంటి ముచ్చటే లేదు. తక్కువ ధరలకు పేదలకు ఉప్పు, పప్పు, బియ్యం ఇవ్వాలన్న ఆలోచనే లేదు. 1973–1977 వరకు కేంద్రంలో సివిల్ సప్లయిస్ మంత్రిగా ఉన్న టైంలో రేషన్ షాపుల ఆలోచన చేశారు ‘కాకా’.

అన్నపూర్ణ క్యాంటీన్లు

ఆయన ఆలోచనతోనే మధ్యప్రదేశ్ లో ‘అన్నపూర్ణ’ క్యాంటీన్లు రూపుదిద్దుకున్నాయి. ఈ క్యాంటీన్ల ద్వారా అల్పాదాయ వర్గాలకు టీ, టిఫిన్, భోజన సదుపాయం అందేలా చేసి హోటల్ ఓనర్ల ఆగ్రహానికి గురయ్యారు.

కార్మికులే కాకా లోకం

కాకా జీవితంలో ఎక్కువ భాగం కార్మిక లోకంతోనే గడిచింది. యూనియన్ లీడర్ గానే కాక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సుదీర్ఘ కాలం కార్మిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసే శ్రామికులకు ఆ రోజుల్లో జీతాలు చాలా తక్కువ. స్టేట్ వీఎన్టీసీ నాయకుడిగా అసంఘటిత కార్మికుల పక్షాన పెద్ద దిక్కుగా నిలబడి తన ప్రత్యేకత చాటుకున్నారు. ‘కార్మికులు కన్నీళ్లు పెడితే దేశం బాగుండదు’ అన్న సిద్ధాంతాన్ని జీవించినంత కాలం పాటించిన గొప్ప శ్రామికవాది వెంకటస్వామి.

వర్కర్ల కోసం కొట్లాట

నాగార్జునసాగర్ కడుతున్న రోజులవి(1957). రోజుకు 45 వేల మంది శ్రామికులు, 12 ఏండ్ల పాటు తమ రక్త మాంసాల్ని ధారబోసి డ్యాం, కెనాల్ పనులు చేస్తుంటే, కనీస వేతనాలు, తలదాచుకోవటానికి సరైన వసతులు గురించి పట్టించుకున్న నాథుడే లేడు. వాళ్లందర్నీ సమీకరించి, అన్యాయాల్ని ఎలుగెత్తి చాటిన లేబర్ లీడర్ మన వెంకటస్వామి. సాగర్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంటుగా వర్కర్స్ హక్కులకై కాకా పోరాటాలు చేయడం పెద్ద సాహసమే. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు, పోచంపాడు ప్రాజెక్టు వర్కర్స్ తో యూనియన్లు పెట్టి, కూలీలు, కార్మికుల సమస్యలపై పోరాడుతూనే.. మరోవైపు వాళ్లు నివసించే ప్రాంతాల్లో మెరుగైన జీవన స్థితిగతులు కల్పించడానికి కృషి చేశారు.

ఫ్యాక్టరీ పెడతానని చాలెంజ్

హైదరాబాద్ ఆస్ బెస్టాస్ కంపెనీలో మూడు రూపాయల ఇంక్రిమెంట్ ఇవ్వాలని కార్మికులు సమ్మె చేస్తే, యాజమాన్యం ససేమీరా ఒప్పుకోలేదు. పై పెచ్చు పోలీసులతో లాఠీచార్జ్ చేయించటం భరించలేక ఇదేమి అన్యాయమని నిలదీస్తే, ‘మీకు ఫ్యాక్టరీలు పెట్టడం చేతకాదు’ అని దాని యజమాని ఎగతాళిగా అంటే, అహం దెబ్బతిన్న వెంకటస్వామి ‘బిడ్డా! ఇదే కంపెనీని నేను పెట్టి చూపిస్తా చూడు’ అని చాలెంజ్ విసిరారు. ఫ్యాక్టరీ లైసెన్సు తీసుకునేంతవరకు నిద్రపోలేదు. కానీ, యూనియన్ పనుల ఒత్తిడిలో ఫ్యాక్టరీ పెట్టలేకపోయారు. ఆ లోటును తీరుస్తూ వెంకటస్వామి కుమారుడు వివేక్.. విశాక ఆస్ బెస్టాస్ ఫ్యాక్టరీని స్థాపించటం గొప్ప విషయం. అలాగే కార్మిక సంఘాలకు ఎన్నికలు పెట్టాలన్న డిమాండ్ ను తెచ్చింది కాకానే.

పెన్షన్ స్కీం ఆయన పేటెంట్

కార్మిక సమస్యలు, పరిశ్రమల పట్ల అవగాహనతోపాటు మక్కువ ఉన్న వెంకటస్వామి, కేంద్ర కార్మిక మంత్రిగా ప్రపంచం మెచ్చిన పెన్షన్ స్కీంను ప్రవేశపెట్టడం దేశ కార్మిక ఉద్యమ చరిత్రలోనే ఓ మైలురాయి. ప్రైవేట్ రంగంలో పనిచేసే కార్మికులు, కూలీలకు ముసలితనంలో భద్రత ఇవ్వాలన్నదే ఈ స్కీం ముఖ్య ఉద్దేశం. ‘ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ తీసుకుంటారు. కార్మికుడు ఏం పాపం చేసిండు?’ అన్న ఆలోచన వచ్చిందే తడవుగా అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ను ఒప్పించి పార్లమెంట్లో బిల్లు పెట్టేంత వరకు పట్టువదల్లేదు. పెన్షన్ స్కీం వివరాలు తెలుసుకునేందుకు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కాకాను జెనీవాకు ప్రత్యేకంగా ఆహ్వానించింది. 1995లో బొగ్గు గని కార్మికుల కోసం ప్రత్యేకంగా పెన్షన్ స్కీం రూపొందించిన ఖ్యాతి ఆయనకే దక్కుతుంది. దీంతోనే మన సింగరేణితోపాటు దేశం మొత్తం మీద ఉన్న బొగ్గు గని కార్మికులకు లబ్ధి చేకూరింది.

అందరికీ చదువు.. ఆయన సంకల్పం

పెద్ద చదువులు చదవకపోయినా, పిల్లలకు మంచి చదువులు చెప్పించటంలో పట్టుదలగా ఉండేవారు. వారితోపాటు ఇంగ్లిష్ నేర్చుకోవడానికి మొహమాటపడేవారు కాదు. 1950లో మొదటిసారి అంబేద్కర్ ను కలిసినప్పుడు ‘వెంకటస్వామి.. నీకున్న పేరుతో దళితులు, పేదలకు ఉన్నత చదువులు అందించే ప్రయత్నాలు ఎందుకు చేయకూడదు?’ అని ప్రశ్నించారట. ఆ రోజే అట్టడుగువర్గాలకు చదువు అందించాలని కాకా సంకల్పించుకున్నారట. అదే స్ఫూర్తితో, రాజకీయాల్లో బిజీగా ఉన్నా, తన ఆలోచనలకు రూపం ఇవ్వటానికి 23 ఏండ్లు పట్టిందని బాధ పడేవాడు. 1973లో బాగ్ లింగంపల్లిలో అంబేద్కర్ కాలేజీని ప్రారంభించి అనతికాలంలోనే శాఖోపశాఖలుగా విస్తరించి నేడు మహావృక్షంగా విరాజిల్లుతున్న ఆ విద్యాసంస్థ ఆయన నాటిన విత్తే.

కాకా.. భావితరాలకు మార్గదర్శి

నైజాం గడ్డ మీద పుట్టి, జీవితకాలం తెలంగాణే ఆశగా, శ్వాసగా బతికిన వెంకటస్వామి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే తనువు చాలిస్తానేమో అన్న బాధను అధిగమించి, చాలా కాలం అనారోగ్యంతో ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ కూడా, బతికి ఉండేందుకు పోరాడిన ఆశాజీవి. ఆయన ఆత్మవిశ్వాసం అటువంటిది. హైదరాబాద్ స్టేట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక తెలంగాణలకు ప్రాతినిథ్యం వహిస్తూ, మూడు తరాలకు నిండు ప్రతినిధిగా డిసెంబర్ 23, 2014న తనువు చాలించిన ధన్యజీవి ‘గడ్డం’ అలియాస్ ‘గుడిసెల’ అలియాస్  ‘కాకా’. భావితరాలకు మార్గదర్శిగా ఆయన సదా గుర్తుండిపోతారు. -డాక్టర్ దాసరి శ్రీనివాసులు,  ‘సంచారి’ వ్యవస్థాపకుడు.