హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాకా వెంకటస్వామి జయంతి, అంబేద్కర్ విద్యా సంస్థల ఫౌండేషన్ డే హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలో ఘనంగా జరిగింది. కాకా విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సరోజ వివేక్, సెక్రటరీ వినోద్. ఈ కార్యక్రమంలో కాకా కుటుంబ సభ్యులతో పాటు అంబేద్కర్ విద్యాసంస్థల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు పాడిన పాటలు, నవరాత్రి, బతుకమ్మ పండుగల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కాకా పట్టుదల, కృషి విద్యార్థులకు ఆదర్శమన్నారు అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సరోజ వివేక్. తాను పడ్డ కష్టాలు ఎవ్వరూ పడకూడదని అంబేద్కర్ విద్యా సంస్థలను కాకా ఏర్పాటు చేశారని చెప్పారు. పేద విద్యార్థులకు అంబేద్కర్ విద్యా సంస్థలు ఒక వరమని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు సరోజ. విద్యార్థులకు క్రమశిక్షణ అవసరమన్నారు విశాక ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ. మంచి అలవాట్లను చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలని చెప్పారు. అంబేద్కర్ విద్యాసంస్థల విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించి రోల్ మోడల్ గా నిలవాలని సూచించారు.