కాకానే నాకు స్ఫూర్తి.. ఆదర్శం

బడుగు, దళిత వర్గాలకే కాదు యావత్ తెలంగాణ కార్మిక లోకానికి నాయకత్వాన్ని అందించిన నేత ‘కాకా’ వెంకటస్వామి. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో అలాంటి నేతలు అరుదు. ఏ పదవిలో ఉన్నా ఆ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి కాకా.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) మెంబర్ గా సుదీర్ఘకాలం పనిచేశారు. కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ఆయా పదవుల్లో ఉన్నప్పుడు ఆయన తెచ్చిన సంస్కరణల ఫలాలను ఇప్పటికీ మనం పొందుతున్నాం. వెంకటస్వామిని ‘కాకా’గా పిలుస్తున్నారంటే.. ఆయన ప్రజలపై చూపిన ప్రేమ, ఆప్యాయత, అభిమానమే అందుకు కారణం. యువతకు ‘కాకా’ స్ఫూర్తి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు అప్పటి సీఎం దామోదరం సంజీవయ్య దగ్గరకు నన్ను ‘కాకా’ తీసుకెళ్లారు. నాలో ఎంతో స్ఫూర్తిని నింపారు. బడుగులను ఎలా ఐక్యం చేయాలనేది నాకు ‘కాకా’నే చెప్పి ముందుకు తీసుకెళ్లారు. ఆయన చూపిన దారిలో అందరూ నడవాలి. ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నా. సోమవారం ‘కాకా’ 91వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నా.-కె.కేశవరావు, ఎంపీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత.