నిరంతర కృషి, పట్టుదల, నిబద్ధత, అకుంఠిత దీక్ష ఉంటే అనుకున్న లక్ష్యం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. కొందరు అతి సామాన్య కుటుంబం నుంచి వస్తారు. కానీ వాళ్ల కృషి వారిని అందరికన్నా ఉన్నతంగా నిలబెడుతుంది. ఆ కోవలోకే వస్తారు కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి. కుల వివక్షత, సామాజిక అసమానతలు రాజ్యమేలుతున్న విపత్కర పరిస్థితుల్లో అట్టడుగు వర్గంలో జన్మించి, తన పట్టుదలతో జాతి గర్వించదగ్గ నేతగా, ప్రజా నాయకుడిగా ఎదిగారు. తొలుత నిజాం వ్యతిరేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న వెంకటస్వామి.. ఆర్యసమాజ్ ద్వారా ప్రభావితమై, స్వామీ రామానంద తీర్థ శిష్యరికంలో నాయకుడిగా ఎదిగారు.
ఆంధ్రలో కలవడం వద్దన్నారు
నిజాం పాలన నుంచి విముక్తి పొందిన తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతంతో కలవడాన్ని కాకా మొదటి నుంచీ వ్యతిరేకించారు. 1969 తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న ఆయన, తెలంగాణ సాధనే ధ్యేయంగా అప్పటి పాలకుల విధానాలను వ్యతిరేకించి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. ఆనాడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నేతృత్వం వహించిన “తెలంగాణ ప్రజా సమితి” తరపున పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లినా తెలంగాణ పోరాటాన్ని ఏనాడూ ఆపలేదు. వీలు చిక్కినప్పుడల్లా కాంగ్రెస్ వేదికలపై తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేవారు.
కార్మికుల సమస్యలు చూస్తూ పెరిగి..
చిన్ననాటి నుంచి కాకా జీవితం వడ్డించిన విస్తరి కాదు. చిన్నతనంలోనే తండ్రి మరణంతో కుటుంబ భారాన్ని ఆయనే మోశారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. అప్పటి నుంచి కార్మికుల బాధలు కళ్లారా చూశారు. వారి సమస్యల పరిష్కారానికై చివరి వరకూ పోరాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో కార్మిక మంత్రిగా పని చేసినప్పుడు కార్మికుల అభివృద్ధి కోసం అనేక వినూత్న పథకాలకు ప్రవేశపెట్టారు. కార్మికులు రిటైర్ అయిన తర్వాత వారికి ఆర్థిక సహాయాన్ని అందజేయడం కోసం పెన్షన్ సదుపాయాన్ని తీసుకువచ్చారు. నేడు కార్మిక వర్గం పెన్షన్ సదుపాయం పొందుతున్నారంటే అది ఆయన కృషి ఫలితమే.
అంబేద్కర్ అడుగు జాడల్లో..
చిన్ననాటి నుంచి వివక్ష, అంటరానితనం, పేదరికంలో పెరగడం ఆయా వర్గాల ప్రజలు ఉన్నత విద్యను అందుకోవడానికి సామాజిక అవరోధాలు, ఆర్థిక స్థోమత లేక మధ్యలోనే చదువు ఆపేసిన ఉదంతాలు అనేకం ఆయన కళ్లారా చూశారు. అటువంటి పరిస్థితుల నుంచి అట్టడుగు వర్గాల ప్రజలు ఆత్మగౌరవం వైపు నడవాలంటే అందుకు సరైన విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు కల్పించడమే మార్గమని, పేద, నిమ్నజాతుల ప్రజలకు విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో “అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ”ని ఏర్పాటు చేశారు. నేటికీ ఈ విద్యా సంస్థలు రాష్ట్రంలో తమ అగ్రగామిగా పేద, నిమ్న వర్గాల ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ప్రజా శ్రేయస్సు, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తూ, సామాన్య కార్మికుడి నుంచి దేశం గర్వించదగ్గ నేతగా ఎదిగి, తాను నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేసిన యోధుడు కాకా. ప్రజల కోసమే తప్ప పదవి గురించి ఆలోచించలేదు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, ఆయన చూపిన బాటలో నడుస్తూ దళిత సమాజం ముందుకు సాగాలి.
- అనిల్ మేర్జ, యూజీసీ- జూనియర్ రీసెర్చ్ ఫెల్లో, కాకతీయ వర్సిటీ