‘కాకా’ గడ్డం వెంకటస్వామి తెలంగాణలోని పేద ప్రజల గుండెల్లో ఇంకా సజీవంగా ఉన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడ్డ ఆయనను ఎవరు మరిచిపోగలరు. తెలంగాణ సాధనలోనూ కాకా పాత్ర అత్యంత కీలకం అనేది జగమెరిగిన సత్యం. మాజీ కేంద్ర మంత్రి కాకా ఎన్నో కార్మిక సంఘాల ఆవిర్భావ అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. నల్ల నేలలో కాకా జ్ఞాపకాలు సజీవం. ప్రజల నేత అంటే ఇలా ఉండాలని నిరూపించిన నేలమీద రియల్ లీడర్ కాకా. ఆయన నేటికీ పేద, బడుగు, పీడిత, తాడిత ప్రజల గుండెల్లో బతికే ఉన్నారు. మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాకా హైదరాబాద్‌కి ‘షాన్’ తెలంగాణకి ‘జాన్’. నల్ల నేల ఆప్త మిత్రుడు. పేద ప్రజల గుండె చప్పుడు. నేడు ఆయన వర్ధంతి. ప్రముఖ దళిత నాయకుడు కాకా అంచెలంచెలుగా.. దేశం గర్వించే లోక నాయకుడిగా ఎదిగాడు. ఆయన ఎన్నడూ నేల విడిచి సాము చేయలేదు. హైదరాబాద్‌లో వేలాది మంది పేదల కోసం భూపోరాటం చేసి ఇంటి స్థలం ఇప్పించిన ఘనత ఆయనదే. అందుకే ఆయనను గుడిసెల వెంకటస్వామిగా కూడా పిలుస్తారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తొలి, మలి ఉద్యమాల్లో కాకా పోరాడారు. ఉద్యమానికి ఎంతో చేయూతనిచ్చారు. స్థిరమైన రాజకీయాలకు ఆయన ఒక కేరాఫ్ అడ్రస్. నిత్యం పేదోడి కోసం, వారి హక్కుల కోసం జ్వలించే మనస్తత్వంతో పోరాడేవారు. నేల మీద ఆయన ఒక నిజమైన నేత! ఏది మాట్లాడినా, ఏది చెప్పినా కుండ బద్దలు కొట్టినట్టే ఉండేది. కాకా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా అతి సామాన్యుడు సైతం ఎవరి వయా మీడియా లేకుండానే ఆయనను కలిసే అవకాశం లభించేది. ఉమ్మడి రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నా, విపక్షంలో ఉన్నప్పటికీ పోలీసులు.. నక్సలైట్ల పేరిట అమాయకులను ఎన్కౌంటర్ చేసిన సందర్భాల్లో తీవ్రంగా, బహిరంగంగా ఖండించేవారు. కేంద్ర మంత్రిగా ఉన్నా ఎలాంటి శషబిషలు లేకుండా బాధిత కుటుంబాలను ఇంటికివెళ్లి పరామర్శించేవారు. ఆయన ఎవరికి ఏ సహాయం చేసినా చెప్పుకునేవారు కాదు.-- గుప్త దానాలు ఎక్కువగా చేసేవారు. కాకా పార్టీలకు అతీతంగా ఆయన వద్దకు సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరిని కలిసి సహాయం చేసేవారు. కాకా తదనంతరం ఆయన చిన్న కొడుకు గడ్డం వివేక్ వెంకటస్వామి తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు. కాకా పెద్దకొడుకు, మాజీ మంత్రి గడ్డం వినోద్ కూడా తండ్రి బాటలో పయనిస్తున్నారు. ఎంపీగా మనవడు వంశీ కూడా కాకా అడుగుజాడల్లో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాడు. తెలంగాణ ఉద్యమంలో వివేక్ ఎంపీగా అరెస్ట్ అయ్యారు. అయినా, ఆయన వెనుకడుగు వేయలేదు. నాటి ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులతో కలిసి ఒత్తిడి తెచ్చారు. రాజీనామాలు చేశారు. పలు పోరాట కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.
101 కార్మిక సంఘాలకు కాకా నాయకత్వం
నల్లబంగారు నేలన్నా..ఆ ప్రాంత మనుషులన్నా కాకా ఎంతో ఆప్యాయత చూపేవారు. 101 కార్మిక సంఘాలకు కాకా నాయకత్వం వహించారు. కార్మికులంటే ఆయనకు ఎంతో ప్రేమ. బీఐఎఫ్ఆర్ నుంచి ‘సిక్కు’ మార్కు పడకుండా సింగరేణిని కాపాడటంలో కాకా కీలకంగా వ్యవహరించారు. ఆర్థికంగా కేంద్రం నుంచి 1100 కోట్ల రూపాయల అప్పు, పది ఏండ్ల మారిటోరియం ఇప్పించారు. బొగ్గు గని కార్మికులకు ఐటీ మాఫీ చేయాలని, కేంద్ర మంత్రిగా ఉండి పార్లమెంటులో తాను ఉన్న ప్రభుత్వాన్ని కోరిన మొదటి ఎంపీగా కాకాను పేర్కొనవచ్చు. ఏ విషయాన్ని అయినా కాకా నిర్మోహమాటంగా చెప్పేవారు. ఆయన వద్ద దాపరికాలు, డాంబికాలు ఉండేవి కావు.కాకా ఒక తెరిచిన పుస్తకంలాంటివారు. తెలంగాణ ఉద్యమం సహా ఎన్నో ఉద్యమాలకు, పోరాటాలకు ఆయన చేయూత మరువలేనిది, విస్మరించలేనిది. ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్ట్ కోసం కాకా అప్పటి ఉమ్మడి రాష్ట్రం సీఎం వైఎస్సార్‌తో విభేదించినా ప్రాజెక్ట్ శంకుస్థాపన రోజు అక్కడికి వచ్చి వైఎస్సార్‌తో తన ఆశయం నెరవేర్చి నందుకు సభలోనే ధన్యవాదాలు చెప్పారు.
Also Read :- గత సర్కారు హయాంలో రోడ్లకు, లే అవుట్లకూ పెట్టుబడి సాయం
న్యాయం కోసం ఎవరితోనైనా ఘర్షణ పడడానికి కాకా వెనుకాడేవారు కాదు. కాకాలాంటి నేతలు దేశంలో అరుదు. ఆయన వేసిన బాటలో ఎన్నో ఆదర్శాలు. ఎన్నో జ్ఞాపకాలు నేటికీ వెంటాడుతూనే ఉంటాయి. ప్రముఖ రచయిత పి.చందు రాసిన కాకా చరిత్ర 'మేరా సఫర్' తప్పక చదవాలి. కాకా అమర్ రహే.. హర్ ఏక్ కే దిల్ మే జిందా రహే.. కాకా ఒక నేల మీది మనిషి..నిజం తప్ప అబద్ధాలు తెలియని ధీరుడు. కాకాతో నా అనుబంధం, ఆయన జ్ఞాపకాలు నిరంతరం నన్ను వెంటాడుతూనే ఉంటాయి. గ్రేట్ లెజెండ్, పీపుల్ మ్యాన్ కాకా. నల్లనేల గుండెల్లో ఆయన సజీవంగా ఉన్నారు. ఆయన అడుగు జాడలు ఎందరికో ఆదర్శం. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఇద్దరు కొడుకులు గడ్డం వివేక్ వెంకట స్వామి, గడ్డం వినోద్ ఎమ్మెల్యే లుగా ఉన్నారు. కాకా బాటలోనే ప్రజలకు సేవలు అందించడానికి వారిని చెన్నూర్, బెల్లంపల్లి ప్రజలు ఎన్నుకున్నారు. వివేక్ కొడుకు, కాకా మనవడు వంశీ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీగా సేవలందిస్తున్నారు. కాకా ఆశయాలకు అనుగుణంగా వీరు ముగ్గురూ ప్రజలకు సేవలు అందజేస్తారని ఆశిద్దాం. దళిత దిగ్గజం ‘కాకా’కు నివాళి అర్పిద్దాం.
- ఎండి. మునీర్
సీనియర్ జర్నలిస్ట్