మ్యూజికల్ గార్డెన్ మూతబడి నాలుగేండ్లు.!

మ్యూజికల్ గార్డెన్ మూతబడి నాలుగేండ్లు.!
  • ఓరుగల్లులో టూరిస్ట్ స్పాట్ గా వెలుగొందిన పార్కు
  • భద్రకాళి టెంపుల్ పక్కనే ఉండటంతో నిత్యం సందర్శకులతో కళకళ
  • 2017లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, 2020 లో పూర్తిగా క్లోజ్
  • ఏండ్లు గడుస్తున్నా చివరి దశలోనే పనులు

హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో ప్రధాన టూరిస్ట్ స్పాట్ గా కళకళలాడిన కాకతీయ మ్యూజికల్ గార్డెన్ మూతబడి ఏండ్లు గడుస్తున్నాయి. స్మార్ట్ సిటీ, కుడా ఆధ్వర్యంలో రూ.కోట్ల నిధులు వెచ్చించి పనులు చేపట్టినా, అవి మాత్రం చివరి దశ దాటడం లేదు. నాలుగేండ్లు దాటినా మ్యూజికల్ గార్డెన్ గేట్లు తెరచుకోవడం లేదు. ఫలితంగా ఓరుగల్లు జనాలు, టూరిస్టులతో గతంలో కళకళలాడిన ఈ పార్కు ఇప్పుడు కనీస సందడి లేక జనాలు మరిచిపోయే స్థితికి చేరింది.

ఏడేండ్ల కిందటే శంకుస్థాపన..

ఓరుగల్లు ప్రజలకు ఆహ్లాదం పంచడంతోపాటు టూరిస్టులను ఆకర్షించే ఉద్దేశంతో 1995లో దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో కాకతీయ మ్యూజికల్ గార్డెన్ ను ఏర్పాటు చేశారు. ఒకవైపు ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయం, మరోవైపు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ ఉండటంతో గతంలో నిత్యం వేలాది మంది సందర్శకులు ఈ పార్కుకు వచ్చేవారు. జీడబ్ల్యూఎంసీకి పెద్ద మొత్తంలోనే ఆదాయం కూడా సమకూరేది. స్మార్ట్ సిటీలో భాగంగా పార్కును డెవలప్ చేసేందుకు గత  ప్రభుత్వ హయాంలో ప్రణాళికలు రచించారు. ఈ మేరకు రూ.15 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2017 నవంబర్ 18న అప్పటి మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మ్యూజికల్ గార్డెన్ డెవలప్ మెంట్ కు శంకుస్థాపన కూడా చేశారు. కానీ, అప్పటి లీడర్లు పెద్దగా పట్టించుకోకపోవడంతో పనులు నత్తనడకన సాగాయి. 

నాలుగేండ్లుగా గేట్లు క్లోజ్..

ట్రై సిటీకి వచ్చే ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు హనుమకొండలో పబ్లిక్ గార్డెన్, ఏకశిలా పార్కు, జూపార్కు లాంటివి ఉండగా, వరంగల్ లో మాత్రం కాకతీయ మ్యూజికల్ గార్డెనే దిక్కు. మ్యూజికల్ గార్డెన్​ డెవలప్ మెంట్ కోసం 2017లోనే శంకుస్థాపన జరగగా, ఆ తర్వాత దాదాపు మూడేండ్ల పాటు పనులు డెడ్ స్లోగా నడిచాయి. అనంతరం 2020లో కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పార్కు గేట్లు క్లోజ్ చేశారు. 

లాక్ డౌన్ సడలింపుల తర్వాత చుట్టూ కాంపౌండ్ నిర్మించి, లోపల ల్యాండ్ స్కేపింగ్, డక్ పాండ్, రెండు ఫౌంటేన్ వాటర్ ఫాల్స్, బోటింగ్ చెరువు, సన్ సెట్ వ్యూ పాయింట్, వివిధ మొక్కలు, పక్షుల కోసం ప్రత్యేక ఏర్పాట్లతో పనులు చేపట్టారు. 

కానీ, అప్పటి లీడర్లు, ఆఫీసర్లు సీరియస్​గా తీసుకోకపోవడంతో  పనులు నత్తనడకన సాగాయి. దీంతో అప్పటినుంచి కాకతీయ మ్యూజికల్ గార్డెన్ గేట్లు మూసే ఉంటున్నాయి. ఇటీవల పనులు చివరి దశకు చేరుకోగా, ఫినిషింగ్ వర్క్స్ పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది. ఇకనైనా ఓరుగల్లు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు రూ.కోట్లు వెచ్చించి డెవలప్​ చేసిన కాకతీయ మ్యూజికల్ గార్డెన్ ను అందుబాటులోకి తీసుకురావాలని నగర ప్రజలతో పాటు సందర్శకులు కోరుతున్నారు.

వినియోగంలోకి తేవాలి..

భద్రకాళి గుడి మార్గంలోనే ఉండటం వల్ల దర్శనం అనంతరం కాకతీయ మ్యూజికల్ గార్డెన్ కు వెళ్లి సేద తీరేవాళ్లం. డెవలప్ మెంట్ పేరుతో పార్కును మూసేసిన పాలకులు, ప్రజలకు ఆహ్లాదాన్ని దూరం చేశారు. ఇకనైనా పార్కును రీ ఓపెన్ చేసి, అందుబాటులోకి తీసుకురావాలి.- ఏ​.రాజ్ కుమార్, వరంగల్