కేయూ ఫేక్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్ల కేసు అటకెక్కినట్లేనా ?

కేయూ ఫేక్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్ల కేసు అటకెక్కినట్లేనా ?
  •    యూనివర్సిటీ పేరున 250 ఫేక్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్లు తయారు చేసిన ముఠా
  •     వాటితోనే విదేశాలకు వెళ్లిన కొందరు స్టూడెంట్లు
  •      దేశంలోనే ఉద్యోగాలు చేస్తున్న మరికొందరు..
  •     గతంలో 26 మంది అరెస్ట్‌‌‌‌‌‌‌‌,  ఆ తర్వాత లైట్‌‌‌‌‌‌‌‌ తీసుకున్న పోలీసులు
  •     ప్రముఖుల పిల్లలు ఉండడం వల్లే కేసును వదిలేశారని ఆరోపణలు

హనుమకొండ, వెలుగు : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో కలకలం రేపిన ఫేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్ల వ్యవహారం తెరమరుగైంది. దేశంలోని వివిధ యూనివర్సిటీలతో పాటు కేయూ పేరున వందలాది నకిలీ పట్టాలు ఇష్యూ అయినట్టు గుర్తించిన పోలీసులు, వర్సిటీ ఆఫీసర్లు.. ఎలాంటి విచారణ జరపకుండానే చేతులెత్తేశారు. ఇష్యూ బయటపడి మూడేండ్లు దాటినా కేసులో అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. అయితే ఈ వ్యవహారంలో కొందరు ప్రముఖుల పిల్లలు, బంధువులు ఉండటం వల్లే ఆఫీసర్లు లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఒక్క కేయూ పేరునే 250 సర్టిఫికెట్లు

ఫారిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టడీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉద్యోగాలు చేయాలనుకునే యువతీ, యువకులే టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, వరంగల్ కేంద్రంగా కొన్ని కన్సల్టెన్సీలు, ముఠాలు ఫేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్ల దందాకు తెరలేపాయి. విదేశాల్లోని పేరు మోసిన యూనివర్సిటీల్లో చదవాలంటే గుర్తింపు పొందిన వర్సిటీతో పాటు చదువుకున్న డిగ్రీల్లో మెరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ముఖ్యం. దీంతో మెరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేని డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ స్టూడెంట్ల నుంచి నాలుగైదు లక్షలు వసూలు చేసి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి ఇచ్చారు. ఈ సర్టిఫికెట్లను చూపి వందల మంది స్టూడెంట్లు దేశం దాటి వెళ్లిపోయారు. 

2021 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21న అప్పటి టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఐ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్ల గుట్టును రట్టు చేశారు. మొత్తం మూడు విడతల్లో 26 మందిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి, వారి నుంచి 322కు పైగా నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కాకతీయ యూనివర్సిటీ నుంచే 250కి పైగా ఫేక్​ సర్టిఫికెట్లు ఇష్యూ అయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు వీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీమ్డ్ యూనివర్సిటీ (తమిళనాడు), సత్యభామ యూనివర్సిటీ (తమిళనాడు), అన్నా యూనివర్సిటీ (తమిళనాడు), మగద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ (బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), కర్నాటక స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ, బెంగళూరు యూనివర్సిటీ (కర్నాటక), రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్​హెల్త్ కర్నాటక), బుందేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ (యూపీ) పేరున మరో 150కిపైగా సర్టిఫికెట్లు జారీ అయినట్లు ఆఫీసర్లు నిర్ధారించారు.

లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రముఖుల పిల్లలు

వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేంద్రంగా కొన్ని గ్యాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, కన్సల్టెన్సీలు కొన్నేండ్ల కింది నుంచే ఫేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్ల దందా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కన్సల్టెన్సీల సహాయంతో వందల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు జారీ చేయగా, వాటితో ఎంతో మంది విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లిపోయారు. ఇంకొంతమంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రంగాల్లో స్థిరపడ్డారు. విషయం బయటకు వచ్చిన మొదట్లో పోలీసులు, కేయూ ఆఫీసర్లు ఈ కేసును సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే తీసుకున్నారు. ఈ క్రమంలోనే కాకతీయ యూనివర్సిటీ పేరున నకిలీ సర్టిఫికెట్లు పొందిన వారిలో ఓ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమారుడితో పాటు ఇంకొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో అప్పటి నుంచి కేసు దర్యాప్తు కాస్త నెమ్మదించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మూడేండ్లయినా అడుగు ముందుకు పడలే..

నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం బయట పడిన తర్వాత వర్సిటీ ఆఫీసర్లు, పోలీసుల మధ్య కోఆర్డినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో విచారణకు అడ్డంకులు ఏర్పడ్డాయి. వాస్తవానికి నిందితుల వద్ద లభించిన వివరాల మేరకు ఫేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్లతో ఎవరెవరు ఏఏ దేశాలకు వెళ్లారు ? ఎప్పుడు వెళ్లారు ? అక్కడ ఏమేం పనులు చేస్తున్నారో.. విచారణ జరపాల్సి ఉంది. అక్రమంగా విదేశాలకు వెళ్లిన వారిని ఇండియాకు రప్పించి, చట్టప్రకారం చర్యలు చేపట్టి, వారికి సహకరించిన వారిపై కూడా యాక్షన్ తీసుకోవాలి. కానీ వర్సిటీ, పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ల నడుమ సమన్వయం లేకపోవడం, ఫేక్​సర్టిఫికెట్లు పొందిన వారిలో లీడర్లు, ఆఫీసర్ల పిల్లలు ఉండడంతో కేసును కావాలనే లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణం చేతే మూడేండ్లు దాటినా కేసులో అడుగు కూడా ముందుకు పడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

మూడు స్టేషన్లలో ఫిర్యాదు చేశాం 

ఫేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్ల వ్యవహారాన్ని ముందుగా మేమే గుర్తించాం. ఈ మేరకు టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు హనుమకొండ, కేయూ, సుబేదారి పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశాం. అనంతరం రెండు, మూడు సార్లు పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు యూనివర్సిటీని విజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి వెళ్లారు. కానీ పోలీసులు విచారణ పూర్తి చేస్తేనే అసలు విషయం బయటపడుతుంది. ఈ విషయంలో పోలీస్​ ఆఫీసర్లే తగిన చర్యలు తీసుకోవాలి.

– పి.మల్లారెడ్డి, కేయూ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-