కేయూలో సెలవులు పొడిగింపు.. హాస్టళ్లకు తాళాలు

  • ఆన్​లైన్ ​క్లాసులు మాత్రమే జరుగుతాయని ప్రకటన
  • వీసీ బిల్డింగ్​ ఎదుట విద్యార్థుల ఆందోళన
  • ఉద్యమాన్ని నీరుగార్చేందుకేనని ఆరోపణ 

హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో నాన్ బోర్డర్లను ఖాళీ చేయించే పేరుతో క్యాంపస్​ లోని కాలేజీలు, హాస్టళ్లకు ఇదివరకే సెలవులు ప్రకటించిన అధికారులు... వాటిని ఈ నెల18వ తేదీ వరకు పొడిగిస్తూ శనివారం సర్క్యులర్​ జారీ చేశారు. గడువు తేదీ వరకు ఆన్​లైన్ క్లాస్​లు మాత్రమే కొనసాగుతాయని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కేయూలోని అన్ని హాస్టళ్లకు తాళాలు వేశారు. దీంతో ఆదివారం వివేకానంద రీసెర్చ్ ​స్కాలర్స్ హాస్టల్ విద్యార్థులు క్యాంపస్​లోని 

అడ్మినిస్ట్రేషన్​ బిల్డింగ్​ఎదుట 

ఆందోళనకు దిగారు. ఎంట్రన్స్​వద్ద  బైఠాయించి వీసీ తాటికొండ రమేశ్, రిజిస్ట్రార్ ​శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీహెచ్​డీ అడ్మిషన్ల అవకతవకలపై ప్రశ్నిస్తున్నందునే తమపై కక్ష కట్టారని, అందుకే హాస్టల్​వసతి లేకుండా చేసేందుకు వర్సిటీ ఆఫీసర్లు కుట్ర పన్నారని ఆరోపించారు. 
పోలీసులను అడ్డుపెట్టుకుని హాస్టళ్లను ఖాళీ చేయిస్తున్నారని, పీహెచ్​డీ అక్రమాలపై చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో ఆన్​లైన్​ క్లాస్ లు పెట్టారని, కానీ, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. రీసెర్చ్ ​స్కాలర్లు ఆఫ్​లైన్ ​క్లాసులు అటెండ్​ కాకుండా మెళకువలు ఎలా నేర్చుకోవాలో వీసీ సమాధానం చెప్పాలన్నారు. 

ALSO READ :భద్రాచలం  బీఆర్ఎస్​లో చిచ్చు! .. తాతా మధు నియామకంపై గుర్రుగా మండల కమిటీలు
 

యూజీసీ రూల్స్​తుంగలో తొక్కి, వర్సిటీల్లో ఒకటికి మించి పదవులను అనుభవిస్తున్న వారందరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీ వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్రలో భాగంగానే హాస్టళ్లు క్లోజ్​ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీ ఆఫీసర్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి చెప్పుచేతల్లో పని చేస్తున్నారని, ఇకనైనా రీసెర్చ్​ స్కాలర్లను ఇబ్బందులు పెట్టడం మానుకోవాలని డిమాండ్​ చేశారు. ఉద్యమాలు తమకు కొత్తకాదని, 24 గంటల్లోగా హాస్టళ్లను తెరిపించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

ఈ నిరసనలో యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్(కుర్సా) అధ్యక్షుడు నరేశ్​, ఎంఎస్​ఎఫ్ ​జిల్లా ఇన్​ఛార్జ్ భాస్కర్, పీడీఎస్​యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు, ఎంఎస్ఎఫ్ ఇన్​చార్జి మధు, రీసెర్చ్​స్కాలర్స్​ మాదాసీ రమేశ్, గుండేటి సుమన్, సోమ రాజు, విష్ణు, గుండు సురేశ్, సాంబయ్య, సంపత్, జానకీరామ్, ఆశీర్వాదం, విజయ్, ఎలికట్టే సతీశ్​, రంగు సతీశ్​ పాల్గొన్నారు.