
- కేయూ భూముల రక్షణపై దృష్టి పెట్టని ఆఫీసర్లు
- రూ.10 కోట్లతో ప్రహరీ నిర్మాణానికి నిరుడు మార్చిలో శంకుస్థాపన చేసిన మంత్రులు
- భూకబ్జాలపై పూర్తి కాని సర్వే
- హద్దులు తేలక ముందుకు కదలని కాంపౌండ్ పనులు
హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ భూముల పరిరక్షణ వ్యవహారం ఒకడుగు ముందుకు.. పదడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. క్యాంపస్ చుట్టూ రూ.కోట్లు విలువ చేసే భూములు ఆక్రమణకు గురి కాగా.. వాటిని పరిరక్షించేందుకు ప్రభుత్వం ఏడాది కింద కాంపౌండ్ వాల్ మంజూరు చేసింది. గతేడాది మార్చి 10న ఉమ్మడి వరంగల్ ఇన్ చార్జి మంత్రిపొంగులేటితో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలంతా హాజరై ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
కానీ, ఏడాది పూర్తయినా ఇంతవరకు పునాదులు కూడా పడలేదు. ముందుగా వర్సిటీ భూముల కబ్జాలు తేల్చి, హద్దులు నిర్ణయించాల్సి ఉండగా.. ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దీంతో ప్రభుత్వం కేయూ భూముల రక్షణ కోసం నిధులు మంజూరు చేసినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అడుగులు పడడం లేదనే విమర్శలున్నాయి.
వందల కోట్ల భూమి కబ్జా..
కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటు కోసం అప్పటి ప్రభుత్వం కుమార్ పల్లి, లష్కర్ సింగారం, పలివేల్పుల గ్రామాల పరిధిలో 673.12 ఎకరాల భూమిని సేకరించింది. కుమార్పల్లి శివారులో 188.28 ఎకరాలు, లష్కర్ సింగారంలో 309.20, పలివేల్పుల శివారులో 175.14 ఎకరాలు ఉండాలి. కానీ, సరైన రక్షణ లేని కారణంగా కేయూ భూములు ఆక్రమణకు గురయ్యాయి. యూనివర్సిటీకి చెందిన కొందరు ఉద్యోగులు, పోలీస్ ఆఫీసర్లు, పొలిటికల్ లీడర్లు, ప్రైవేటు వ్యక్తులు వర్సిటీ ల్యాండ్స్ ఆక్రమించుకున్నారు.
కొందరు ఏకంగా ఇండ్లు కట్టుకునే ఉంటున్నారు. దీనీపై కేయూ విద్యార్థి సంఘాల నేతలు పలుమార్లు ఆందోళనలు చేపట్టగా.. 2021 ఆగస్టులో అప్పటి అధికారులు డిజిటల్ సర్వే నిర్వహించి, ప్రాథమికంగా కబ్జాలను గుర్తించారు. ఆ తరువాత కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న 17 మందికి నోటీసులు ఇచ్చారు. కేయూ ల్యాండ్స్ కమిటీ ఆక్రమణలపై రిపోర్ట్ కూడా రెడీ చేసింది. కానీ, అప్పటి గులాబీ లీడర్ల ఒత్తిడితో ఆక్రమణలపై యాక్షన్ తీసుకోకుండానే వదిలేశారు.
కబ్జాలు తేల్చకపోవడంతోనే..
వర్సిటీ భూములు ఎకరాల కొద్దీ ఆక్రమణకు గురి కాగా.. కబ్జాలు తేల్చాల్సిన ఆఫీసర్లు అవేమీ పట్టించుకోకుండా, 2024 జులై 1న ఎలాంటి ఎన్క్రోచ్మెంట్స్ లేని వరంగల్–-కరీంనగర్ హైవే వైపు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమి చదును చేసే పనులు చేపట్టారు. దీంతో కబ్జాలు తేల్చకుండా కాంపౌండ్ ఎలా సాధ్యమవుతుందనే విషయంపై ‘వెలుగు’లో కథనం ప్రచురితం కావడంతో అప్పటి ఇన్చార్జి వీసీ వాకాటి కరుణ ముందుగా వర్సిటీ ల్యాండ్స్ సర్వే చేపట్టి, ఆక్రమణలు తేల్చాలని ఆదేశించారు.
జూలై 14న గుండ్లసింగారం వైపు ల్యాండ్స్ జాయింట్ సర్వే మొదలు పెట్టి రెండు రోజులకే వదిలేశారు. ఆ తరువాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు రంగంలోకి దిగడంతో సెప్టెంబర్ 11 నుంచి విజిలెన్స్, కేయూ, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు జాయింట్ సర్వే ప్రారంభించారు. కుమార్ పల్లి శివారులో 229 సర్వే నంబర్ నుంచి సర్వే స్టార్ట్ చేసి కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్ బాబు ఇల్లు సహా మరో 11 ఇండ్లు, ఆరు ఓపెన్ ప్లాట్లు కేయూ భూముల్లోనే ఉన్నట్లు నిర్ధారించారు. ఆ తరువాత గుండ్లసింగారం వైపు కూడా సర్వే పూర్తి చేసి హద్దులు నిర్ణయించారు. కానీ, వర్సిటీకి మూడో వైపు ఉన్న పలివేల్పుల శివారు సర్వే మాత్రం ఇంతవరకు పూర్తి చేయలేదు. వాస్తవానికి ఈపాటికే వర్సిటీ చుట్టూ ఆక్రమణలు గుర్తించి, హద్దులు నిర్ణయించాల్సి ఉంది. సర్వే స్టార్ట్ చేసి పది నెలలవుతున్నా ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకొని వర్సిటీ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
రూ.10 కోట్లతో ప్రహరీ మంజూరు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థి సంఘాల నేతలు, అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్(అకుట్) నేతలు కేయూ భూ కబ్జాల వ్యవహారాన్ని మరోసారి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో క్యాంపస్ చుట్టూ ఏడు కిలోమీటర్ల మేర కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.10 కోట్లు మంజూరు చేసింది. గతేడాది మార్చి 10న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శిలాఫలకం వేశారు. ఏడాది దాటుతున్నా ఇంత వరకు ప్రహరీ నిర్మాణానికి పునాది కూడా తీయకపోవడం గమనార్హం.
సర్వే దాదాపుగా పూర్తయింది..
కాకతీయ యూనివర్సిటీ భూముల సర్వే దాదాపు పూర్తయింది. పలివేల్పుల వైపు కొంత సర్వే చేసి హద్దులు నిర్ణయించాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రభుత్వానికి రిపోర్ట్ అందించి తగిన యాక్షన్ తీసుకుంటాం. ఆ తరువాత యూనివర్సిటీ భూముల రక్షణ కోసం కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభిస్తాం.- ఎన్ వాసుదేవరెడ్డి, డెవలప్మెంట్ ఆఫీసర్, కేయూ