- అనర్హులకు సీట్లు అమ్ముకున్నారని గతేడాది ఆందోళన చేపట్టిన విద్యార్థులు
- అక్రమాలు నిజమేనని తేల్చిన త్రీ మెన్ కమిటీ
- ఖాళీలు భర్తీ చేయాల్సిందిగా హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి ఆదేశాలు
- లైట్ తీసుకుంటున్న అధికారులు
- న్యాయం చేయకపోతే ఉద్యమిస్తామంటున్న విద్యార్థులు
హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్డీ లొల్లి మళ్లీ మొదలైంది. కేటగిరీ-1, కేటగిరీ-2 లో కొన్ని సీట్లను అమ్ముకుని అనర్హులను కేటాయించారంటూ గతేడాది విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దాదాపు 34 రోజుల పాటు వర్సిటీ ఆందోళనలతో అట్టుడుకగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీహెచ్డీ అడ్మిషన్లపై త్రీ మెన్ కమిటీతో విచారణ జరిపించి, అక్రమాలు నిజమేనని తేల్చింది.
ఆ తర్వాత కేటగిరీ-1, కేటగిరీ-2లో వెంటనే అర్హులైన అభ్యర్థులకు అడ్మిషన్ కల్పించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినా, వర్సిటీ అధికారులు మాత్రం ఇంతవరకు ఆ ప్రక్రియను పూర్తి చేయడం లేదు. దీంతో సోమవారం కేయూ రిజిస్ట్రార్ ఛాంబర్లో పలువురు అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయకపోతే మళ్లీ ఉద్యమిస్తామని స్పష్టం చేస్తున్నారు.
నిరుడు 34 రోజుల ఆందోళన..
కాకతీయ యూనివర్సిటీలో 2017లో పీహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వగా, మళ్లీ 2022లో అడ్మిషన్లకు షెడ్యూల్ ప్రకటించారు. ఇందులో యూజీసీ నెట్, జేఆర్ఎఫ్, గేట్, ఎంఫిల్ తదితర అర్హత కలిగిన వారికి కేటగిరీ-1, ఎంట్రన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా కేటగిరీ-2 కింద పీహెచ్డీ సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. ఈ మేరకు 2023 మార్చిలో కేటగిరీ-2 అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇచ్చి, ఆగస్టు 29న ఫలితాలు కూడా ప్రకటించారు. కాగా, మొత్తం 212 సీట్లలో కేటగిరీ-2లోని కొన్ని సీట్లను ఆఫీసర్లు విక్రయించి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
అప్పటి వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ ఆధ్వర్యంలో ఒక్కో సీటును దాదాపు రూ.2 లక్షలకు అమ్ముకున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తూ సెప్టెంబర్ 5న ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వర్సిటీ ఆఫీసర్లు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసులు పెట్టి, విద్యార్థులపై దాడులకు పాల్పడడంతో ఆందోళన తీవ్రం చేశారు. అక్టోబర్ 9 నుంచి జరగగా దాదాపు 34 రోజుల పాటు కాకతీయ యూనివర్సిటీ అట్టుడికింది.
ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు..!
విద్యార్థులు ఉద్యమం చేస్తున్న సమయంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కేయూలో స్టూడెంట్ల నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత పీహెచ్డీ అక్రమాలపై ఫిబ్రవరిలో త్రీ మెన్కమిటీ వేయగా, కమిటీ సభ్యులు అక్రమాలు నిజమేనని తేల్చారు. ఆ తరువాత ఏప్రిల్‌లో కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చారు. కానీ, ఆ సమయంలో వీసీగా ఉన్న తాటికొండ రమేశ్ కమిటీ రిపోర్ట్‌ను బహిర్గతం చేయకుండా జాగ్రత్తపడ్డారు.
దీంతో వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టి వీసీని నిలదీశాయి. వాస్తవానికి అదే రిపోర్టులో కేటగిరీ–1లో ఖాళీగా ఉన్న సీట్లను అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి కూడా సూచించింది. కానీ, వర్సిటీ అధికారులు ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు. దీంతోనే పీహెచ్డీ అభ్యర్థులు ఇప్పటికీ అడ్మిషన్ల కోసం ఆందోళనలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలాఉంటే వర్సిటీ ఆఫీసర్లే ఖాళీలు భర్తీ చేయకుండా, ఉన్నతాధికారులను కూడా తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
సీట్లు భర్తీ చేయాలని అభ్యర్థుల డిమాండ్..
ఆఫీసర్లు అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టిన అనంతరం కేటగిరీ-1లో 72, కేటగిరీ-2లో 8 సీట్లు వేకెంట్ ఉన్నట్లు తెలిసింది. మొత్తంగా 80 సీట్లు ఖాళీగా ఉండగా వాటిని అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలని పీహెచ్డీ ఆస్పిరెంట్స్, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డితోపాటు వర్సిటీ ఇన్‌ఛార్జి వీసీ వాకాటి కరుణ దృష్టికి కూడా తీసుకెళ్లారు.
ప్రభుత్వం పీహెచ్డీ సీట్ల భర్తీ విషయంలో సానుకూలంగా ఉన్నప్పటికీ వర్సిటీ అధికారులే వివిధ సాకులతో తాత్సారం చేస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సోమవారం వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద ఆందోళన చేపట్టి రిజిస్ట్రార్ మల్లారెడ్డికి వినతి పత్రం కూడా అందించారు. అర్హులైన అభ్యర్థులకు పీహెచ్డీ ప్రవేశాలు కల్పించాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. వర్సిటీ ఉన్నతాధికారులు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.