
హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.428.82 కోట్లతో వార్షిక అంచనా బడ్జెట్‌ను ప్రతిపాదించింది. కేయూ వీసీ ప్రొ.కె.ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన వర్సిటీ సెనెట్‌హాలులో శనివారం 40వ అకడమిక్ సెనెట్మీటింగ్ జరగగా, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, ఇతర సభ్యుల సమక్షంలో వర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్, ఎస్డీఎల్సీఈ డైరెక్టర్ బి.సురేశ్లాల్బడ్జెట్ ప్రవేశపెట్టారు. అకడమిక్ సెనెట్ సభ్యులు ఆమోదం తెలిపారు.
అందులో వర్సిటీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు రూ.211.41 కోట్లు, మెయింటెనెన్స్రూ.8.80 కోట్లు, పరీక్షలకు రూ.50.06 కోట్లు, అకడమిక్ కార్యక్రమాలకు రూ.8.36 కెట్లు, ఇతర డెవలప్మెంట్ కార్యక్రమాలకు రూ.84.38 కోట్లు వెచ్చిస్తున్నామని, అదే సమయంలో రూ.2.45 కోట్లు లోటు ఉంటుందని ప్రొ.సురేశ్‌లాల్ వెల్లడించారు. మొత్తం బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ఇన్ ఎయిడ్ రూపంలో రూ.195.62 కోట్లు, ఇతర వనరుల నుంచి రూ.170.55 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేశారు. వీటిలో యూజీసీ ఏరియర్స్రూపంలో రూ.32.81, అకడమిక్, ట్యూషన్ ఫీజుల రూపంలో రూ.8 కోట్లు, అంతర్గత వనరుల ద్వారా రూ.41.80 కోట్లు, ఎగ్జామినేషన్స్ డిపార్ట్మెంట్ నుంచి రూ.50.06 కోట్లు వస్తాయన్నారు.
జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా మార్పులు..
వీసీ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ 2026లో యూనివర్సిటీ స్వర్ణోత్సవ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని, జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా నూతన కోర్సులు తీసుకుని వస్తామన్నారు. బోర్డ్ అఫ్ స్టడీస్ లను బలోపేతం చేస్తామని, సిలబస్ లో మార్పులు, డిజిటలీకరణ దిశగా అడుగులు ఉంటాయన్నారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణతో పాటు టీచింగ్ స్టాఫ్ నియామకాలు, స్టూడెంట్, టీచర్ నిష్పత్తి అమలుకు కృషి చేస్తామన్నారు.
అలుమ్ని ఫండ్, కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని, సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించేందుకు రూ.293 కోట్లతో వివిధ ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అనంతరం వీసీ ప్రతాప్‌రెడ్డి 2024-–25 స్టాండింగ్ కమిటీ మినిట్స్, 2023-–24 వార్షిక నివేదిక ప్రతిపాదించగా, అకడమిక్ సెనెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. 40 ఏండ్ల ఉద్యోగ ప్రస్తానంలో వివిధ హోదాల్లో పని చేసి ఏప్రిల్ లో ఉద్యోగ విరమణ చేయనున్న ఫైనాన్సు ఆఫీసర్ తోట రాజయ్యను సన్మానించారు.