- అనుబంధ ఫ్యాకల్టీ నియామకంలో ఆఫీసర్లు రూల్స్ బ్రేక్ చేశారనే ఆరోపణలు
- నెలకు రూ.8 లక్షల చొప్పున నిధులు వృథా చేశారని విజిలెన్స్ డీజీకి ఫిర్యాదులు
- వర్సిటీలో విచారణ చేపట్టిన అధికారులు
- ఇటీవల కాకతీయ యూనివర్సిటీని విజిట్ చేసిన ఆఫీసర్లు
హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో అనుబంధ ఫ్యాకల్టీ నియామకాల్లోఅక్రమాలు జరిగాయనే విషయం మరోసారి చర్చనీయాంశమైంది. కొంతకాలంగా ఈ విషయంపై వివాదం నడుస్తుండగా.. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు, జీతాల చెల్లింపుపై ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌కు ఫిర్యాదులు అందాయి.
దీంతో తాజాగా విజిలెన్స్ ఆఫీసర్లు కాకతీయ యూనివర్సిటీని విజిట్ చేసి, అనుబంధ ఫ్యాకల్టీ నియామకానికి సంబంధించిన అంశాలపై వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే కొంతకాలంగా వివాదం నడుస్తుండటం, దాదాపు పది రోజుల కిందట ఓ వ్యక్తి ఇదే విషయమై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా వర్సిటీ వీసీతో పాటు అనుబంధ ఫ్యాకల్టీగా నియామకమైనవారందరికీ నోటీసులు జారీ కావడం కలకలం రేపింది. ఓ వైపు కోర్టు నుంచి నోటీసులు, మరోవైపు విజిలెన్స్ ఎంక్వైరీతో వర్సిటీలో జోరుగా చర్చ నడుస్తోంది.
అసలేం జరిగింది..?
రాష్ట్రంలోని వర్సిటీల్లో వివిధ సమస్యల కారణంగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలు చేపట్టడం లేదు. దీంతోనే వర్సిటీల అవసరాల మేరకు ప్రభుత్వ అనుమతితో వీసీలు అనుబంధ ఫ్యాకల్టీ(అనుబంధ అధ్యాపకుల)ని నియమించుకునే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా కాకతీయ యూనివర్సిటీలో 16 మంది అనుబంధ ఫ్యాకల్టీని నియమించారనే ఆరోపణలున్నాయి. యూజీసీ నిబంధనల ప్రకారం అనుబంధ ఫ్యాకల్టీ నియామకానికి మొదట డిపార్ట్‌మెంట్ స్థాయిలో చర్చ జరగాలి.
ఆ తరువాత నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులను సంబంధిత డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ వర్సిటీ రిజిస్ట్రార్‌కు ఫార్వార్డ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ ద్వారా ఫ్యాకల్టీని ఎంపిక చేయాలి. కానీ ఆ ప్రాసెస్ ఏదీ జరగకుండానే, వీసీ పాలక మండలి సభ్యులకు 16 మంది పేర్లను సిఫార్సు చేసి, ఆమోదింపజేశారనే ఆరోపణలున్నాయి. ఇలా గతేడాది జనవరిలో జరిగిన కేయూ ఈసీ మీటింగ్ లో 12 మందిని, ఆ తరువాత మార్చిలో జరిగిన మీటింగ్ లో మరో నలుగురిని అడ్జాంట్ ఫ్యాకల్టీగా నియమిస్తూ ఈసీ తీర్మానం చేసింది.
ఒక్కొక్కరికి నెలకు రూ.50 వేల వేతనంతో నియమించగా.. అధికారులపై ఫిర్యాదులు అందడంతో కొంతకాలం పని చేసిన తరువాత ఏడుగురిని తొలగించారు. మరో ఏడుగురి సంవత్సర కాలం పూర్తయింది. ప్రస్తుతం మరో ఇద్దరు కొనసాగుతుండగా.. అనుబంధ ఫ్యాకల్టీ నియామకంలో రూల్స్ బ్రేక్ చేయడంతో పాటు వర్సిటీ నిధులు దుర్వినియోగం చేశారంటూ అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్(అకుట్) కొద్దిరోజులుగా ఫైట్ చేస్తోంది.
అప్పట్లోనే అకుట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేయగా.. గత నెలలోనే దీనిపై సమగ్ర వివరాలు అందించాల్సిందిగా వర్సిటీ అధికారులను యూజీసీ మెయిల్ ద్వారా కోరింది. కొద్దిరోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శికి కూడా వినతిపత్రాలు అందించి, అక్రమ నియామకాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా అకుట్ ప్రతినిధులు కోరారు.
తాజాగా హైకోర్టు నుంచి నోటీసులు
కాకతీయ యూనివర్సిటీ అనుబంధ ఫ్యాకల్టీ నియామకంలో అవకతవకలు జరిగాయంటూ అప్పట్లో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. అనుబంధ ఫ్యాకల్టీల నియామకాలకు సంబంధించిన యూజీసీ నిబంధనల్లోని సెక్షన్ 4.2 తో పాటు 2014, 2021, 2023 లో రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఉన్నత విద్యా శాఖ జారీ చేసిన ఉత్తర్వులకు, తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీల చట్టం-1991లోని సెక్షన్ 49 కు విరుద్ధంగా కేయూ వీసీ, రిజిస్ట్రార్ న్యాక్ పేరు మీద 16 మంది అనుబంధ ఫ్యాకల్టీలను నియమించారని, ఈ మేరకు దుర్వినియోగమైన ప్రజాధనం తిరిగి ప్రభుత్వానికి చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని అఫిడవిట్ దాఖలు చేశారు.
దీంతో అప్పటి రిజిస్ట్రార్ శ్రీనివాసరావు అప్పట్లో ఏడుగురిని తొలగించారు. కానీ రూల్స్ బ్రేక్ చేసి నియామకాలు జరపడం, వర్సిటీ ఫండ్స్ నుంచి జీతాలు చెల్లించి నిధులు దుర్వినియోగం చేశారంటూ మరోసారి ఆయన కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో ఈ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాల్సిందిగా వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ తో పాటు మిగిలిన 16 మంది అనుబంధ ఫ్యాకల్టీకి దాదాపు పది రోజుల కిందట నోటీసులు కూడా జారీ కావడం గమనార్హం. ఈ విషయంపై వర్సిటీ అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది.
విజిలెన్స్ కు ఫిర్యాదు.. ఎంక్వైరీ స్టార్ట్
అనుబంధ ఫ్యాకల్టీ నియామకంపై ఆరోపణలు రాగా.. ఈ ఏడాది జనవరి నెలలో అకుట్ జనరల్ సెక్రటరీ మామిడాల ఇస్తారి విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా నియామకాలు చేపట్టడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. దీంతో విజిలెన్స్ అధికారులు నాలుగు రోజుల కిందట కాకతీయ యూనివర్సిటీకి వచ్చారు. ఈ మేరకు అడ్జాంట్ ఫ్యాకల్టీ నియామకంపై వివరాలు ఆరా తీస్తున్నారు.
ఇందులో భాగంగా అడ్జంట్ ఫ్యాకల్టీ నియామకానికి సంబంధించి దాదాపు తొమ్మిది ప్రశ్నలు సంధించి, వాటికి సమాధానం అందించాల్సిందిగా కేయూ వీసీకి నోటీస్ ఇచ్చినట్లు తెలిసింది. ఒకవేళ విజిలెన్స్ అధికారులు సూచించిన మేరకు ఇన్ టైంలో కేయూ ఆఫీసర్ల నుంచి సమాధానం అందకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. దీంతోనే కొంతమంది అధికారుల్లో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. వర్సిటీలో వివిధ అంశాలపై విజిలెన్స్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేయనుండగా.. అక్రమ నియామకాలు, నిధులు దుర్వినియోగంపై ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయోనని ఉత్కంఠ నెలకొంది.