- కేయూ గర్ల్స్ హాస్టల్లో స్టూడెంట్ల ధర్నా
వరంగల్, వెలుగు: ‘అన్నంలో రాళ్లొస్తున్నయ్.. నోటికాడ ముద్ద పెట్టుకునే టైంలో పురుగులు కనపడ్తున్నయ్.. నీళ్లకంటే అధ్వానంగా కర్రీలుంటున్నాయి.. ఇంత ఘోరంగా ఉంటే ఎట్ల తినాలె సార్’ అంటూ వరంగల్ కాకతీయ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ స్టూడెంట్స్శనివారం ధర్నాకు దిగారు. మధ్యాహ్నం హాస్టల్ గేట్ ముందు బైఠాయించారు. చేతిలో ఉన్న అన్నం ప్లేట్లతోనే వైస్ చాన్సలర్ ఆఫీస్‌కు బయలుదేరారు. విషయం తెలుసుకున్న అధికారులు స్టూడెంట్లు బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. పోలీసులు, హాస్టల్ సెక్యూరిటీతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే కోపంతో ఉన్న స్టూడెంట్లు చేతిలో ఉన్న పురుగుల అన్నాన్ని రోడ్డుపై పడేశారు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలంటూ నిలదీశారు. సెక్యూరిటీ, స్టూడెంట్ల మధ్య దాదాపు గంటపాటు వాదన జరిగింది. అనంతరం ఆఫీసర్లు అక్కడకు చేరుకుని స్టూడెంట్లతో మాట్లాడారు. నెలన్నర నుంచి అన్నంలో పురుగులు వస్తున్నాయని సూపర్‍వైజర్ దృష్టికి తీసుకెళ్లామని, ఇలాంటి ఫుడ్ ఎలా తినాలని అడిగితే సూటిపోటి మాటలు అంటున్నారని చెప్పారు. కేయూలో కావాల్సిన బడ్జెట్ లేదని.. మీరే తెచ్చుకోవాలని చెబుతున్నారని అన్నారు. ఇదంతా హాస్టల్ డైరెక్టర్‍కు వివరించినా ఫలితం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కామన్నారు. స్పందించిన అధికారులు మెస్ ఎంప్లాయీస్ రూడ్‌గా మాట్లాడితే యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమస్య రిపీట్ కాకుండా చూస్తామని, వారం టైం ఇవ్వాలని అడగడంతో స్టూడెంట్లు ధర్నా విరమించారు.