
- అక్రమాలు తేల్చే వరకు ఉద్యమిస్తామంటున్న విద్యార్థి సంఘాలు
- మెరిట్ లిస్ట్ ప్రకటించి చేతులు దులుపుకున్న వర్సిటీ ఆఫీసర్లు
- ఓవరాల్ మార్క్స్ రిలీజ్ చేయకపోవడంపై అనుమానాలు
- సబ్ కమిటీ వేసి విచారణ జరిపించాలని స్టూడెంట్ల డిమాండ్
- ఇంటర్వ్యూ కమిటీల్లోనూ రూల్స్పట్టించుకోలేదని ఆరోపణలు
హనుమకొండ, వెలుగు: స్టూడెంట్ల ఆందోళనలతో హనుమకొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ ఐదు రోజులుగా అట్టుడుకుతోంది. పీహెచ్డీ కేటగిరీ-–2 అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థి సంఘాల నాయకులు ధర్నాకు దిగగా, పోలీసులు వారిపై దాడి చేయడంతో వర్సిటీలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇదే టైంలో వర్సిటీ ఆఫీసర్లు హాల్‌టికెట్ నంబర్లతో కూడిన మెరిట్ లిస్ట్ ను వెబ్సైట్లో పెట్టి చేతులు దులుపుకోవడంపై స్టూడెంట్లు మండిపడుతున్నారు. టాలెంట్ఉన్న, ఎలిజిబుల్ స్టూడెంట్లకు కాకుండా ఇతరులకు సీట్లు కేటాయించారని ఆరోపిస్తున్నారు. ఇంటర్వ్యూ కమిటీల్లోనూ రూల్స్ పాటించలేదని ఆరోపిస్తున్నారు. అక్రమాలు తేలేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నెల12న ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు.
వీసీ టార్గెట్ చేశారనే ఆరోపణలు
కేయూ పరిధిలో 2017లో పీహెచ్డీ నోటిఫికేషన్ రిలీజ్ కాగా.. విద్యార్థుల ఆందోళనలతో దాదాపు ఆరేండ్ల తర్వాత గతేడాది మళ్లీ అడ్మిషన్లకు షెడ్యూల్ప్రకటించారు. వర్సిటీలో దాదాపు 28 సబ్జెక్టుల్లో 212 వరకు ఖాళీలు ఉండగా.. ఇందులో 50 శాతం సీట్లు యూజీసీ నెట్, జేఆర్ఎఫ్, గేట్, ఎంఫిల్తదితర అర్హత కలిగిన వారికి కేటగిరీ–1కింద, ఎంట్రన్స్‌టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా కేటగిరీ-–2 సీట్లు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. గతేడాది మే నెలలో కేటగిరీ–1 అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. అదే సమయంలో పార్ట్ టైం అభ్యర్థులకు సీట్లు కేటాయించేందుకు రూల్స్ బ్రేక్చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కేటగిరీ–-2 కింద మరో 50 శాతం సీట్లను నింపేందుకు ఈ ఏడాది మార్చి 21న నోటిఫికేషన్ఇచ్చి, ఇంటర్వ్యూల ప్రక్రియ అనంతరం ఆగస్టు 29న రిజల్ట్స్ప్రకటించారు. ఎంట్రన్స్ టెస్ట్ మార్కులు ప్రకటించిన ఆఫీసర్లు ఇంటర్వ్యూల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వాస్తవానికి అడ్మిషన్ కమిటీలో డీన్ఆఫ్ ఫ్యాకల్టీ, హెడ్ఆఫ్ది డిపార్ట్మెంట్, బోర్డ్ఆఫ్ స్టడీస్ చైర్మన్, రీసెర్చ్ సూపర్వైజర్, ఇతర వర్సిటీకి చెందిన ఒక ఎక్స్టర్నల్ సబ్జెక్ట్ఎక్స్పర్ట్ సభ్యులుగా ఉండాలి. కానీ ఇక్కడ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు ఉన్నాయి. అడ్మిషన్ కమిటీలో సంబంధిత డిపార్ట్మెంట్ సూపర్ వైజర్లకు బదులు, ఇతర డిపార్ట్మెంట్ల ప్రొఫెసర్లను నియమించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కంప్యూటర్ సైన్స్డిపార్ట్మెంట్లో ఇదే సమస్య తలెత్తినట్లు సమాచారం. ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్ఒక్కొక్కరిని నియమించాల్సి ఉండగా.. కొన్నిచోట్ల వీసీ ఇద్దరిని నియమించారని, ఆయన కనుసన్నల్లోనే కొందరు స్టూడెంట్లను టార్గెట్ చేసి మార్కులు తగ్గించారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఫిజికల్‌ఎడ్యుకేషన్ లో మూడు సీట్లకు 56 మంది ఎంట్రన్స్రాయగా.. అందులో టాప్ స్కోరర్‌కు ఓపెన్ కేటగిరీలో ఇవ్వాల్సి ఉన్నా.. ఆ స్థానంలో వేరే వాళ్లకు అడ్మిషన్ ఇచ్చినట్లు తెలిసింది. ఇవే కాదు మెరిట్‌లిస్ట్, ఇంటర్వ్యూల్లో కూడా అవకతవకలకు పాల్పడినట్టు విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే, కేటగిరీ–1లో మిగిలిన సీట్లను కేటగిరీ-–2లో ఫిలప్ చేయాల్సి ఉండగా.. ఆ విషయంపై వర్సిటీ ఆఫీసర్లు స్పష్టత ఇవ్వడం లేదు.
అన్ని సంఘాలు ఏకమై..
పీహెచ్డీ అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయని వర్సిటీకి చెందిన అన్ని విద్యార్థి సంఘాలు ఐక్యంగా పోరాడుతున్నాయి. ఈ నెల మొదటి నుంచి ఆందోళనలు చేపట్టాయి. ఎవరూ స్పందించకపోవడంతో కొన్ని సంఘాల నేతలు 5న కేయూ ప్రిన్సిపల్ ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు వారిని స్టేషన్ కు తరలించి కొట్టడం, రిమాండ్ కోసం జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా పోలీసులు కొట్టిన విషయం చెప్పడంతో కేయూ పీహెచ్డీ అడ్మిషన్ల విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పటినుంచి వర్సిటీ అట్టుడుకుతోంది. స్టూడెంట్జేఏసీ నేతలంతా ఏకమై క్యాంపస్‌లో ఆందోళనలు చేపడుతున్నారు. వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తొత్తుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
కమిటీ వేసి చర్యలు తీస్కుంటాం: గవర్నర్ తమిళిసై
కేయూ పీహెచ్డీ అడ్మిషన్లలో అక్రమాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి సంఘాల నేతలు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్తమిళిసైను కలిసి వినతి పత్రం ఇచ్చారు. పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వరంగల్ సీపీపై యాక్షన్ తీసుకోవాలని కోరారు. ప్రొఫెసర్లు, డీన్ల రిక్రూట్మెంట్లలోనూ అవకతవకలు జరిగాయని, రూ.2 కోట్లకు పైగా నిధుల దుర్వినియోగం చేశారని, భూముల కబ్జాలపై పట్టనట్టు వ్యవహరిస్తున్నారని తెలిపారు. గవర్నర్స్పందిస్తూ.. పోలీసుల దాడిలో గాయపడిన రాంబాబు, శ్రీకాంత్ ను పరామర్శించారు. అడ్మిషన్లలో అవకతవకలపై కమిటీ వేసి విచారణ జరిపిస్తామని చెప్పారు. పోలీసుల తీరు, వర్సిటీలో నియామకాలపై ప్రత్యేక కమిటీతో ఎంక్వైరీ చేయించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో కేయూ విద్యార్థి సంఘాల నేతలు మాచర్ల రాంబాబు, ఆరెగంటి నాగరాజు, అంకెళ్ల శ్రీకాంత్, నిమ్మల రాజేశ్, సుదగాని మధు గౌడ్, శ్రీకాంత్ గౌడ్, అజయ్ నాయక్ ఉన్నారు.
ఎవరికి భద్రత ఇస్తున్నరు:దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్
కేయూ స్టూడెంట్లను వరంగల్ సీపీ రంగనాథ్ క్రిమినల్స్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. స్టూడెంట్లపై దాడిని ఖండిస్తూ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. గాయపడిన స్టూడెంట్లను శుక్రవారం కేయూ క్యాంపస్‌లో రఘునందన్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భద్రత మాదే.. బాధ్యత మాదేనని రింగ్టోన్లు పెట్టుకున్న పోలీసులు ఎవరికి భద్రత ఇస్తున్నారని ప్రశ్నించారు. 5వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు అదుపులోకి తీసుకున్న స్టూడెంట్లను మేజిస్ట్రేట్ఎదుట హాజరు పరిచేందుకు 12 గంటలు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. గన్‌పెట్టి బెదిరించలేదని చెప్పినప్పుడే సీపీ సెల్ఫ్‌డిఫెన్స్ లో పడ్డట్టు అర్థమైందన్నారు. విద్యార్థులను క్రిమినల్స్ గా ఎక్స్పోజ్చేస్తున్న రంగనాథ్సీపీగా కొనసాగడం భావ్యమేనా అని ప్రశ్నించారు. పోలీసులు కొమ్ముకాస్తున్న పార్టీ ఇంకో నాలుగు నెలలు మాత్రమే అధికారంలో ఉంటుందన్నారు. చేతనైతే అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
పెరుగుతున్న మద్దతు
విద్యార్థి నేతలపై పోలీసులు దాడి, అడ్మిషన్ల ప్రక్రియలో అవకతవకలను నిరసిస్తూ ఈ నెల 12న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, డీఎస్పీ, సీపీఐ పార్టీల నాయకులు పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థి నేతలను పరామర్శించి, నిరసన దీక్ష, బంద్‌కు మద్దతు తెలుపుతున్నారు. కేయూ జేఏసీ నేతలు శుక్రవారం ఎస్డీఎల్సీఈ ఎదుట వరంగల్– -కరీంనగర్ మెయిన్‌రోడ్డుపై ధర్నా చేపట్టారు. వీసీ దిష్టిబొమ్మను దహనం చేశారు.