సామాన్యుని కేంద్రంగా పరిశోధనలు జరగాలి : తాటికొండ రమేశ్​

 

  •    కేయూ వీసీ ప్రొఫెసర్​ తాటికొండ రమేశ్​
  •     వర్సిటీలో రెండు రోజుల పాటు జాతీయ సదస్సు

హసన్​ పర్తి, వెలుగు : సామాన్యుని కేంద్రంగా పరిశోధనలు జరగాలని  కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేశ్​ అన్నారు. యూనివర్సిటీ కామర్స్ కళాశాల సెమినార్ హాల్​లో కేయూ కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీ, ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ వరంగల్ బ్రాంచ్ సంయుక్తంగా రెండ్రోజుల  జాతీయ సదస్సును మంగళవారం ప్రారంభించారు.  కామర్స్ కాలేజీ   ప్రిన్సిపల్, డీన్ ప్రొఫెసర్​ పి.అమరావేణి అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో  బోధనా సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులను ఉద్దేశించి వీసీ రమేశ్​ మాట్లాడారు.  

అభివృద్ధి క్షేత్రస్థాయి నుంచి  జరగాలని,   దేశ ప్రజల సగటు ఆదాయం పెరగాలన్నారు. ఇప్పటికీ మూడో వంతు ప్రజలు దారిద్ర్యరేఖ దిగువన ఉన్నారని, సంపద కొద్ది మంది చేతిలో వెళ్లకుండా,  ప్రజల కొనుగోలు శక్తి పెరగాలన్నారు.  అభివృద్ధి చెందిన  దేశాల అభివృద్ధి పేద దేశాలకు శాపంగా మారిందని పేర్కొన్నారు. అనంతరం  ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు ఆచార్య ఆచార్య వి.అప్పారావు మాట్లాడుతూ 1991 తరువాత భారతదేశం లో విస్తృత మార్పులు చోటు చేసుకున్నాయన్నారు.  కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు  చాలా ఉన్నాయని,  కోర్ విజ్ఞానం తో పాటు నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు.  ఫ్యాకల్టీ కుడా అప్ డేట్ కావాలన్నారు.

ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి ఆచార్య సంజయ్ భియాని వర్చువల్​ గా  మాట్లాడుతూ సెమినార్ లలో వచ్చే పత్రాల ద్వారా విధాన నిర్ణయాలు సులభం కావాలన్నారు. 2047 లోగా భారతదేశం అబివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఉండాలని ఆకాంక్షించారు.   హైదరాబాద్ ఐసీఎస్​ఎస్​ఆర్  గౌరవ సంచాలకుడు ఆచార్య బి.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కేయూ సెమినార్ ల పరిశోధనలు పుస్తక రూపం లో బయటకు రావాలన్నారు .  అంతకుముందు హైదరాబాద్ చాప్టర్ ఇన్​ స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ అఫ్ ఇండియా  సభ్యులు విజయ్ కిరణ్ అగస్త్య   ఉపన్యాసం చేశారు. సభాధ్యక్షురాలు ప్రొఫెసర్​ పి.అమరావేణి, సెమినార్ డైరెక్టర్ ప్రొఫెసర్​ కట్ల రాజేందర్ మాట్లాడుతూ రెండు రోజుల సదస్సు లో 4 సెషన్ లు 52 పత్రాల సమర్పణ జరుగుతుందన్నారు.

28న సాయంత్రం ముగింపు సమావేశం ఉంటుందని వివరించారు.  ఈ కార్యక్రమంలో కేయూ ఎగ్జామినేషన్స్​ కంట్రోలర్​ ప్రొఫెసర్​ ఎస్.నరసింహచారి, ప్రొఫెసర్​లు పి.వరలక్ష్మి,  కే.రాజిరెడ్డి,  కే.ఓంప్రకాష్,  చింతకింది రాజేశం, కాలేజీ అసిస్టెంట్​ రిజిస్ట్రార్ డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్   పాల్గొన్నారు. అనంతరం తెలుగు హెచ్​వోడీ ప్రొఫెసర్​ బన్న అయిలయ్య అధ్యక్షనత జరిగిన  'కాకతీయ విశ్వవిద్యాలయ తెలుగు ఆచార్యలు.. సాహిత్య సేవ' లో ముఖ్య అతిథిగా వీసీ పాల్గొని ప్రసంగించారు.