
కలకత్తా క్రైమ్ వరల్డ్
టైటిల్ : ఖాకీ: ది బెంగాల్ చాప్టర్,
ప్లాట్ ఫాం : నెట్‌ఫ్లిక్స్,
డైరెక్షన్ : దేబాత్మ మండల్, తుషార్ కాంతి రాయ్,
కాస్ట్ : ప్రొసేన్‌జిత్ ఛటర్జీ, జీత్, రిత్విక్ భౌమిక్, చిత్రాంగద సింగ్, సాశ్వత ఛటర్జీ, జాయ్ సేన్‌గుప్తా, ఆదిల్ జాఫర్ ఖాన్, మిమో చక్రవర్తి, ఆకాంషా సింగ్, శృతి దాస్, పరంబ్రత ఛటోపాధ్యాయ్
ఈ సిరీస్ కథ 2000వ దశకంలో కలకత్తాలో జరిగే నేరాలు, అవినీతి, రాజకీయ ఆధిపత్యాల చుట్టూ తిరుగుతుంది. కలకత్తాలో క్రైమ్ రేట్, కిడ్నాప్‌లు పెరిగిపోతుంటాయి. అయినా.. పోలీసులు కేసులను ఛేదించలేకపోతారు. పశ్చిమ బెంగాల్లో బాగా పేరున్న రాజకీయ నాయకుడు బరున్ రాయ్ (ప్రొసేన్‌జిత్ ఛటర్జీ) అండదండలతో గ్యాంగ్‌స్టర్ శంకర్ బారువా అలియాస్ బాఘా (సాశ్వత ఛటర్జీ) అక్రమాలు చేస్తుంటాడు.
బాఘా అనుచరులు సాగోర్ తాలూక్దార్ (రిత్విక్ భౌమిక్ ), రంజిత్ ఠాకూర్ (ఆదిల్ జాఫర్ ఖాన్) ఎన్నో తప్పులు చేస్తుంటారు. అయినా ఎవరూ పట్టించుకోరు. అప్పుడు వాళ్ల నేర సామ్రాజ్యాన్ని కూల్చివేయడానికి ఐపీఎస్ ఆఫీసర్ అర్జున్ మైత్రా (జీత్) రంగంలోకి దిగుతాడు. ఈ ప్రక్రియలో అతను అవినీతితో నిండిన రాజకీయ వ్యవస్థను, గ్యాంగ్‌స్టర్ల నుంచి లంచాలు తీసుకునే పోలీసులను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ.
పిల్లలు మారిపోతే..
టైటిల్ : బేబీ అండ్ బేబీ,
ప్లాట్ ఫాం : సన్ నెక్స్ట్ ,
డైరెక్షన్ : ప్రతాప్,
కాస్ట్ : జై, సత్యరాజ్, యోగి బాబు, ప్రజ్ఞానగ్రా, సాయి ధన్య, ఇళవరసు, శ్రీమన్, ఆనందరాజ్, రవి, సింగంపులి
మహాలింగం (సత్యరాజ్)కు ముగ్గురు కొడుకులు. వాళ్లలో మొదటి ఇద్దరు కొడుకులకు ఆడపిల్లలే పుడతారు. ఇంటికి దూరంగా ఉంటున్న శివకు మగబిడ్డ పుట్టగానే ఫ్యామిలీ నుంచి కబురు అందుతుంది. దాంతో శివ (జై), అతని భార్య ప్రియ (ప్రజ్ఞా నగ్రా) తమ బిడ్డతో ఎయిర్‌పోర్ట్‌లో విమానం కోసం ఎదురుచూస్తుంటారు. శివ ఇంటికి రాగానే మహాలింగం తన మనవడిని తమ పూర్వీకుల బంగారు ఊయల మీద వేసి వారసుడిగా ప్రకటించాలి అనుకుంటాడు.
అదే టైంలో గుణ (యోగి బాబు), అతని భార్య మలార్ (సాయి ధన్య) కూడా వాళ్ల ఇంటికి వెళ్లడానికి అదే ఎయిర్‌పోర్ట్‌లో వెయిట్ చేస్తుంటారు. అతని తండ్రి ముత్తయ్య (ఇళవరసు) ఆచారాలను బాగా నమ్ముతాడు. తనకు మనవరాలు పుడితే కుటుంబ సంపద పెరుగుతుంది అనుకుంటాడు. కానీ.. గుణ, శివల పిల్లలు ఎయిర్‌పోర్ట్‌లో అనుకోకుండా మారిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్ల కుటుంబాలకు ఈ విషయం తెలియకుండా ఎలా జాగ్రత్తపడ్డారు? తెలియాలంటే సినిమా చూడాలి.
అమెరికా అమ్మాయి..రష్యన్ అబ్బాయి!
అనోరా (మైకీ మాడిసన్) అమెరికాలోని ఒక క్లబ్లో డ్యాన్సర్‌గా పనిచేస్తుంటుంది. ఒకసారి ఆ క్లబ్‌కి ఒక రష్యన్ బిలియనీర్ కొడుకు వన్య (యురా బోరిసోవ్) అనే అతను వెళ్తాడు. అప్పుడు క్లబ్ యజమాని అనోరాని తనకు పరిచయం చేస్తాడు. తనకు కావాల్సినవి చూసుకోమని అనోరాకు చెప్తాడు. ఎందుకంటే.. ఆ క్లబ్లో అనోరాకి మాత్రమే రష్యన్ భాష తెలుసు. ఆ తర్వాత ఆమెకు 15 వేల డాలర్లు ఇచ్చి వారం పాటు తన గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండాలని చెప్తాడు వన్యా.
అందుకు అనోరా కూడా ఒప్పుకుంటుంది. అలా మొదలైన వాళ్ల పరిచయం ప్రేమగా మారుతుంది. దాంతో పెండ్లి చేసుకుంటారు. ఆ పెండ్లి వార్త తెలిసిన వన్య తల్లిదండ్రులు న్యూయార్క్‌కు తమ రౌడీలను పంపుతారు. వాళ్లు అనోరాని చేజ్ చేస్తుంటారు. అనోరా తన తెలివితేటలు, ధైర్యంతో వాళ్లను ఎలా ఎదుర్కొంది? అనేది మిగతా కథ.