
కోల్‌బెల్ట్, వెలుగు: ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించే పాలక ప్రభుత్వాలపై సీపీఐ రాజీలేని పోరాటాలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, సీనియర్ నేత కలవేని శంకర్అన్నారు. ఆదివారం రామకృష్ణాపూర్లో నిర్వహించిన సీపీఐ 99వ ఆవిర్భావ వేడుకలకు ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆవిర్భావం నుంచి సీపీఐ పోరాటాలు చేస్తోందన్నారు.
ఈ సందర్భంగా పార్టీ ఆఫీస్‌లో కేక్ కట్ చేశారు. అనంతరం సింగరేణి కార్మికవాడల్లో జెండా ఆవిష్కరించారు. కాలనీల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సీపీఐ జిల్లా సెక్రటరీ రామడుగు లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ మేకల దాస్, టౌన్ సెక్రటరీ మిట్టపెల్లి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, మహిళా నాయకురాళ్లు పెండ్యాల కమలమ్మ, గాజుల మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్‌లో వేడుకలు
నస్పూర్: సీపీఐ ఆవిర్భవ వేడుకల సందర్భంగా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 6,17వ వార్డుల్లో స్థానిక లీడర్లు జెండాలను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. 1925 డిసెంబర్ 26న కాన్పూర్‌లో ఆవిర్భవించిందని.. నాటి నుంచే దున్నే వారికి భూమి కావాలని పోరాటాలు చేసిందన్నారు. నాటి నుంచి నేటి వరకు బడుగు బలహీన వర్గాల, కార్మిక, కర్షకుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదన్నారు. గని కార్మికుల ఆశాజ్యోతి నర్సయ్య సేవలు, ఆయన త్యాగం ఈ ప్రాంత కార్మికవర్గం, ప్రజలు మర్చిపోలేదన్నారు. నేడు కార్మికులు అనుభవిస్తున్న హక్కులపై నర్సయ్య శ్రమ, పోరాటం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లీడర్లు కలవేన శంకర్, మేకల దాసు, జోగుల మల్లయ్య, బాజీ సైదా, లింగం రవి, మిర్యాల రాజేశ్వరరావు, బొడ్డు లచ్చన్న, గాదసి రాజు, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.