చేవెళ్ల, వెలుగు: కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ పాత రోజులే వస్తాయని.. జనానికి అరిగోస తప్పదని చేవెళ్ల సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లక్ష్మారెడ్డి గూడ, శేరిగూడ, రామంతాపూర్, సంకేపల్లి, అంతప్పగూడ, మంచర్లగూడ, కచ్చిరెడ్డి గూడ, లచ్చిరెడ్డి గూడ, కొత్త గూడ, పర్వేద గ్రామాల్లో ఆయన ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు.
ఈ సందర్భంగా కాలె యాదయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలిత కర్నాటకలో రైతు బంధు లేదన్నారు. కరెంట్ సరిగా ఉండదని.. నీళ్లు కూడా రావట్లేదన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ హామీలు అమలుకావట్లేదని యాదయ్య ఆరోపించారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. యాదయ్య వెంట చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మెంబర్ మర్పల్లి మాలతి, మండల పార్టీ అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్ పాల్గొన్నారు.