చేవెళ్ల, వెలుగు: ఎమ్మెల్యే కాలె యాదయ్య చేవెళ్ల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి రూ. వందల కోట్లు కూడగట్టుకున్నాడని కాంగ్రెస్ అభ్యర్థి పామెన భీం భరత్ ఆరోపించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని నాగర్ గూడ, తాళ్ల పల్లి, సీతారాంపూర్, వెంకమ్మగూడ, లక్ష్మారావుగూడ, మక్తగూడ, దోస్వాడ, తిర్మలాపూర్, ఎట్ల ఎర్రవల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా భీం భరత్ మాట్లాడుతూ.. పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలె యాదయ్య దోచుకున్న సొమ్మును కాపాడుకునేందుకు మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నాడన్నారు. జనంలో తిరిగే వారినే గెలిపించాలని భీం భరత్ కోరారు. ఆయన వెంట జిల్లా ఉపాధ్యక్షుడు బండారు ఆగిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకట్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.