కాళేశ్వరం ఖాళీ..నాణ్యతా లోపంపై సైలెంట్గా డెసిషన్

  • నాణ్యతా లోపంపై సైలెంట్ గా డెసిషన్
  • అన్నారం, సుందిళ్ల నీళ్లు గోదావరి పాలు
  • డ్యాంసేఫ్టీ ఆదేశాలతో కార్యాచరణ
  • సుందిళ్లలో 8 గేట్లు ఎత్తివేసిన అధికారులు

హైదరాబాద్: కాళేళ్వరం ఖాళీ అవుతోంది. లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన జలాశయం నాణ్యతాలోపంతో  శిథిలావస్థకు చేరడం, పిల్లర్లు కుంగిపోవడంతో నీటిని గోదావరిలోకి పంపింగ్ చేస్తున్నారు. గత నెల మేడిగడ్డలో 25వ నంబర్ పిల్లర్ నుంచి 1వ  నంబర్ పిల్లర్ వరకు కుంగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్యాం పై నుంచి మహారాష్ట్రకు రాకపోకలు నిలిపివేశారు. ప్రాజెక్టులను పరిశీలించిన కేంద్ర డ్యాంసేఫ్టీ అధికారుల బృందం అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బరాజ్ లు ప్రమాదకరంగా ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చింది. ప్రాజెక్టు ను ఖాళీ చేయాలని లేని పక్షంలో లక్షలాది మంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు. మొదట మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన నీటి పారుదల శాఖ చివరకు తోకముడవక తప్పలేదు. ఇటీవలే అన్నారం(సరస్వతి) బ్యారేజీకి రెండు పిల్లర్ల వద్ద బుంగలు ఏర్పడడంతో అప్రమత్తమైన ఇంజినీర్లు తాత్కాలిక కట్టడి చేశారు.  10,8,7 నంబర్ల గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. నీరు వెళ్లి  పోవడంతో బ్యారేజీకి ఒక వైపు ఇసుక, రాళ్లు తేలాయి. 

మేడిగడ్డ 8 గేట్లు ఎత్తి గోదారిలోకి నీరు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని మేడిగడ్డ (పార్వతి) బ్యారేజ్ 8 గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని వదలుతున్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీలు నాణ్యతగా లేవని ప్రాజెక్టులో ఉన్న నీటిని వదలాలని కేంద్ర జన వనరుల శాఖ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు గుట్టు చప్పుడు కాకుండా పార్వతి బ్యారేజ్ మధ్యలో 8 గేట్లు ఎత్తి నీటిని దిగువ గోదావరి నదిలోకి వదులుతున్నారు.త్వరలోనే  డ్యాంను ఖాళీ చేయనున్నారు. 

ప్రధానికి కనిపిస్తలేదా?

కాళేశ్వరం అవినీతి గురించి పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూనే ఉన్నం. దానిని కప్పి పుచ్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నం చేసిండు.  కేంద్ర  డ్యామ్ సేఫ్టీ టీమ్ పూర్తిగా నిర్ధారించింంది.  ప్రధాని మోదీ కూడా త‌న‌కు అవినీతి వాస‌నే ప‌డ‌దంటూ చిలుక ప‌లుకులు ప‌లికారు. ఇప్పుడు ఆయనకు మేడిగ‌డ్డ బ్యారేజీ క‌నిపిస్తలేదా లేదా? దీనిపై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ చేప‌ట్టాలి. 
రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ 

కేసీఆర్ లెటర్ రాస్తే సీబీఐ విచారిస్తుంది

కాళేశ్వరం నిర్మాణానికి రూ.40వేల కోట్ల అంచనా వేశారు. రూ.1.30 లక్షల కోట్లకు పెంచారు. కాళేశ్వరంపై తెలంగాణ సమాజమంతా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇంజినీర్ల నోరు మూయించి కేసీఆరే  ఇంజనీర్‌గా వ్యవహరించారు.  కేసీఆర్ ఉత్తరం రాస్తే 15 నిమిషాల్లో సీబీఐ విచారణ చేస్తుంది.”  

 కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్

పర్రె  పడితే బద్నాం చేస్తుండ్రు

కాళేశ్వరం దగ్గర రెండు స్లాబులు కలిసే ఎక్స్​ప్యాన్షన్ జాయింట్ దగ్గర చిన్న పర్రె పడితే ప్రాజెక్టు మొత్తం పోయిందని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి బద్నాం చేస్తున్నరు.  బట్టకాల్చి కేసీఆర్​మీదేస్తున్నరు. కాళేశ్వరం ప్రాజెక్టు  పగుళ్లను రాహుల్ గాంధీ ఫొటో తీసి ట్విట్టర్ లో పెట్టి రాజకీయం చేస్తుండు.దీన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణలో ఓ నాలుగైదు సీట్లు గెలవడానికి ట్రై చేస్తుండ్రు.