అన్ని పార్టీలతో మేఘా బంధం .. గత బీఆర్ఎస్​ సర్కారుతో పదేండ్ల పాటు చెట్టాపట్టాల్

అన్ని పార్టీలతో మేఘా బంధం .. గత బీఆర్ఎస్​ సర్కారుతో పదేండ్ల పాటు చెట్టాపట్టాల్
  • కాళేశ్వరం, పాలమూరు సహా కీలక ప్రాజెక్టులన్నీ మేఘా కంపెనీకే!
  • కాళేశ్వరం ప్రాజెక్టుతో ఫోర్బ్స్ సంపన్నుల జాబితాకెక్కిన కృష్ణారెడ్డి
  • రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే కాంగ్రెస్​కు దగ్గరయ్యే ప్రయత్నం
  • స్కిల్ వర్సిటీ కోసం సీఎస్​ఆర్​ కింద రూ.200 కోట్లు అందజేత
  • ప్రస్తుతం నారాయణపేట--–కొడంగల్ 2 ప్యాకేజీ పనులూ ఆ సంస్థకే
  • ఎన్నికల బాండ్ల కొనుగోళ్లలో టాప్​–2లో మేఘా
  • వివిధ పార్టీలకు రూ.966 కోట్ల విరాళాలు.. అందులో బీజేపీకే రూ.584 కోట్లు 

హైదరాబాద్​, వెలుగు: బీఆర్​ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​.. పార్టీ ఏదైతే ఏంది? అన్ని పార్టీలతో మేఘా కంపెనీ దోస్తీ చేస్తున్నది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి దగ్గరవుతున్నది. తెలంగాణలో పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్​ పార్టీతో సన్నిహితంగా మెదిలి కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డి, మిషన్ ​భగీరథ లాంటి మేజర్​ ప్రాజెక్టులు దక్కించుకున్న ఆ కంపెనీ.. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్​కూ చేరువవుతున్నది. ఈ క్రమంలోనే  రూ.1126.23 కోట్ల విలువైన నారాయణపేట– కొడంగల్ సెకండ్ ప్యాకేజీ -పనులను దక్కించుకుంది.

 కాంగ్రెస్​ సర్కారు  ఫోర్త్​​సిటీలో నిర్మించబోయే స్కిల్​ యూనివర్సిటీకి కార్పొరేట్​ సోషల్​ రెస్పాన్సిబిలిటీ కింద మేఘా సంస్థ ఏకంగా రూ.200 కోట్లు ఇచ్చింది. అయితే.. అధికారంలో ఉన్న పార్టీలు మేఘా ఇంజనీరింగ్​ కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వడం.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు విమర్శించడం పరిపాటిగా మారింది. అటు మేఘా యాజమాన్యం కూడా అధికారంలో ఉన్న పార్టీలతో పాటు ఎందుకైనా మంచిదని ప్రతిపక్ష పార్టీలనూ మచ్చిక చేసుకుంటున్నది. అప్పట్లో దేశవ్యాప్తంగా తొమ్మిది పార్టీలకు రూ. 966 కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో కంపెనీ సమర్పించుకోగా.. అందులో బీజేపీ, బీఆర్​ఎస్, కాంగ్రెస్​ కూడా ఉన్నాయి. 
 
ఇంతింతై..  ‘మేఘా’ అంతై! 

1989లో అప్పటి ఉమ్మడి ఏపీలో ఒక చిన్న ఫాబ్రికేషన్​యూనిట్​గా  ప్రారంభమైన మేఘా ఇంజినీరింగ్ ఎంటర్​ప్రైజెస్(MEEs)​.. మేఘా ఇంజినీరింగ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ లిమిటెడ్​ కంపెనీ(MEIL)గా  మారి క్రమంగా సాగు, తాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, టన్నెళ్లు, ఇన్​ఫ్రా, హైడల్, సోలార్ పవర్​ స్టేషన్ల నిర్మాణంతో పాటు తయారీ, వ్యాపార రంగంలో ఎదిగింది. 2000 నాటికి దేశమంతా విస్తరించిన మేఘా సంస్థ​.. ప్రస్తుతం 40 వేల మంది ఉద్యోగులతో 20 దేశాల్లో వివిధ ప్రాజెక్టులు చేపడ్తున్నది. తద్వారా గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా  రూ.31,766 కోట్ల టర్నోవర్​ సాధించింది. 

ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో దోస్తానా చేసి మేజర్​ప్రాజెక్టులను దక్కించుకోవడం మేఘా ఇంజినీరింగ్​ కంపెనీ ప్రత్యేకత. ఒకప్పుడు సివిల్​ ఇంజనీరింగ్​ ప్రాజెక్టుల్లో పెద్దగా అనుభవమే లేని మేఘా కంపెనీ.. పదేండ్ల బీఆర్ఎస్  హయాంలో కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులను చేపట్టే స్థాయికి ఎదిగింది. 2020లో ప్రకటించిన ఫోర్బ్స్​ ఇండియా అపరకుబేరుల జాబితాలో మేఘా కృష్ణారెడ్డి ఫ్యామిలీ 45వ స్థానం సాధించింది. 2014 తర్వాతే మేఘా ఫ్యామిలీ సంపద భారీగా పెరిగిందని, ముఖ్యంగా తెలంగాణలో రూ.లక్షా 2 వేల 666 కోట్ల విలువైన(ఫోర్బ్స్​ అంచనా ప్రకారం) కాళేశ్వరం, మిషన్ ​భగీరథ ప్రాజెక్టులు ఇందుకు కారణమని ఫోర్బ్స్​ అప్పట్లో వెల్లడించింది.

 రాజకీయ అండదండలతోనే మేఘా ఇంజినీరింగ్​ కంపెనీ ఉవ్వెత్తున పైకి లేచిందనే అభిప్రాయం ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత గత బీఆర్ఎస్​ సర్కారు  కాళేశ్వరం, మిషన్​భగీరథే కాకుండా రూ. 52 వేల కోట్ల అంచనాతో చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి, ఆఖరికి రూ. 2215 కోట్లతో చేపట్టిన సుంకిశాల లాంటి ప్రాజెక్టున్నింటినీ మేఘాకు కట్టబెట్టింది. కాళేశ్వరంలో 80 శాతం పనులను మేఘా దక్కించుకోగా.. పంప్ హౌస్​లలో- ఒక్క నంది మేడారం మినహా దాదాపు 20 పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ల నిర్మాణాన్ని మేఘా చేపట్టింది. ఇక పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టు పనులను తొలుత నవయుగకు ఇవ్వగా తర్వాత మేఘాకు నాటి బీఆర్ఎస్​ ప్రభుత్వం బదిలీ చేసింది. 

హైదరాబాద్​ మెట్రోవాటర్ ప్రాజెక్టు, దేవాదుల లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీం కూడా మేఘానే దక్కించుకుంది. అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా మేఘా సంస్థకు అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తూ వచ్చింది. జమ్మూకాశ్మీర్​లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జోజిలా టన్నెల్​ నిర్మాణ పనులను మేఘా సంస్థకే  కేంద్రం అప్పగించింది.  2016లో టన్నెల్​కు టెండర్లు పిలిచినప్పుడు ఎల్​ అండ్​ టీ, టన్నెల్స్​ నిర్మాణంలో అత్యంత అనుభవం ఉన్న ఇండియన్​ రైల్వేస్​కు చెందిన ఇర్కాన్​ ఇంటర్నేషనల్​ సంస్థలూ బిడ్​ దాఖలు చేసినప్పటికీ వాటిన్నింటినీ కాదని మేఘాకే టెండర్​ దక్కడం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. 

తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు కూడా దగ్గరై మేజర్​ప్రాజెక్టులను మేఘా దక్కించుకుంది. ఏపీలోని  పోలవరం ప్రాజెక్టు, రాయలసీమ లిఫ్టు స్కీం, హంద్రీనివా సుజల స్రవంతి, తమిళనాడులోని కుందా జలవిద్యుత్​ కేంద్రం, మహారాష్ట్రలోని నాగ్​పూర్​–- ముంబై హైవే, పీఎం కుసుమ్​కింద చేపట్టిన సోలార్​ పవర్​ ప్లాంట్లు,  రాజస్థాన్​లో గ్యాస్​ పైపులైన్​,  ఉత్తరప్రదేశ్​లోని గంగానీటి సరఫరా పథకం,  మధ్యప్రదేశ్​ నర్మద వ్యాలీలో కార్జోన్​ ప్రాజెక్టు.. అన్నీ మేఘా ఖాతాలోనే పడ్డాయి.

అన్ని పార్టీలకూ విరాళాలు 

2014 నుంచి 2024 వరకు పదేండ్ల కాలంలో తనకు భారీ ప్రాజెక్టులు కట్టబెట్టిన బీఆర్​ఎస్​, బీజేపీకి మేఘా కంపెనీ ఎలక్టోరల్​ బాండ్స్​ రూపంలో భారీగానే చదివించుకుంది. ఫ్యూచర్​ గేమింగ్​అండ్​ హోటల్ సర్వీసెస్​ తర్వాత అత్యధిక విలువగల ఎన్నికల బాండ్లు కొన్నది మేఘా ఇంజినీరింగ్​కంపెనీయే కావడం గమనార్హం. మేఘా మొత్తం రూ.966 కోట్ల విలువైన ఎలక్టోరల్​ బాండ్లు కొంటే ఇందులో బీజేపీకి 60 శాతం మేర రూ.584 కోట్ల చందాలిచ్చింది. ఆ తర్వాత అత్యధికంగా బీఆర్​ఎస్​ పార్టీకి రూ.195 కోట్ల విరాళాలు అందజేసింది. 

మరే ఇతర ప్రాంతీయ పార్టీకి  కూడా ఒక సంస్థ నుంచి ఇంత పెద్దమొత్తంలో ఎన్నికల విరాళం దక్కలేదు. అటు తమిళనాడులోనూ అక్కడి రూలింగ్​పార్టీ డీఎంకేకు రూ.85 కోట్లు, ఏపీలో అప్పటి రూలింగ్​పార్టీ వైఎస్సార్​కాంగ్రెస్​కు రూ.37 కోట్లు ఇచ్చిన మేఘా యాజమాన్యం.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్​కు రూ.18 కోట్లు ఇచ్చింది. లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చినందుకు ప్రతిఫలంగానే నాడు రూలింగ్​పార్టీలకు మేఘా కంపెనీ భారీగా విరాళాలిచ్చిందనే విమర్శలు వచ్చాయి. కాగా, నిరుడు డిసెంబర్​లో రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో మరోసారి కొత్త ప్రాజెక్టులు దక్కించుకోవడంపై మేఘా ఫోకస్​ పెట్టింది.

 సర్కారుకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. మొన్నటి వరదల సమయంలో రూ. 5 కోట్ల సాయం ప్రకటించిన మేఘా సంస్థ.. తాజాగా స్కిల్​ యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి సీఎస్​ఆర్ కింద రూ.  200 కోట్ల భారీ మొత్తం కేటాయించింది. కొడంగల్-నారాయణపేట స్కీంకు రూ.2,260.85 కోట్లతో సెప్టెంబర్ 14న టెండర్లు ఖరారు కాగా, 1,134.62 కోట్లతో మొదటి ప్యాకేజీ పనులను రాఘవ కన్స్ట్రక్షన్స్,  ₹1,126.23 కోట్ల విలువైన రెండో ప్యాకేజీ పనులను మేఘా కంపెనీ దక్కించుకున్నాయి. 

కాగా, బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్నప్పుడు మేఘాకు మేజర్​ ప్రాజెక్టులు కట్టబెట్టడాన్ని తప్పుపట్టిన కాంగ్రెస్​ నేతలు ఇప్పుడు సైలెంట్​ కాగా..  నాడు మేఘాను అందలం ఎక్కించిన బీఆర్ఎస్​నేతలు ఇప్పుడు కొడంగల్​ పనులను ఆ సంస్థకు ఇవ్వడాన్ని తూర్పారపడ్తున్నారు. ఈ విమర్శలు, ప్రతివిమర్శల సంగతెలా ఉన్నా మేఘా కంపెనీ మాత్రం.. అధికారపార్టీల అండదండలతో లక్ష కోట్ల టర్నోవరే లక్ష్యంగా దూసుకుపోతున్నది.