నిర్మల్,వెలుగు: నిర్మల్ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో 2009 లో ప్రారంభించిన కాళేశ్వరం ప్యాకేజీ నంబర్ 27,28 హైలెవల్ కెనాళ్ల పనులు ముందుకు సాగడంలేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి ఆధారంగా 2024 సంవత్సరం కల్లా పనులు కంప్లీట్ చేయాలనకున్న సర్కార్.. నిర్మల్ సెగ్మెంట్ లో 50 వేలు, ముథోల్ సెగ్మెంట్ లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించింది. 27వ నంబర్ కాల్వ కోసం రూ.714 కోట్లు, 28వ నంబర్ కెనాల్ కోసం రూ.486.67 కోట్లు మంజూరు చేసింది. కాంట్రాక్టర్జిల్లాలోని గుండంపల్లి, దిలావర్పూర్వద్ద పంప్ హౌజ్, కొంత మేరకు కాల్వ పనులు చేపట్టారు. దీని కోసం ఇప్పటి వరకు రూ. 444.42 కోట్లు ఖర్చు చేశారు.
ఫండ్స్ సరిపోక ప్రభుత్వం ఇటీవలే మళ్లీ రూ.298.51 కోట్లు మంజూరు చేసింది. మరో 300 ఎకరాల భూమిని అదనంగా సేకరించాలని నిర్ణయించింది. ఆఫీసర్లు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. మేడిపల్లి, బోరిగాం, చించోలి (బి), నర్సాపూర్ (జి) గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. సోన్ మండలంలోని కడ్తాల్ వద్ద మరో పంప్ హౌస్ నిర్మించనున్నారు. కడ్తాల్ నుంచి మామడ వరకు 11 కిలో మీటర్ల పొడవుతో పైప్ లైన్ వేయనున్నారు. 27వ నంబర్ ప్యాకేజీ హైలెవల్ కాల్వ పనులు మొదటి నుంచి వివాదాస్పదంగా మారాయి. ముథోల్ సెగ్మెంట్ కు సంబంధించి ప్యాకేజీ నంబర్ 28వ హైలెవల్ కాల్వ పనులు స్తంభించాయి. బిల్లులు చెల్లించకపోవడంతో నాలుగేళ్ల క్రితం కాంట్రాక్టర్పనులు నిలిపివేశారు. ముంపుబాధితులకు పరిహారం ఇవ్వకపోవడమూ పనులపై ప్రభావం చూపింది.
మరో కాంట్రాక్టర్ పై ఆశలు...
27 వ నంబర్ హైలెవల్ కాల్వ మిగిలిన పనులు పూర్తిచేయడం కోసం ప్రభుత్వం ఇటీవలే మరో కాంట్రాక్టర్ను నియమించింది. ఈ హైలెవల్ కెనాల్పూర్తయితే నిర్మల్, మామడ, లక్ష్మణచాంద, దిలావర్ పూర్, సారంగాపూర్, నర్సాపూర్ (జి), సోన్ మండలాల్లో అదనంగా యాభై వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందనుంది. కొన్ని రోజుల క్రితం రైతులకు పరిహారం డబ్బులు కూడా చెల్లించారు.
28వ ప్యాకేజీ కెనాల్ పరిస్థితి అంతే...
ముథోల్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరందించానే లక్ష్యంతో చేపట్టిన 28వ హైలెవల్ కెనాల్ కోసం ప్రభుత్వం 486.67 కోట్లు మంజూరు చేసింది. కాంట్రాక్టర్రూ. 235 కోట్లతో కేవలం 48.37 శాతం మేరకు పనులు పూర్తిచేశారు. భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తికాలేదు. ఇప్పటి వరకు 550 ఎకరాల భూమిని మాత్రమే సేకరించారు. ఇ౦కా 3,025 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో ఈ కాల్వ ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదని రైతులు పేర్కొంటున్నారు.
పనుల పూర్తికి చర్యలు తీసుకుంటున్నాం
27వ నంబర్ప్యాకేజీ హైలెవల్ కాల్వ పనులు 2024 లోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చొరవతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇంకా నాలుగు గ్రామాల్లో భూసేకరణ చేపట్టాల్సి ఉంది. కొత్తగా మరో పంప్ హౌస్ నిర్మాణాన్ని కూడా చేపడుతాం. 28వ కెనాలన్ పనులూ పూర్తయ్యేలా చూస్తున్నాం.
-రామారావు, ఇరిగేషన్ఈఈ, నిర్మల్