ఎవర్ని కాపాడ్తున్నరు?.అబద్ధాలు చెబితే మీకే నష్టం

ఎవర్ని కాపాడ్తున్నరు?.అబద్ధాలు చెబితే మీకే నష్టం

 

  • రికార్డుల్లేకుండా తప్పులు చేసి మీపై ఎందుకు వేసుకుంటున్నరు? 
  • అబద్ధాలు చెబితే మీకే నష్టం 
  • రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం 
  • అప్పటి సీఎం స్థాయిలోనే డిజైన్లు ఖరారయ్యాయన్న వెంకటేశ్వర్లు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ పెద్దల ఆమోదంతోనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అంచనాలు పెంచాల్సి వచ్చిందని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్​కు రామగుండం రిటైర్డ్​ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. ‘‘2016 మార్చి 1న మూడు బ్యారేజీలకు సంబంధించిన అంచనాలు రూపొందించారు. మేడిగడ్డ బ్యారేజీకి తొలుత రూ.2,591 కోట్ల అంచనాలు రూపొందించగా, దాన్ని రూ.4,613 కోట్లకు పెంచారు. అన్నారం బ్యారేజీ అంచనాలను రూ.1,785 కోట్ల నుంచి రూ.2,700 కోట్లకు సవరించారు. సుందిళ్ల బ్యారేజీ అంచనాలను రూ.1,437 కోట్ల నుంచి రూ.2,100 కోట్లకు పెంచారు” అని వివరించారు.కాళేశ్వరం అవకతవకలపై ఓపెన్ కోర్టు విచారణ జరుపుతున్న జ్యుడీషియల్​ కమిషన్ శుక్రవారం రిటైర్డ్ ఈఎన్సీ వెంకటేశ్వర్లును విచారించింది. అసలు అంచనాలను ఎందుకు పెంచాల్సి వచ్చిందని ప్రశ్నించింది. ‘‘బ్యారేజీలో పెద్ద పనులకు సీఈ సీడీవో ఆమోదం తెలపడం, ఫ్లడ్ బ్యాంక్స్, డైవర్షన్​చానెళ్లను తర్వాత చేర్చడం, పన్నుల్లో మార్పులు రావడం తదితర కారణాలతో అంచనాలు పెంచారు. ఇది ప్రభుత్వ పెద్దల ఆమోదంతోనే జరిగింది” అని వెంకటేశ్వర్లు సమాధానమిచ్చారు. 

డిజైన్లు ఎందుకు ఆలస్యమైనయ్? 

డిజైన్ల ఖరారుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని కమిషన్ ​ప్రశ్నించగా.. తన దగ్గర ప్రస్తుతం రికార్డుల్లేవని, తర్వాత సమర్పిస్తానని వెంకటేశ్వర్లు చెప్పగా, కమిషన్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రికార్డుల్లేనప్పుడు నోటి మాటతో అవాస్తవాలు చెప్పడం ఎందుకు? ఏ పెద్దలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు? ఎవరినో కాపాడేందుకు ఆ తప్పులను మీ భుజం పైకి ఎందుకు ఎత్తుకుంటున్నారు? దాని వల్ల మీకే నష్టం.. రికార్డుల్లోని అంశాలను మాత్రమే చెప్పాలి” అని మందలించింది. డిజైన్ల ఖరారు ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించగా.. తనకు తెలియదన్నారు. రాఫ్ట్​ డిజైన్లు, డబుల్ ​లేన్ ​రోడ్ ​బ్రిడ్జి, అబట్​మెంట్లకు సంబంధించిన డిజైన్లు ఆలస్యమయ్యాయని చెప్పారు. డిజైన్లు లేట్​అవుతున్నాయని పైఅధికారులకు గానీ, హైపవర్ కమిటీకి గానీ తెలియజేశారా? అని ప్రశ్నించగా.. లేదని బదులిచ్చారు. డిజైన్లు, డ్రాయింగ్​లను మార్చాలని సూచనలు వచ్చినా మార్పులు చేయలేదన్నారు. డిజైన్లు లేట్​అవుతుండడంతో నిర్మాణం ఆలస్యమవుతున్నదని ఏజెన్సీలు మీ దృష్టికి తీసుకొచ్చాయా? అని ప్రశ్నించగా.. అది ఆన్​సైట్​ ఇన్​స్పెక్షన్​లో భాగంగానే తన దృష్టికి వచ్చిందని చెప్పారు. అంతా అప్పటి సీఎం స్థాయిలోనే జరిగిందని తెలిపారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు అక్కడే ఉంటాయన్నారు. వాటికి రాతపూర్వక ఆదేశాలు ఉన్నాయా అని అడగ్గా.. ఓరల్ ఆర్డర్స్ ఉన్నాయని బదులిచ్చారు. ఓరల్​ఆర్డర్స్ ఎలా ఇస్తారని ప్రశ్నించగా.. పనుల్లో వేగం పెంచేందుకే ఆన్​సైట్​లోనే ఓరల్ ఆర్డర్స్​ ఇవ్వాల్సి వచ్చిందన్నారు.  

మంత్రి ఆదేశాలతోనే కాఫర్ డ్యామ్ ఎత్తు పెంపు..  

కాఫర్​ డ్యామ్​ నిర్మాణంలో మార్పులు జరిగాయని వెంకటేశ్వర్లు తెలిపారు. ఎందుకు మార్చాల్సి వచ్చిందని కమిషన్​ ప్రశ్నించగా.. ‘‘తొలుత కాఫర్ ​డ్యామ్​ను 96 మీటర్ల ఎత్తుతో ప్రతిపాదించారు. ఆ ఎత్తుతో వరదను నియంత్రించడం సాధ్యం కాదు. ఓసారి వరదలొచ్చినప్పుడు కాఫర్​ డ్యామ్​ మునిగింది. వరదను డైవర్ట్​ చేసే కాఫర్ ​డ్యామ్​ను 100 నుంచి 111 మీటర్ల ఎత్తు వరకు నిర్మించాం. అందుకే వర్షాకాలంలోనూ పనులు చేసుకోవడానికి వీలైంది’’ అని వెంకటేశ్వర్లు సమాధానమిచ్చారు. 2017 డిసెంబర్​ 27న అప్పటి ఇరిగేషన్ మంత్రి, ఈఎన్సీ జనరల్, తాను సైట్​ను పరిశీలించామని.. అక్కడి పరిస్థితిని చూసి కాఫర్​డ్యామ్​ఎత్తు పెంచాలని వారు ఆదేశించారని చెప్పారు. ఎనర్జీ డిసిపేషన్​(గేట్లు తెరిచినప్పుడు పైనుంచి వచ్చే వరద వేగాన్ని నియంత్రించేందుకు స్టిల్లింగ్ ​బేసిన్​ వద్ద చేసే ఏర్పాట్లు) స్టడీస్​ను 2023లో ఎందుకు చేశారని ప్రశ్నించగా..  ‘‘బ్యారేజీ నిర్మాణానికి ముందు ఎనర్జీ డిసిపేషన్​ స్టడీస్​ చేశాం. 2019లో తొలిసారి బ్యారేజీకి డ్యామేజ్​జరిగినప్పుడు కూడా ఆ స్టడీస్​ చేశారు. బ్యారేజీకి డ్యామేజ్​జరిగాక 2020 ఫిబ్రవరిలో ఈఎన్సీ జనరల్, అదే ఏడాది మేలో ఇరిగేషన్ శాఖ కార్యదర్శి సమావేశాలు నిర్వహించారు” అని తెలిపారు. 

ప్రాణహిత చేవెళ్లలో నష్టం రూ.750 కోట్లు..

తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాలనుకున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు 2014 వరకు రూ.14 వేల కోట్లు ఖర్చు పెట్టారని వెంకటేశ్వర్లు తెలిపారు. అందులో రూ.750 కోట్లే నష్టం జరిగిందన్నారు. 3 బ్యారేజీల పనులు ఎప్పుడు మొదలయ్యాయని ప్రశ్నించగా.. 2016 మే 2న మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్​హౌస్​లకు అప్పటి సీఎం భూమి పూజ చేశారని చెప్పారు. నిర్మాణ సంస్థలు బ్యారేజీలను పూర్తి చేసేందుకు గడువును పొడిగించాలని కోరాయా? అని ప్రశ్నించగా.. బ్యారేజీల నిర్మాణానికి గడువు మరీ తక్కువగా ఉండడంతో ఏజెన్సీలు గడువును పెంచాలని కోరాయన్నారు. 3 బ్యారేజీలకు కంప్లీషన్​  సర్టిఫికెట్లు ఇచ్చారా? అని ప్రశ్నించగా.. మేడిగడ్డ కాంట్రాక్ట్ ​సంస్థకు సబ్​స్టాన్షియల్ కంప్లీషన్ సర్టిఫికెట్, అన్నారం, సుందిళ్లను నిర్మించిన సంస్థలకు కంప్లీషన్ సర్టిఫికెట్ ​జారీ చేశారని చెప్పారు. సబ్​స్టాన్షియల్ కంప్లీషన్​ సర్టిఫికెట్​కు అగ్రిమెంట్​లో క్లాజ్​ను కూడా చేర్చారన్నారు.  

సీకెంట్​ పైల్స్​కు బ్రిటీష్ ​కోడ్స్ వాడాం: సీఈ చంద్రశేఖర్ 

బ్యారేజీల్లో సీకెంట్​ పైల్స్ నిర్మాణానికి మన దేశంలో అప్పటికి కోడ్స్ ​లేవని, అందుకే బ్రిటీష్​ కోడ్స్ వాడామని సీఈ కేఎస్ఎస్​ చంద్రశేఖర్​ వెల్లడించారు. 3 బ్యారేజీల డిజైన్లను ఐఎస్ కోడ్స్, సెంట్రల్ ​వాటర్​ కమిషన్ మాన్యువల్​ ప్రకారమే రూపొందించామన్నారు. శుక్రవారం సీఈ చంద్రశేఖర్​ను కూడా కమిషన్ విచారించింది. మన దేశంలో సీకెంట్ ​పైల్స్​తో కట్టిన ప్రాజెక్టులు ఉన్నాయా? మేడిగడ్డ బ్యారేజీలో సీకెంట్ ​పైల్స్​ను ఎందుకు వాడారు? అని కమిషన్​ ప్రశ్నించింది. ‘‘మేడిగడ్డ వద్ద బోర్ ​హోల్​ టెస్టులు చేయగా అక్కడి నేలలో ఇసుక, గులకరాళ్లు, సాండ్ స్టోన్ ​ఉన్నట్టు నిర్ధారణ అయింది. సాండ్​ స్టోన్​లో షీట్​ పైల్స్​ను పెట్టలేమని ఫీల్డ్​ ఇంజనీర్లు చెప్పారు. అందుకే మేం డయాఫ్రం వాల్ ప్రతిపాదించాం. ఎల్​ అండ్ ​టీ అధికారులతో కలిసి ఫీల్డ్​ ఇంజనీర్లు సీకెంట్​ పైల్స్ ​ గురించి చెప్పారు. తర్వాతే డిజైన్లలో మేం సీకెంట్​ పైల్స్​ను ప్రతిపాదించాం” అని చంద్రశేఖర్ వివరించారు. సీకెంట్ ​పైల్స్​కు మన దేశంలో గైడ్​లైన్స్​ఉన్నాయా? అని ప్రశ్నించగా.. ‘‘లేవు. హైడ్రాలిక్​ ప్రాజెక్టులకు వాటిని మన దేశంలో వాడలేదు. కేవలం మౌలిక వసతుల కల్పనలో మాత్రమే సీకెంట్​ పైల్స్​ పద్ధతిని వినియోగిస్తున్నారు. మనకు డిజైన్​ కోడ్స్​ కూడా లేవు. అందుకే బ్రిటీష్​ కోడ్స్​ఆధారంగా సీకెంట్​ పైల్స్​కు డిజైన్​ చేశాం” అని తెలిపారు. బ్యారేజీ డిజైన్లను పునః పరిశీలించాలని కాళేశ్వరం సీఈ రిక్వెస్ట్​ చేశారా? అని ప్రశ్నించగా.. రాఫ్ట్​ నిర్మాణ డిజైన్లను పరిశీలించాలని కోరారని, దానికి అనుగుణంగానే మార్పులు చేశామని చెప్పారు. డిజైన్ల లోపం వల్లే మేడిగడ్డ ఏడో బ్లాక్​ కుంగిందా? అని కమిషన్​ ప్రశ్నించగా.. డిజైన్లు పక్కాగా ఉన్నాయని చంద్రశేఖర్ బదులిచ్చారు.