- అక్టోబర్ 31వరకు పొడిగిస్తూ సర్కారు ఉత్తర్వులు
- క్రాస్‌ఎగ్జామినేషన్‌కు అడ్వొకేట్ల నియామకంపై డైలమా
- పది రోజుల వ్యవహారానికే రూ.కోటి దాకా డిమాండ్
- భారమంతా జస్టిస్ ఘోష్ పైనే పడటంతో విచారణ ఆలస్యం
- ఈ నెల 10 నుంచి రెండో రౌండ్ క్రాస్ ఎగ్జామినేషన్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ ఎంక్వైరీ కమిషన్ గడువును రాష్ట్ర సర్కారు మరో రెండు నెలలు పొడిగించింది. శనివారంతో కమిషన్కాలపరిమితి ముగియగా..తాజాగా అక్టోబర్ 31 వరకు గడవు పొడిగిస్తూ ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించేందుకుగానూ ఈ ఏడాది మార్చి 14న రాష్ట్ర సర్కారు జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తొలుత జూన్ 30 నాటికి ఎంక్వైరీ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి కమిషన్ అందించేలా గడువు విధించారు. పలు కారణాలతో విచారణ ఆలస్యం కావడంతో గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు. ప్రస్తుతం ఆ గడువులోపు కూడా విచారణ పూర్తి కాకపోవడంతో సర్కారు రెండోసారి గడువును పెంచింది.
Also Read:-స్పీడ్ పెంచిన హైడ్రా అప్పా చెరువులో 14 షెడ్లు నేలమట్టం
ఎంత లేదన్న మరో నెల టైం!
క్రాస్ఎగ్జామినేషన్ కోసం అడ్వొకేట్లను నియమించే ప్రక్రియను ఘోష్ వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు అడ్వొకేట్లతోనూ సంప్రదింపులూ చేసినట్టు తెలుస్తున్నది. వారు కొద్ది గంటల క్రాస్ ఎగ్జామినేషన్కే లక్షల రూపాయల ప్యాకేజీని అడుగుతున్నట్టుగా సమాచారం. ఒక్క పది రోజులు ఇక్కడ ఉండి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే దాదాపు రూ.కోటి దాకా డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. క్రాస్ ఎగ్జామినేషన్‌కు స్పెషల్అడ్వొకేట్లు లేకపోవడంతో ఆ భారమంతా ఒక్క జస్టిస్ ఘోష్‌పైనే పడింది. గత రెండు వారాల్లో ఏడుగురు అధికారులను మాత్రమే జస్టిస్ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
ఒక్కరిపైనే భారం పడుతుండడంతో విచారణ కూడా లేట్ అవుతున్నదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ క్రాస్ ఎగ్జామినేషన్కే ఎంత లేదన్న మరో నెల టైమైనా పడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన కోల్‌కతాకు వెళ్లిపోయారు. మళ్లీ వినాయకచవితి పూర్తయ్యాక రాష్ట్రానికి వస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 10 నుంచి తదుపరి రౌండ్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారని అంటున్నారు. వాళ్ల విచారణ అయ్యాక గత ప్రభుత్వంలోని ముఖ్యులనూ విచారణకు పిలవాల్సిన అవసరం రావొచ్చని, దీంతో రెండు నెలల పాటు కమిషన్ గడువును పెంచాల్సి వచ్చిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
కొనసాగుతున్న క్రాస్ ఎగ్జామినేషన్
విచారణలో భాగంగా జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్.. ఇప్పటిదాకా ఇంజినీర్లు, మాజీ సెక్రటరీల నుంచి అఫిడవిట్లను స్వీకరించారు. ఇటీవలే విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా మధ్యంతర నివేదిక సమర్పించింది. అన్ని వివరాల ఆధారంగా అప్పటి, ఇప్పటి ఇంజినీరింగ్ అధికారులను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఏడుగురి నుంచి వివరాలు రాబట్టారు. అందరూ తమ ప్రమేయమేమీ లేదని, గత ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టే చేశామని జ్యుడీషియల్ కమిషన్ ముందు చెప్పారు.
అయితే, విచారణ ఎదుర్కోవాల్సిన అధికారులు ఎక్కువగా ఉండడం, కమిషన్ నుంచి జస్టిస్ పీసీ ఘోష్ ఒక్కరే విచారణ చేస్తుండడంతో ఎంక్వైరీ కాస్తా ఆలస్యమవుతున్నదని అధికార వర్గాలు చెప్తున్నాయి. వాస్తవానికి క్రాస్ ఎగ్జామినేషన్ కోసం ఇద్దరు లాయర్లను నియమించుకుంటానని గతంలో జస్టిస్ పీసీ ఘోష్ చెప్పినా.. అది కార్యరూపం దాల్చడం లేదు.
తెలుగు రాష్ట్రాలు, బెంగాల్‌కు చెందిన వాళ్లను మినహాయించి ఇతర రాష్ట్రాలకు చెందిన ఎవరైనా సరే అడ్వొకేట్లను నియమించుకోవాలని జస్టిస్ ఘోష్ భావించారు. ఆయా రాష్ట్రాలవాళ్లయితే విచారణను ప్రభావితం చేస్తారన్న ఆలోచనతోనే ముంబై, ఢిల్లీ లేదా ఇతర నగరాలకు చెందిన ప్రముఖ అడ్వొకేట్లను నియమించి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని జస్టిస్ ఘోష్ భావించినట్టు తెలిసింది.