- నవయుగ సంస్థ ప్రతినిధుల తీరుపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం
- సంస్థ డైరెక్టర్, ఇద్దరు ప్రాజెక్ట్ ఇన్చార్జుల విచారణ
- సుందిళ్ల బ్యారేజీ ఓఅండ్ఎం ఎప్పటిదాకా ఉందన్న కమిషన్
- ప్రభుత్వం ప్రత్యేకంగా ఒప్పందం చేసుకోవాలన్న సంస్థ డైరెక్టర్ రమేశ్
- ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం జరగలేదు
- సీసీ బ్లాకులు కొట్టుకపోవడంతోనే వరద వేగం పెరిగింది
- సీపేజీలున్నచోట సమస్యలను పరిష్కరించాం
- రిపేర్లు చేసినా ఇప్పటికీ బిల్లులు రాలేదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: నవయుగ సంస్థ ప్రతినిధులపై కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. సంస్థ డైరెక్టర్, మరో ఇద్దరు ప్రతినిధుల అఫిడవిట్లు మక్కీకి మక్కీ ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. డైరెక్టర్ ఇచ్చిన అఫిడవిట్‌నే కాపీ పేస్ట్ చేసుకొచ్చారా’’ అని మిగతా ఇద్దరు ప్రతినిధులను నిలదీసింది.
సుందిళ్ల బ్యారేజీని నిర్మించిన నవయుగ సంస్థ డైరెక్టర్ రమేశ్, ఆ సంస్థ ప్రాజెక్ట్ ఇన్చార్జులు ఈశ్వరరావు, మాధవ్ గురువారం కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. ‘‘బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి కంప్లీషన్ సర్టిఫికెట్లు వచ్చాయా?’’ అని డైరెక్టర్ రమేశ్‌ను కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ ప్రశ్నించగా.. వచ్చాయని తెలిపారు.
బ్యారేజీ పూర్తయ్యాక సంస్థ ఎప్పటిదాకా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓ అండ్ ఎం) చూడాల్సి ఉంటుందని జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు. వాస్తవానికి బ్యారేజీ నిర్మాణం పూర్తయ్యాక సెపరేట్‌గా ఓ అండ్ ఎంపై ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని.. కానీ, ఇప్పటివరకు అలాంటి ఒప్పందం జరగలేదని రమేశ్ చెప్పారు.
సీసీ బ్లాకులు కొట్టుకపోవడం వల్లే..
సుందిళ్ల బ్యారేజీలో సీపేజీలు ఎందుకు వచ్చాయని, వరద ప్రవాహవేగం అమాంతం ఎందుకు పెరిగిందని, వాటిని అరెస్ట్ చేయడానికి నవయుగ సంస్థ తీసుకున్న చర్యలేమిటని ఆ సంస్థ డైరెక్టర్ రమేశ్‌ను కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు. తొలుత బ్యారేజీలోని ఒక బ్లాకులో ఉన్న సీసీ బ్లాకుల కింద సీపేజీ ఏర్పడిందని, ఫలితంగా బ్యారేజీలోని అన్ని సీసీ బ్లాకులపై ఎఫెక్ట్ పడి అన్ని బ్లాకులు కొట్టుకుపోయాయని రమేశ్ చెప్పారు.
గ్రౌటింగ్ చేయడం ద్వారా ఆ సీపేజీలను నియంత్రించామన్నారు. సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం వల్లే వరద ప్రవాహవేగం చాలా ఎక్కువగా రికార్డయిందని తెలిపారు. ఇవన్నీ బ్యారేజీ డిజైన్లకు సంబంధించిన అంశాలన్నారు. అయితే, 2022లో వచ్చిన భారీ వరదలతో బ్యారేజీకి పెద్ద నష్టం జరిగిందని చెప్పారు. బ్యారేజీల డిజైన్లను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేస్తుందని, వాటి పారామీటర్లు తమకు చెప్పలేదని అన్నారు. తమ సంస్థ సిబ్బంది ప్రస్తుతం బ్యారేజీ వద్ద విధులు నిర్వర్తిస్తున్నారని, అక్కడ ఇప్పుడు ఎలాంటి యాక్టివిటీ జరగడం లేదని ఆయన తెలిపారు.
ప్రభుత్వం, అధికారులు సిఫార్సు చేసిన టెస్టులు, రిపేర్లను పూర్తి చేశామని.. వాటి రిపోర్టులూ ఇచ్చామని.. సంబంధిత అధికారులు సంతృప్తి చెందారని పేర్కొన్నారు. అయితే, ప్రాజెక్టుకు సంబంధించి ఫైనల్ బిల్లులను ప్రభుత్వం ఇంకా చెల్లించలేదన్నారు. బిల్లులను క్లియర్ చేయాల్సిందిగా కోరినా ఇప్పటి వరకు క్లియర్ కాలేదని ఆయన తెలిపారు.
సప్లిమెంట్ కాంట్రాక్ట్ ఉందా.. లేదా?
సుందిళ్ల బ్యారేజీ పనులు ఎప్పుడు పూర్తయ్యాయని నవయుగ సంస్థ ప్రాజెక్ట్ ఇన్చార్జ్ ఈశ్వర రావును జస్టిస్ ఘోష్ ప్రశ్నించగా.. 2021 డిసెంబర్లో పూర్తయ్యాయని బదులిచ్చారు. ఈ క్రమంలోనే ఆయన అఫిడవిట్‌ను పరిశీలించిన కమిషన్.. ‘‘మీ డైరెక్టర్ అఫిడవిట్‌లోని అంశాలను కాపీ పేస్ట్ చేసి తీసుకొచ్చారా?’’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫైనల్ ఎస్టిమేట్స్‌కు డిపార్ట్మెంట్ ఎప్పుడు ఆమోదం తెలిపిందని కమిషన్ ప్రశ్నించగా.. 2023లో క్లియరెన్స్ వచ్చిందన్నారు.
బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి ఏదైనా సప్లిమెంట్ అగ్రిమెంట్ (అదనపు ఒప్పందం) జరిగిందా.. జరిగితే ఎప్పుడు జరిగింది.. ఒరిజినల్ ఒప్పందం ఎప్పుడు చేసుకున్నారు? అని కమిషన్ ప్రశ్నించింది. 2016 జులై 15న ఒరిజినల్ ఒప్పందం జరగ్గా.. 2023లో సప్లిమెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నామని వివరించారు. అయితే, సప్లిమెంట్ కాంట్రాక్ట్ ఏమైనా తీసుకున్నారా? అని కమిషన్ ప్రశ్నించింది. దానికి ‘లేదు’ అని ఈశ్వరరావు బదులివ్వగా.. కమిషన్ అసహనం వ్యక్తం చేసింది.
అఫిడవిట్లో మాత్రం సప్లిమెంట్ కాంట్రాక్ట్ ఉన్నట్టు చెప్పారు కదా’’ అని ప్రశ్నించింది. బ్యాంక్ గ్యారంటీలు ఇప్పటికీ అమలులో ఉన్నాయా? అని కమిషన్ ప్రశ్నించగా.. 2024 అక్టోబర్ వరకు ఉన్నట్టు ఈశ్వరరావు తెలిపారు. సీసీ బ్లాకులు, సీపేజీలకు ఇటీవలే రిపేర్లు చేశామన్నారు. మరో ప్రాజెక్ట్ ఇన్చార్జ్ మాధవ్ కేవలం నిర్మాణ సామాన్ల సమీకరణనే చూసుకున్నానని చెప్పారు. బ్యారేజీ నిర్మాణాన్ని పర్యవేక్షించలేదని తెలిపారు.