వందేండ్లు ఉండాల్సిన బ్యారేజీ.. ఒక్క ఏడాదికే డ్యామేజా?

వందేండ్లు ఉండాల్సిన బ్యారేజీ.. ఒక్క ఏడాదికే డ్యామేజా?
  • అన్నారం నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్​ ప్రతినిధులపై కాళేశ్వరం కమిషన్ ఫైర్​
  • కనీసం 45 ఏండ్ల కాలపరిమితితోనైనా నిర్మించాలి కదా అని ప్రశ్న
  • సైట్​లో టెస్టులు చేయాల్సిన బాధ్యత లేదా అని నిలదీత
  • బ్యారేజీ నిర్మాణం ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించిన కమిషన్​
  • సైట్​ను మార్చడం వల్లేనని సమాధానమిచ్చిన ఆఫ్కాన్స్ ​ప్రతినిధులు

హైదరాబాద్, వెలుగు: వందేండ్లు ఉండాల్సిన బ్యారేజీలు ఒక్క ఏడాదికే డ్యామేజీ కావడం ఏంటని అన్నారం బ్యారేజీ నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్​ ప్రతినిధులపై కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్ చైర్మన్​ జస్టిస్​ ఘోష్​ ఫైర్​ అయ్యారు.  బ్యారేజీల నిర్మాణానికి ముందు ఇన్వెస్టిగేషన్స్​​ చేసే బాధ్యత నిర్మాణ సంస్థలకు ఉండదా? అని ప్రశ్నించారు. టెండర్లలో అసంపూర్తిగా, అసమగ్రంగా ఉన్నప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత లేదా? అని అడిగారు. కాళేశ్వరం కమిషన్​ విచారణలో భాగంగా శనివారం కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ ఎదుట అన్నారం బ్యారేజీని నిర్మించిన ఆఫ్కాన్స్​ ఇన్​ఫ్రా లిమిటెడ్​ హైడ్రో బిజినెస్​ యూనిట్​ హెడ్​ నాగమల్లికార్జున రావు, సంస్థ జీఎం శేఖర్​దాస్ విచారణకు​హాజరయ్యారు. 

అన్నారం బ్యారేజీ నిర్మాణం ఎందుకు ఆలస్యమైందని నాగమల్లికార్జున రావును జస్టిస్​ ఘోష్​ ప్రశ్నించారు. బ్యారేజీ నిర్మాణం కోసం తొలుత ఎంపిక చేసిన స్థలం సరిపోదని అప్పటి ప్రభుత్వం భావించిందని నాగమల్లికార్జునరావు చెప్పారు. అటవీ భూములు ఉండడం, దాంతోపాటు బ్యారేజీ నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, మేడిగడ్డ బ్యారేజీ నుంచి అన్నారం వరకు కాలువ పొడవును తగ్గించే చర్యల్లో భాగంగా తొలుత నిర్ణయించిన స్థలానికి 2.2 కిలోమీటర్ల దిగువన బ్యారేజీని నిర్మించారని చెప్పారు. ఆ కొత్త ప్రదేశంలో ఇన్వెస్టిగేషన్స్​ చేయడానికి 2 నెలల సమయం పట్టిందని తెలిపారు. భూములు అప్పగించడంలో ప్రభుత్వం విపరీతమైన జాప్యం చేస్తున్నదని మీరు లేఖలు రాశారు కదా? అని ఘోష్​ ప్రశ్నించారు. బ్యారేజీ సైట్ మార్చాక భూసేకరణకు చాలా సమయం పట్టిందని నాగ మల్లికార్జున రావు సమాధానం ఇచ్చారు. నిర్మాణ ప్రదేశానికి వెళ్లేందుకు మార్గాలు లేకపోవడం, దాని చుట్టూ ఉన్న భూములు ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉండడంతో భూసేకరణ ఆలస్యమైందని చెప్పారు.  

ఏటా సీసీ బ్లాకులు కొట్టుకుపోయినయ్​

ఏటా వరదలొచ్చినప్పుడల్లా బ్యారేజీ సీసీ బ్లాకులు కొట్టుకుపోయాయని నాగమల్లికార్జున రావు చెప్పారు. బ్యారేజీకి వరదలు వచ్చినప్పుడు ఆ వరద ప్రవాహ వేగానికి సీసీ బ్లాకులు కొట్టుకుపోయాయి కదా? వాటిని సరిచేసేందుకు, అవి మళ్లీ రిపీట్​ కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అని జస్టిస్​ ఘోష్​ ప్రశ్నించారు. 2018 సెప్టెంబర్​ నాటికి గేట్ల పనులు మినహా మిగతా బ్యారేజీ అంతా పూర్తయిపోయిందని నాగమల్లికార్జున రావు చెప్పారు. ఆ ఏడాది అక్టోబర్​లో 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సీసీ బ్లాకులు చెక్కు చెదరలేదని తెలిపారు. 2019 జనవరిలో గేట్లు బిగించామని, ఆ ఏడాది జులైలో గేట్లను కిందకు దించారని చెప్పారు. పంప్​హౌస్​లకు నీటిని లిఫ్ట్​ చేసేందుకు 119 మీటర్ల వరకు స్టోర్​ చేశారన్నారు. అదే ఏడాది అక్టోబర్​, నవంబర్​లో మరోసారి వరదలు రాగా గేట్లను తెరిచారని తెలిపారు. గేట్లను తక్కువ ఎత్తులో తెరిచి నీటిని కిందికి విడుదల చేయాల్సి ఉంటుందని, దీంతో షూటింగ్​ వెలోసిటీస్​ పెరిగి దిగువన ఉన్న సీసీ బ్లాకులు దెబ్బతిన్నాయని వివరించారు. 

ఎన్​డీఎస్​ఏ సిఫార్సులను అమలు చేసినం

డ్యామేజీలు జరిగిన తర్వాత నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) సిఫార్సుల మేరకు అక్కడ టెస్టులు చేశామని, ఆ రిపోర్టులనూ సమర్పించామని  నాగ మల్లికార్జున రావు అన్నారు. ‘‘ఎన్​డీఎస్​ఏ సిఫార్సుల మేరకు టెస్టులు చేశామంటున్నారు? మరి, బ్యారేజీకి రిపేర్ల విషయంలో మీ సజెషన్స్​ ఏంటి? ఎన్​డీఎస్​ఏ సిఫార్సుల మేరకు మీరు ఏమేం చేశారు” అని జస్టిస్​ ఘోష్​ ప్రశ్నించారు. సీసీ బ్లాకులను రీస్టోర్​ చేయాలని ఎన్​డీఎస్​ఏ సూచించిందని, ఆ సూచనలకు తగ్గట్టుగా పునరుద్ధరించామని నాగమల్లికార్జున రావు చెప్పారు. జియోఫిజికల్​ టెస్టులు చేశామని, ఇసుక మేటలు వేస్తే వాటిని తొలగించామని, క్రాక్స్​ ఏమైనా వచ్చాయో లేదో చెక్​ చేసేందుకు డ్రోన్​ సర్వే చేశామని తెలిపారు. బ్యారేజీకి ఒక్క క్రాక్​ కూడా పడలేదని వెల్లడించారు. కాగా, బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన చర్చల్లో ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల వద్ద ఏర్పాటు చేసిన ఆప్రాన్స్​ డిజైన్లలాగానే.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద ఏర్పాటు చేసే అంశంపై చర్చలు జరిగాయని, లిఖితపూర్వక డాక్యుమెంట్లు లేవని వివరించారు.