ఏప్రిల్ నెలాఖరులో కాళేశ్వరం కమిషన్​ రిపోర్ట్​!..ఏడాది కాలంగా సుదీర్ఘంగా ఎంక్వైరీ

ఏప్రిల్ నెలాఖరులో కాళేశ్వరం కమిషన్​ రిపోర్ట్​!..ఏడాది కాలంగా సుదీర్ఘంగా ఎంక్వైరీ
  • ఈ నెల​ 30తో ముగుస్తున్న జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ గడువు
  • ఇప్పటికే ఐదు సార్లు గడువు పెంపు
  • ఏడాది కాలంగా సుదీర్ఘంగా ఎంక్వైరీ

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన కమిషన్.. ఈ నెలాఖరుకు లేదా మే ​మొదటివారంలో పూర్తి రిపోర్ట్‌‌ను రాష్ట్ర ప్రభుత్వానికి  ఇవ్వనుంది. కమిషన్ గడువు కూడా ఈ నెలఖారులో ముగియనుండటంతో ఈ మేరకు ప్రభుత్వానికి సమాచారం అందినట్టు తెలిసింది. ఇక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ వచ్చే వారంలో హైదరాబాద్‌‌కు రానున్నారు.  వీళ్లు ఇచ్చే సమాధానాలను చూసి తుది రిపోర్ట్ సిద్ధం చేసి నివేదించనున్నారు.  2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, నిర్మాణ లోపాలపై విచారణకు 2024 మార్చి 12న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో కమిషన్‌‌ను ఏర్పాటు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కమిషన్..​ గతేడాది ఏప్రిల్​లో ఎంక్వైరీ మొదలుపెట్టింది. అప్పటి నుంచి నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లను పిలిచి ప్రశ్నలు వేస్తూ వచ్చింది. దశలవారీగా విచారణ చేసి, ఇప్పటికే చాలా సమాచారం సేకరించింది. మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్‌‌ నల్లా వెంకటేశ్వర్లు, సీ మురళీధర్, బీ హరిరామ్‌‌తో సహా 80 మందికి పైగా ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. బ్యారేజీల డిజైన్, నిర్మాణ నాణ్యత గురించి వివరాలు తీసుకుంది. 

అప్పుడు సీఎం కార్యాలయంలో పనిచేసిన స్మితా సభర్వాల్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ అధికారి కె.రామకృష్ణారావు వంటి ఐఏఎస్ అధికారులను క్రాస్​ఎగ్జామినేషన్​చేసింది. అప్పులు, అనుమతుల విషయంలో వీళ్లు ఏం చేశారో తెలుసుకుంది. బ్యారేజీలు కట్టిన కంపెనీల ప్రతినిధులను పిలిచి, నిర్మాణ వివరాలు సేకరించింది. విజిలెన్స్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌‌డీఎస్‌‌ఏ), కాగ్ నివేదికలనూ పరిశీలించింది. బ్యారేజీల స్థల ఎంపిక, డిజైన్ మార్పుల్లో తప్పులు, ప్రాజెక్టు అంచనాలు పెంచడం, అనుమతులు, డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)లో స్పష్టత లేకపోవడం, నిర్ణయాల్లో అధికారులు సరిగా పనిచేయలేదని విచారణలో తేలింది. దాదాపు 300  పేజీలతో రిపోర్ట్ ను ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే, రిపోర్ట్ ఇవ్వడానికి ముందు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్‌‌లకు కమిషన్​ నోటీసులు పంపనున్నట్లు తెలుస్తోంది.

ఐదుసార్లు కమిషన్​ గడువు పొడిగింపు

జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో కమిషన్‌‌ను 2024 మార్చి 12న ఏర్పాటు చేశారు. ఐదుసార్లు కమిషన్​ గడువు పొడిగించారు. మొదట 100 రోజుల్లో (జూన్ 20, 2024 వరకు) రిపోర్ట్ ఇవ్వాలని గడువు విధించారు. కానీ, విచారణ సమయం సరిపోక, గడువును చాలాసార్లు పొడిగించారు. జూన్ 20, 2024 గడువు ముగిసిన తర్వాత, 2 నెలలు (60 రోజులు) పొడిగించారు. దీనితో ఆగస్టు 19, 2024 వరకు గడువు వచ్చింది. ఆగస్టు 19, 2024 తర్వాత మళ్లీ 2 నెలలు,   అక్టోబర్ 18, 2024 తర్వాత మరో 2 నెలలు , డిసెంబర్ 17, 2024 తర్వాత, ఫిబ్రవరి 28, 2025 వరకు మరో 2 నెలలు, ఆ తరువాత మళ్లీ ఏప్రిల్ 30 వరకు గడువును పొడిగించారు.