కాళేశ్వరం లోపాలు ఇంకెన్నో.. ముంచింది రీడిజైనే

కాళేశ్వరం లోపాలు ఇంకెన్నో.. ముంచింది రీడిజైనే

జులై 14,- 2022 రోజున మేడిగడ్డ పంప్ హౌస్​ (కన్నెపల్లి) వరద నీటిలో ముంపునకు గురైంది. డిజైన్ 28.252 లక్షల క్యూసెక్కుల కంటే తక్కువ వరద వచ్చినప్పటికీ పంప్ హౌస్​ మునిగిపోయినది. దీనికి కారణాలు వరద లెవల్ అంచనా వేయకుండా ఫ్లడ్ జోన్​లో  పంప్ హౌస్​ నిర్మాణం చేయడం, -డిజైన్ లోపం. డిజైన్ కూడా ఇతర శాఖల ద్వారా చేయించడం మరో కారణం. కేవలం అది మానవ తప్పిదమే తప్ప- ప్రకృతి వైపరీత్యం కాదు. ఏడు  పంప్​లు వరద నీటిలో మునిగి పూర్తిగా పనికి రాకుండా పోయినవి. రూ.1,000 నుంచి 1,500 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయడం జరిగినది.

కుంగిన మేడిగడ్డ..

21అక్టోబర్​2023 రోజున మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాకులో 18, 19, 20, 21వ పిల్లర్లు కుంగిపోవడం దీనికి కారణం. ఇది కుట్రకోణం కాదు, ప్రకృతి వైపరీత్యం కాదు. కేవలం మానవ తప్పిదం. దీని నిర్మాణం తరువాత సరియైన మెయింటెనెన్స్ చేయకపోవడం, -ప్రతి వర్షాకాలం ముందు సీపేజీని గ్రహించడానికి డై  టెస్టు, కలర్​ టెస్టు పరీక్షలు చేయకపోవడం కారణం. నిర్మాణం చేపట్టేముందు ఇసుక బెడ్స్ ను 85% రిలేటివ్ డెన్సిటీ వచ్చే వరకూ, వైబ్రో కంపాక్టర్స్ ద్వారా సరియైన రీతిన తొక్కించకపోవడం, నిర్మాణం జరుగుతున్నప్పుడు ఉదాహరణకు ఎస్పీటీ (స్టాండర్డ్​ పినిట్రేషన్​ టెస్టు), ఈసీపీటీ (ఎలెక్ట్రిక్​ కోన్​ పినిట్రేషన్​ టెస్టు) మొదలైనవి నిర్వహించకపోవడం. ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రమాణాలు పాటించక ఆఘమేఘాలపై పని పూర్తి చేయాలనే లక్ష్యంతో నిర్మాణం పూర్తిచేయడం, - పని నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం.  వివరంగా చెప్పాలంటే ఒకే రోజు23 డిసెంబర్​2018న 24 గంటలలో 16,722 క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీట్ వేసి రికార్డ్ సృష్టించడానికి 3 పనులు చేయడం. ఇదే రికార్డును పోలవరంలో కూడా స్పిల్ వే ఛానల్స్​పై చేస్తే అక్కడ కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. వేరే చోట అనగా ఎగువన నిర్మాణానికి అనుకూలమైన సైట్ ఉన్నప్పటికినీ, ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇక్కడనే నిర్మాణం చేపట్టడం. - సరియైన రీతిలో సైటు కండిషన్లను  పరిశీలించకపోవడంతో పాటు భూగర్భ నిపుణుల సలహాలను తీసుకోలేదు.వారి సలహాల ప్రకారం నిర్మాణం చేయలేదు.

సీఎం ఆదేశాలతో నిర్మాణం ఆగమాగం..

ఇసుక నేలపై Raft Foundation, File Founda tion లేదా Floating Foundation నిర్మాణం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు పాటించలేదు.Seapage ని ఆపడానికి, డ్యామ్ స్థిరత్వానికి తగిన ప్రొటెక్షన్ పనులు అనగా Seacant Files/ Cut  off wall నిర్మిస్తారు. ఈ  Seacannt Files li Raft Foundation  కింద నిర్మిస్తారు. కానీ మేడిగడ్డ బ్యారేజి ఆగమేఘాలపై పూర్తి చేయాలనే ముఖ్యమంత్రి  ఆదేశాలతో ఈSeacant Files నిర్మాణం ఒక చోట Raft Foundation కు ముందుభాగంలో దూరంగా మరో చోట పక్క పటంలో చూపించినట్లు నిర్మాణం చేయడంతో ఈ Seacant Files పైన వేసిన కప్పు స్లాబ్ పగిలిపోయింది. అందులో నుంచి నీళ్లు ప్రవహించి (Seapage) జరిగి, Raft Foundation క్రింద ఉన్న ఇసుక క్రమంగా కొట్టుకుపోయి, క్యావిటీ లేదా గ్యాప్ ఏర్పడి 7వ బ్లాక్ లోని పిల్లర్లు తేది 21అక్టోబర్​ 2023 న కుంగిపోయినాయి. ఈ Seacant Files కు Raft Foundation కు సంబంధం లేకుండా సమాంతరంగా నిర్మాణం చేపట్టడం వలన పిల్లర్లు కుంగి పోవడానికి 
అవకాశం ఏర్పడింది.

కేంద్ర ప్రభుత్వ ఆమోదం తీసుకోలేదు

అక్టోబర్​24, 2023న సందర్శించిన Central Dam Safety Committee కూడా ప్రాథమికంగా ఇదే విషయాన్ని ధృవీకరించింది. 7వ బ్లాకులో ఉన్న 10 పిల్లర్లను కొత్తగా నిర్మించవలసిన అవసరం ఉన్నట్లు అంచనా వేశారు. దీనికి సుమారుగా రూ.500 కోట్ల నుంచి 1,000 కోట్లు ఖర్చు కాగలవు. మళ్లీ ప్రజాధనం వృథా కానుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్లన్నీ రాష్ట్ర పరిధిలోని డిజైన్ వింగ్ (C.D.O.) ద్వారా చేయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం తీసుకోలేదు. C.D.Oపై ముఖ్యమంత్రి ఒత్తిడి కూడా ఒక కారణం.

బుంగ పడ్డ అన్నారం..

నిన్న అన్నారం బ్యారేజీలో కూడా లీకేజీ ఏర్పడి Pipe Action జరుగుతున్నట్లు ఫొటోలు  వైరల్ అవుతున్నవి, ఈ అన్నారం బ్యారేజ్​ కూడా కొద్ది రోజుల్లో మేడిగడ్డలాగా కుంగిపోయే అవకాశం ఉంది.

అనర్థంగా మారిన రీడిజైన్​

కేసిఆర్ ప్రభుత్వ తప్పుడు విధానాలతో తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చడం మొదట తప్పిదం. కేవలం రూ. 30 వేల కోట్లకు పూర్తి కావలసిన ప్రాజెక్టును రీడిజైన్ పేరున రూ. లక్షా ముప్పయి వేల కోట్లకు అంచనాలు పెంచి, ప్రజాధనం రూ. లక్ష కోట్లు  వృథా చేయడం రెండవ తప్పు. సాగునీటిని అతి ఖరీదుగా మార్చి సాధించిన ఫలితం శూన్యం. పైగా అనేక గ్రామాల ప్రజలను నిర్వాసితులను చేసి, వారు జీవించే హక్కును కొల్లగొట్టడం జరిగినది. ప్రయోజనం లేని ఈ మేడిగడ్డపై మళ్లీ ఖర్చుచేసే బదులుగా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజి నిర్మించడమే శ్రేయస్కరం. నదీ బెడ్ లెవల్ (+ 89 మీ.), బ్యారేజ్ క్రెస్ట్ లెవల్ (+ 89 మీ.) కాబట్టి కేవలం గేట్ల ఎత్తుతో 10 మీటర్ల నీళ్లు అనగా + 100 మీ. వరకు నిలువ చేయడం వల్ల బ్యారేజ్​ పునాదిపై వాటర్ ప్రెషర్ నామమాత్రంగా ఉంటుంది. లీకేజికి ఆస్కారం చాలా తక్కువ. కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేసిన కారకులపై తక్షణమే తగిన చర్య తీసుకొని, పాలకుల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.

సమగ్ర గ్రౌండ్ సర్వే చేయలేదు

ఇసుక నేలపై రాజమండ్రి సమీపంలో గోదావరి నదిపై 1855 లో నిర్మాణం చేసిన సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్, దాని స్థానంలో కొత్తగా 1975లో నిర్మాణం చేసిన కాటన్ బ్యారేజ్ ఇప్పటికీ చెక్కుచెదరలేదు.  కానీ 4 సంవత్సరాలలోనే మేడిగడ్డ కుంగిపోవడానికి ఇంజినీర్ల లోపం, ముఖ్యమంత్రి ఒత్తిడే కారణం. దీని వెనుక అనేక అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలే కారణం. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టే ముందు ఏరియల్ సర్వే చేశారు. కానీ సమగ్ర గ్రౌండ్ సర్వే చేయలేదు. WAPCO సంస్థ కూడా సమగ్రంగా పరిశీలన చేయకపోవడం 
ఒక కారణం.

– Er. దొంతుల లక్ష్మీనారాయణ, కన్వీనర్ తెలంగాణ ఇంజినీర్స్ ఫోరం