
- డాక్యుమెంట్ల ఆధారంగా లెక్కగడ్తున్న ఏసీబీ
- బినామీల పేర్లతో ఆస్తులు, బ్యాంకుల్లో లాకర్లు
- చంచల్‌గూడ జైలుకు హరిరాం తరలింపు
- ఆయన భార్య పైనా అక్రమాస్తుల కేసు పెట్టే చాన్స్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా హరిరాం అక్రమాస్తుల లెక్క తేలుతున్నది. ఆయన దాదాపు రూ.300 కోట్లకు పైనే ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ ఆధారాలు సేకరించింది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఆయా భూముల విలువను ఏసీబీ లెక్కగడ్తున్నది. ఫ్లాట్లు, విల్లాలు, బంగారానికి విలువ కడుతున్నది. ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం వీటి విలువ రూ.300 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నది.
అక్రమాస్తుల కేసులో హైదరాబాద్‌లోని హరిరాం ఇల్లు సహా 13 ప్రాంతాల్లో ఏసీబీ శనివారం అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించింది. అనంతరం హరిరాంను అరెస్టు చేసి, జడ్జి ముందు హాజరుపర్చింది. జడ్జి ఆదేశాల మేరకు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు చంచల్‌గూడ జైలుకు తరలించింది. హరిరాంను కస్టడీకి తీసుకునేందుకు సోమవారం కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేయనుంది.
అలాగే సోదాల్లో భాగంగా గుర్తించిన బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేసేందుకు కోర్టు అనుమతి కోరనుంది. కాగా, హరిరాం భార్య అనిత కూడా అక్రమంగా ఆస్తులు సంపాదించినట్టు ఏసీబీ గుర్తించింది. హరిరాం ఇంట్లో, సిద్దిపేట జిల్లా మర్కుక్ తహసీల్దార్ ఆఫీసులో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఆమెపై కూడా అక్రమాస్తుల కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
నలుగురు బినామీల గుర్తింపు..
సోదాల్లో భాగంగా పెద్ద ఎత్తున ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. షేక్‌పేట, కొండాపూర్‌లో విల్లాలు, మాదాపూర్, నార్సింగిలో ఫ్లాట్లు, అమరావతిలో వాణిజ్య స్థలం, మర్కుక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్‌చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో రెండు ఇండ్లు, బొమ్మలరామారంలో 6 ఎకరాల్లో మామిడి తోట, ఫామ్‌హౌస్, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలో ప్లాట్లు ఉన్నట్టు ఆధారాలు సేకరించారు.
అలాగే మూడు బ్యాంక్ లాకర్లను సైతం గుర్తించారు. కొన్ని ఆస్తులను బినామీల పేర్ల మీద పెట్టినట్టు గుర్తించారు. ఇప్పటికే నలుగురు బినామీల ఆధారాలు సేకరించారు. మిగతా బినామీలు ఎవరు? వాళ్ల పేరు మీద ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయి? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా జలసౌధ కార్యాలయం, హరిరాం ఇంట్లో లభించిన డాక్యుమెంట్లను పరిశీలించే పని ప్రత్యేక టీమ్‌కు అప్పగించినట్టు తెలిసింది.