
=నిజాలు చెరపొద్దు.. డాక్యుమెంట్లు దాచొద్దు..
= ప్రతిజ్ఞకు న్యాయం చేయండి
= నలుగురు ఈఎన్సీలను ప్రశ్నించిన కాళేశ్వరం కమిషన్
= అన్నారం, సుందిళ్ల లొకేషన్లను కేసీఆర్, హరీశ్ ఆదేశాల మేరకే మార్చమన్న ఈఎన్సీలు
= బ్యారేజీల్లో నీళ్లు నింపాలని కూడా వాళ్లిద్దరే ఆదేశించారని క్లారిటీ
= కాగ్ సభ్యులను కూడా ప్రశ్నించిన కమిషన్
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ జోరందుకుంది. ఇవాళ నలుగురు ఈఎన్సీలను కమిషన్ విచారించింది. నల్లా వెంకటేశ్వర్లు, హరీరాం, మురళీధర్ రావు, నరేందర్ రెడ్డిని ఒకే వరుసలో కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. నిజాలు చెరిపేయొద్దని, డాక్యుమెంట్లను దాచి పెట్టొద్దని సూచిస్తూనే.. చేసిన ప్రతిజ్ఞకు న్యాయం చేయాలని పేర్కొంది. ఇంజినీర్లు పలు డాక్యుమెంట్లు దాచారంటూ కమిషన్ కామెంట్ చేసింది.డిజైన్స్, డిపిఆర్, నిర్మాణ సంస్థకు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందాలపై ప్రధానంగా ప్రశ్నించింది.
అన్నారం సుందిళ్ల లొకేషన్లను ఎవరిర రాదేశాల మేరకు మార్చారన్న కమిషన్ ప్రశ్నకు అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకే మార్చినట్టు చెప్పారు. బ్యారేజీల్లో నీళ్లు నింపాలని ఎవరు ఆదేశించారన్న ప్రశ్నకు కూడా ఆ ఇద్దరి పేరే సమాధానంగా చెప్పారు. ఈ ఎన్సీ మురళీధర్ రావు పలు ప్రశ్నలకు మౌనంగా ఉండటం, గుర్తుకు లేదని చెప్పడం గమనార్హం. డిపిఆర్ తయారీలో వ్యాప్ కాన్ సంస్థకు పనులు అలాట్ చేయాలని ఎవరు ఆదేశించారని అడుగగా.. గత ప్రభుత్వ పెద్దలేనంటూ సమాధానం వచ్చింది.
తికమక.. మౌనం
కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఈఎన్సీలు కొన్ని సందర్భాల్లో తికమక పడ్డారు. కొన్ని ప్రశ్నలకు మౌనం వహించారు. మూడు బ్యారేజీల కాస్ట్ ఎంత? అని ప్రశ్నించగా 9 వేల కోట్లు అని ఈఎన్సీలు సమాధానం చెప్పారు. దీనికి కమిషన్ డాక్యుమెంట్లు చూపుతూ.. కాదు 13 వేల కోట్లని చెప్పింది. జీవో నెంబర్ 28 పై ప్రశ్నించగా నలుగురు ఈ ఎన్సీలు మౌనం వహించారు. ప్రజల డబ్బులు వృథా అయ్యాయని మీరు భావిస్తున్నారా..? అన్న ప్రశ్నకూ ఎలాంటి సమాధానం రాలేదు.