
- ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా అవకతవకలు, అసమర్థ విధానాలు
- అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాలను గుడ్డిగా మార్చారు
- మట్టి పరీక్షలు చేయకముందే, డీపీఆర్‌లు పూర్తికాకముందే పనులు
- మూడు బ్యారేజీల్లోనూ లోపాలున్నాయని ఎన్డీఎస్‌ఏ చెప్పింది
- చేసిన తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పాల్సింది పోయి..
- ఎన్డీఎస్‌ఏపైనే ఎదురుదాడి చేస్తరా?
- ప్రాజెక్టు కోసం రూ.లక్ష కోట్ల అప్పులు చేశారు..
- వాటి వడ్డీలు, కిస్తీలకే ఏటా 16 వేల కోట్లు కడ్తున్నం
- గత ప్రభుత్వం చేసిన పొలిటికల్ స్టంట్‌తో వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది
- కేసీఆర్ వల్ల దేశం ముందు తెలంగాణ విశ్వసనీయత దెబ్బతిన్నదని ఫైర్
- ఎన్డీఎస్ఏ రిపోర్టుపై సెక్రటేరియెట్‌లో మంత్రి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు దేశ చరిత్రలోనే అతిపెద్ద మానవ తప్పిదమని, అత్యంత ఖరీదైన ఇంజనీరింగ్ వైఫల్యమని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నిర్మాణపరంగా అన్నీ లోపాలే ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) రిపోర్టు స్పష్టం చేసిందని తెలిపారు.
‘‘కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ వల్ల దేశం ముందు తెలంగాణ విశ్వసనీయత దెబ్బతిన్నది. బీఆర్ఎస్ వాళ్లు చేసిన తప్పును ఒప్పుకొని తెలంగాణ ప్రజలను క్షమాపణలు కోరాల్సిందిపోయి.. ఏకంగా ఎన్డీఎస్ఏ రిపోర్టునే తప్పుపట్టడం సిగ్గుచేటు’’ అని ఫైర్ అయ్యారు.
మంగళవారం (April 30) హైదరాబాద్‌లోని సెక్రటేరియెట్‌లో ఎన్డీఎస్ఏ రిపోర్టుపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్‌ప్రజంటేషన్ ఇచ్చారు. అడుగడుగునా లోపాలున్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రకరకాల కార్పొరేషన్ల పేరుతో రూ.లక్ష కోట్ల అప్పు చేశారని ఆయన మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన హైకాస్ట్రుణాలకు ప్రస్తుతం ఏటా రూ.16 వేల కోట్ల వడ్డీలు, కిస్తీలు కడుతున్నామని చెప్పారు.
ఫలితంగా రాష్ట్ర ఖజానా, రైతులపై పెనుభారం పడుతోందన్నారు. కేసీఆర్ హయాంలో ఉద్దేశపూర్వకంగానే ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలకు పాల్పడ్డారని.. అడుగడుగునా అసమర్థ విధానాలు, నిర్లక్ష్యంతో వ్యవహరించారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును శాస్త్రీయంగా నిర్మించలేదని.. అబద్ధాలు, అసత్య ప్రచారాలతోనే నిర్మించారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం విపత్తు సహజ సిద్ధంగా సంభవించలేదని, బీఆర్ఎస్హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్లే ఆ ప్రాజెక్ట్కుంగిపోయిందన్నారు. గత ప్రభుత్వం చేసిన పొలిటికల్ స్టంట్‌తో వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని మండిపడ్డారు.
ప్రాణహితను పక్కనపెట్టి..
గత బీఆర్ఎస్ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి, రీఇంజనీరింగ్పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని మంత్రి ఉత్తమ్మండిపడ్డారు. ‘‘ప్రాణహిత ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ప్రభుత్వమే జాతీయహోదా కూడా అడిగింది. కానీ, కేసీఆర్అబద్ధపు ప్రచారాలతో ఆ ప్రాజెక్టును నిర్మించలేదు. కాళేశ్వరంతో పాటు ప్రాణహితనూ నిర్మిస్తామని చెప్పినా, దాన్ని చేపట్టలేదు. ఎక్కువ వడ్డీలకు తీసుకొచ్చిన రుణాలతో ఆదరబాదరాగా కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. కనీసం సరైన ప్లానింగ్ చేయలేదు. దీంతో ఆర్థికంగా భారీ నష్టం జరిగింది” అని ఫైర్ అయ్యారు.
‘‘బ్యారేజీల్లో 2 నుంచి 3 టీఎంసీలకు మించి నీళ్లు నిల్వ చేయరు. కానీ కాళేశ్వరం విషయంలో ఒక్క బ్యారేజీలో 10 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేశారు. ఫలితంగా ఫౌండేషన్‌కు డ్యామేజ్జరిగి బ్యారేజ్కుంగిపోయింది. సేఫ్టీ ప్రొటోకాల్స్ఏమాత్రమూ పాటించలేదంటూ ఎన్డీఎస్ఏ రిపోర్టులో తేల్చి చెప్పింది. బ్యారేజీలకు చేసిన బోర్హోల్స్డేటా సరిగా లేదు. మెయింటెనెన్స్రికార్డులు కూడా లేవు. బ్యారేజీల నిర్మాణం పూర్తయ్యాక 2019లోనే తొలిసారిగా సీపేజీలు వచ్చాయి. కానీ, అప్పటి బీఆర్ఎస్ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. నేరపూరిత నిర్లక్ష్యం చేసి, తెలంగాణకు రూ.వేల కోట్ల నష్టం చేశారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డీపీఆర్‌లు పూర్తికాకముందే పనులు..
బ్యారేజీల డీపీఆర్‌లు సిద్ధం కాకముందే పనులను చేపట్టారని మంత్రి ఉత్తమ్మండిపడ్డారు. డీపీఆర్‌లలో పేర్కొన్న ఒరిజినల్వర్క్ స్కోప్ఒకటని.. కానీ, బయట చేసిన పనులు వేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ స్థలాల మార్పు విషయం సీడబ్ల్యూసీకి కూడా చెప్పలేదని ఫైర్ అయ్యారు. ‘‘అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాలను వ్యక్తిగతంగా మార్చేశారు. ఎలాంటి చర్చలు లేకుండానే ఉన్నపళంగా మార్చారు. కొత్త స్థలాల వద్ద జియోటెక్నికల్ఇన్వెస్టిగేషన్స్చేయలేదని ఎన్డీఎస్ఏ క్లియర్‌గా చెప్పింది.
నీళ్లే లేవన్నరు..
ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలనుకున్న తుమ్మడిహెట్టి వద్ద నీళ్లే లేవని గత బీఆర్ఎస్పాలకులు అబద్ధాలు చెప్పారని మంత్రి ఉత్తమ్మండిపడ్డారు. అక్కడ నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ చెప్పిందని గుర్తుచేశారు. కానీ కమీషన్ల కోసం ప్రాజెక్టును రీడిజైన్‌చేసి, అంచనాలు అమాంతం పెంచి ప్రజాధనాన్ని వృథా చేశారని ఫైర్ అయ్యారు. ఇరిగేషన్వ్యయాల కింద రూ.1.81 లక్షల కోట్లకు పైగానే ఖర్చు చేశారని వెల్లడించారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని అన్నారు.
‘‘వీలైనంత త్వరగా బ్యారేజీ స్టెబిలైజేషన్, రిపేర్లు, రీహాబిలిటేషన్పనులను చేపట్టాలని ఎన్డీఎస్ఏ సిఫార్సు చేసింది. ఈ విషయంలో ఎక్స్‌పర్టులతో సాంకేతికంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. బ్యారేజీలను రీస్టోర్చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటాం. కేబినెట్‌లో చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటాం. చట్టప్రకారమే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుకు కారణమైనవాళ్లను కచ్చితంగా బాధ్యులను చేస్తామన్నారు. తెలంగాణను బీఆర్ఎస్ ఎలా మోసం చేసిందో ప్రతిపౌరుడికి తెలిసేలా చేస్తామన్నారు. ఇరిగేషన్‌శాఖ ఇంజనీర్లతో పాటు ఎందరికో శిక్షణనిచ్చిన వాలంతరీ లాంటి సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్డీఎస్‌ఏపైనే ఎదురుదాడి చేస్తరా?
కేసీఆర్చేసిన తప్పును ఒప్పుకోకుండా, ఎన్డీఎస్ఏ విశ్వసనీయతపైనే ఎదురుదాడి చేయడం సిగ్గుచేటని మంత్రి ఉత్తమ్మండిపడ్డారు. ‘‘కేసీఆర్నిర్ణయాలతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆయన రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశారు. కేసీఆర్నిర్ణయాల ఫలితంగా దేశం ముందు తెలంగాణ విశ్వసనీయత దెబ్బతిన్నది. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ శాఖను మొత్తం ధ్వంసం చేశారు. సీతారామసాగర్ ప్రాజెక్టుకు క్లియరెన్సుల కోసం ఇటీవల కేంద్ర జలశక్తి శాఖతో సమావేశమైతే.. రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ కుప్పకూలిందంటూ చెప్పారు. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమన్నారు” అని చెప్పారు.
తుమ్మిడిహెట్టిపై రివ్యూ చేస్తున్నం
తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి ఫీజిబిలిటీపై ఇరిగేషన్‌శాఖ సలహాదారు ఆదిత్యనాథ్దాస్రివ్యూ చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన ఘటనపై జ్యుడీషియల్కమిషన్విచారణ జరుపుతున్నది. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నది. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు” అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణా రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎంపీ బలరాం నాయక్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.