కాళేశ్వరం బ్యాక్‌‌ వాటర్‌‌‌‌తో మునిగిన మంచిర్యాల

  • జిల్లా కేంద్రంలోని పలు కాలనీలను చుట్టేసిన వరద
  • గురువారం రాత్రంతా జాగారం చేసిన జనం
  • ఎమ్మెల్యే దివాకర్ రావు ఇంటి ముట్టడి
  • పట్టించుకోవడం లేదంటూ ఫైర్​

మంచిర్యాల, భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం బ్యాక్‌‌ వాటర్‌‌‌‌తో మంచిర్యాల జిల్లా కేంద్రం జలమయమైంది. ఓ వైపు గోదావరి ఉప్పొంగడం, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా రాళ్లవాగులో నీళ్లు వెనక్కి ఎగదన్నడంతో పెద్ద ఎత్తున వరద చుట్టుముట్టింది. దీంతో ఎన్టీఆర్​నగర్, రాంనగర్, ఎల్ఐసీ కాలనీ, పద్మశాలి కాలనీ, ఆదిత్య ఎన్​క్లేవ్​ఏరియాల్లోకి గురువారం అర్ధరాత్రి నీళ్లొచ్చాయి. తెల్లారే సరికి 500కు పైగా ఇండ్లు నీటమునిగాయి. 

గోదావరి తీర ప్రాంత గ్రామాలతో పాటు మంచిర్యాలలోని రాళ్లవాగు, తోళ్లవాగు ఏరియాల్లోని ప్రజలు ముంపు భయంతో రాత్రంతా జాగారం చేశారు. శుక్రవారం సాయంత్రానికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు గురువారం ఉదయం నుంచే కాలనీల్లోని ఇండ్లను అధికారులు ఖాళీ చేయించారు. జిల్లా కేంద్రంలో మూడు చోట్ల రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేసి జనాలను అక్కడికి తరలించారు. ఇళ్లలోకి నీళ్లు చేరినప్పటికీ ప్రాణ నష్టం తప్పింది.

వేలాది ఎకరాలు మునక

కాళేశ్వరం బ్యాక్ వాటర్‌‌‌‌తో చెన్నూర్, కోటపల్లి, జైపూర్ మండలాల్లోని గోదావరి తీర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. చెన్నూరు, కోటపల్లి, జైపూర్​ మండలాల్లో పత్తి చేలు రెండు రోజులుగా నీళ్లలోనే ఉన్నాయి. వరద తగ్గిన తర్వాత పంట నష్టాన్ని అంచనా వేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి కల్పన తెలిపారు. నెల రోజుల కిందటే పత్తి పంట వేశామని, మొక్కలు మంచిగా పెరుగుతున్న తరుణంలో గోదా వరి ముంచిందని రైతులు కన్నీళ్లుపెట్టుకున్నారు. 

కాళేశ్వరం బ్యాక్ వాటర్ కారణంగా నాలుగేండ్లుగా పంటలు నష్టపోతున్నా ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారైనా పరిహారం అందించి ఆదుకోవాలని, ఎకరానికి రూ.20 లక్షలు చెల్లించి ముంపు భూములను ప్రభుత్వం సేకరించాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే ఇంటికి ర్యాలీగా వెళ్లి..

మూడేండ్లుగా వరదలు ముంచుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మంచిర్యాల ఎన్టీఆర్​నగర్, రాంనగర్ ప్రజలు మండిపడ్డారు. గోదావరి, రాళ్లవాగులకు కరకట్టలు కట్టాలని డిమాండ్ చేస్తూ నీళ్లలో నిల్చొని నిరసన తెలిపారు. పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావును నిలదీశారు. తర్వాత ర్యాలీగా వెళ్లి ఎల్ఐసీ కాలనీలోని ఆయన  నివాసాన్ని ముట్టడించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వరదలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని దివాకర్​రావు హామీ ఇచ్చారు.

మహదేవ్‌‌‌‌పూర్‌‌‌‌, పలిమెలలోనూ..

భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్‌‌‌‌ బ్యాక్‌‌‌‌ వాటర్‌‌, అన్నారం బ్యారేజ్‌‌‌‌ డౌన్‌‌  స్ట్రీమ్‌‌తో మహదేవ్‌‌‌‌పూర్‌‌‌‌, పలిమెల మండలాల్లో 500 ఎకరాల్లో పంట చేలు నీట మునిగాయి.