హైదరాబాద్, వెలుగు: నీటి వనరుల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వి. ప్రకాశ్‌రావుపై కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కమిషన్‌కు తోడ్పాటునందించేందుకు అఫిడవిట్దాఖలు చేశానని ప్రకాశ్‌రావు చెప్పడంతో.. తాము కేవలం రికార్డులు, డాక్యుమెంట్ల ఆధారంగా పనిచేస్తామని కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ స్పష్టం చేశారు. అసలు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డ ఎందుకు మార్చాల్సి వచ్చిందని కమిషన్ ప్రశ్నించగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్ల కోసమని ప్రకాశ్ చెప్పారు. ఆ సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కమిషన్.. కమిషన్ ముందు రాజకీయ ఉపన్యాసాలు చేయవద్దని, తానేమీ రాజకీయ నాయకుడిని కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణకు వి.ప్రకాశ్‌రావు హాజరయ్యారు. తుమ్మడిహెట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడం వల్లే ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారని చెప్పారు. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని సీడబ్ల్యూసీ (సెంట్రల్వాటర్కమిషన్) చెప్పిందని, అందులో ఎగువ రాష్ట్రాల వాటా 63 టీఎంసీలు పోతే.. ఉండేది 102 టీఎంసీలేనని, అందులో నుంచి కేవలం 44 టీఎంసీలు లిఫ్ట్ చేసుకునేందుకు వీలుంటుందని సీడబ్ల్యూసీ చెప్పిందన్నారు. మేడిగడ్డ వద్ద బ్యారేజీ వద్దని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ స్పష్టం చేసింది కదా? అని జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు. దానికి సమాధానంగా కొందరు వ్యక్తులు కమిషన్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ప్రకాశ్చెప్పారు.
ప్రభుత్వాల నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించలేరు: వి. ప్రకాశ్
ప్రజల మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వాలు, సీఎంల నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించలేరని వి. ప్రకాశ్అన్నారు. విచారణ అనంతరం కమిషన్ బయట మీడియాతో ఆయన మాట్లాడారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కొడంగల్‌కు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా ప్రత్యేకంగా కొడంగల్ లిఫ్ట్‌ను చేపట్టారని, దానిని ఎవరైనా ప్రశ్నించగలరా అన్నారు.