
- ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
- వచ్చే నెల రెండో వారం నాటికి రిపోర్ట్ ఇచ్చే చాన్స్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ గడువును రాష్ట్ర సర్కారు మరో నెలపాటు పొడిగించింది. మే 31 నాటికి తుది నివేదికను సమర్పించాలని పేర్కొంటూ మంగళవారం ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఐదోసారి కమిషన్ గడువును పొడిగించినట్టయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్ 21న కుంగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే విజిలెన్స్, ఎన్డీఎస్ఏ తుది నివేదికలు ప్రభుత్వానికి చేరాయి. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఒక్కటే రావాల్సి ఉంది. ఇప్పటికే రిపోర్ట్‌పై కమిషన్ కసరత్తులు చేస్తున్నది. 90 శాతం వరకు పూర్తయింది. మే రెండో వారంలో ప్రభుత్వానికి నివేదికను సమర్పించేలా కమిషన్ పనిచేస్తున్నది.
కాగా, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, ఫస్ట్ లోక్పాల్జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ చైర్మన్‌గా కమిషన్‌ను ప్రభుత్వం 2024 మార్చి 14న ఏర్పాటు చేసింది. 2024 జూన్ 30 నాటికి నివేదిక ఇవ్వాలని కోరింది. అయితే, అప్పటికీ విచారణలు పూర్తి కాకపోవడం, అధికారుల అఫిడవిట్లు రాకపోవడంతో విచారణ ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే పలుమార్లు సర్కారు గడువును పొడిగిస్తూ వచ్చింది. తొలిసారి నిరుడు జూన్ 29న గడువు పొడిగించగా.. ఆ తర్వాత ఆగస్టు 28న, నవంబర్ 12న, డిసెంబర్ 21న 4 సార్లు గడువును పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. తాజాగా రిపోర్ట్‌ను సమర్పించాల్సి ఉండడంతో ఐదోసారి గడువును పొడిగించాల్సి వచ్చింది.
కమిషన్ ముందుకు ఈఎన్సీ అనిల్
కాళేశ్వరం కమిషన్ ముందు ఈఎన్సీ జనరల్ అనిల్‌కుమార్ హాజరయ్యారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి పలు అంశాలపై కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ ఆరా తీశారు. ఇటీవల ఎన్డీఎస్ఏ రిపోర్ట్ విడుదల కాగా.. దాని గురించి జస్టిస్ ఘోష్ అడిగినట్టు తెలిసింది. అయితే, తమకు కూడా అధికారికంగా రిపోర్టు ఇంకా చేరలేదని ఈఎన్సీ అనిల్ చెప్పినట్టు తెలిసింది. సెక్రెటరీ ద్వారా హార్డ్‌కాపీలను బుధవారం కమిషన్‌కు అందజేయనున్నట్టు సమాచారం. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై జస్టిస్ ఘోష్ ఆరా తీయగా.. ఫ్లడ్ రూటింగ్ చేస్తే బ్యారేజీ సేఫ్‌గా ఉంటుందని అనిల్ వివరించినట్టు తెలిసింది.