
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఓపెన్ కోర్టు మంగళవారం నుంచి జరగనున్నది. మరోదఫా విచారణ కోసం జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఓపెన్ కోర్టుకు ఎవరెవరిని పిలవాలనే దానిపై సోమవారం చర్చించి, నిర్ణయించనున్నారు. ఈ సారి విచారణకు ఇరిగేషన్ మాజీ మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను పిలిచే అవకాశం ఉందన్న చర్చ నడుస్తున్నది.
ఇప్పటికే ఓపెన్ కోర్టులో భాగంగా కమిషన్ 109 మంది నుంచి స్టేట్మెంట్స్ తీసుకున్నది. వారు చెప్పిన విషయాల ఆధారంగా ప్యారలల్‌గా రిపోర్ట్‌ను తయారు చేసే పనిలో ఉంది. కాగా, ఈ నెల 28తో కమిషన్ గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలోనే కమిషన్ గడువును సర్కారు మరో రెండు నెలలపాటు (ఏప్రిల్ 30 వరకు) ముందస్తుగానే పొడిగించింది. ఈ దఫా ఓపెన్ కోర్టును వారంపాటు నిర్వహించే అవకాశం ఉందని తెలిసింది.