కాళేశ్వరం కమిషన్​ గడువు మరోసారి పొడిగింపు?

కాళేశ్వరం కమిషన్​ గడువు మరోసారి పొడిగింపు?

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ గడువు మరోసారి పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమిషన్​ గడువు ఈ నెలాఖరుతో ముగియనుండడం.. మరింత మందిని ఓపెన్​ కోర్టులో క్రాస్​ ఎగ్జామినేషన్​ చేయాల్సి ఉండడంతో గడువును మరోసారి పొడిగించాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇప్పటిదాకా ఐఏఎస్​లు, రిటైర్డ్​ ఐఏఎస్​లు, రిటైర్డ్​ ఈఎన్సీలు, ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజినీరింగ్​ అధికారులు సహా వందమందికిపైగా కమిషన్​ విచారించింది.

ఈ దఫాలో మాజీ సీఎస్​లు సోమేశ్​ కుమార్, ఎస్కే జోషి, రిటైర్డ్​ ఐఏఎస్​ రజత్​ కుమార్​, టూరిజం ప్రిన్సిపల్​సెక్రటరీ స్మిత సబర్వాల్, స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ వికాస్​ రాజ్​తోపాటు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్​, కోదండరామ్​లను కమిషన్​ ఎంక్వైరీ చేసింది.  ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కీలకమైన సమాచారాన్ని  సేకరించినట్టు తెలిసింది.

అయితే, క్రాస్​ ఎగ్జామినేషన్​లో భాగంగా మరో 15 నుంచి 20 మందిని విచారించాల్సిన అవసరం ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుత ఫేజ్​లో ఫైనాన్స్​ స్పెషల్​ సీఎస్​ రామకృష్ణా రావును క్రాస్​ఎగ్జామినేషన్​ చేయాల్సి ఉన్నా.. రాజస్థాన్​లో నిర్వహిస్తున్న ప్రీ బడ్జెట్​ సమావేశానికి వెళ్లడంతో ఆయన ఈ దఫా విచారణకు హాజరు కాలేకపోయారు. శనివారం కాంట్రాక్ట్​ సంస్థలను విచారించాలని నిర్ణయించినా.. అందుబాటులో లేనట్టు తెలిసింది. దీంతో తదుపరి విచారణను జనవరిలో నిర్వహించే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.