వరదలో మునిగిన బాహుబలి మోటార్లు

వరదలో మునిగిన బాహుబలి మోటార్లు
  • ఆ వాటర్​ను తోడితేనే బయటకు బాహుబలి మోటార్లు

జయశంకర్‌‌ భూపాలపల్లి : గోదావరి వరద నీటిలో మునిగిన కన్నెపల్లి (లక్ష్మీ) పంప్‌‌హౌస్​‌లో హాఫ్‌‌ టీఎంసీ నీళ్లున్నాయి. 17 బాహుబలి మోటార్లను వెలికి తీయాలంటే ముందుగా నీళ్లను డీవాటరింగ్‌‌ చేయాలి. ఈ ఏర్పాట్లను నీటి పారుదల శాఖ ఆఫీసర్లు గోప్యంగా చేస్తున్నారు. గోదావరి తీరం నుంచి  కట్టిన ఫోర్‌‌ బే.. పంప్‌‌హౌస్​లో ఉన్న మొత్తం నీటిని తోడేందుకు మూడ్రోజుల సమయం పట్టనుంది. దీనికి అవసరమైన 25, 50 హెచ్‌‌పీ మోటార్లను ఇక్కడ అమర్చే పనిలో మేఘా సంస్థ ఉంది. కన్నెపల్లి మోటార్లను నడిపించడానికి కరెంట్​ సరఫరా కోసం ఏర్పాటు చేసిన 3 టవర్‌‌ కరెంట్‌‌ పోల్స్‌‌ మంథనిలో కూలిపోయాయి. వీటిని రిపేర్‌‌ చేయడానికి సమయం పట్టనుండటంతో, డీవాటరింగ్‌‌కు కరెంట్ అవసరాలకు స్థానిక సబ్‌‌ స్టేషన్‌‌ నుంచి పవర్​ తీసుకోవాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. కన్నెపల్లి పంప్‌‌హౌస్ దగ్గరికి ఎవరినీ రాకుండా ప్రభుత్వం శనివారం సీఆర్‌‌పీఎఫ్‌‌ బలగాలను ఏర్పాటు చేసింది. 

మంథనిలో కూలిన మూడు టవర్‌‌ కరెంట్‌‌ పోల్స్‌‌
కన్నెపల్లి పంప్‌‌హౌజ్‌‌ దగ్గర ఒక్కో మోటార్‌‌ 40 మెగావాట్ల సామర్థ్యం కలిగినవి 17 బాహుబలి మోటార్లు బిగించారు. రోజుకు 3 టీఎంసీల నీళ్లు లిఫ్ట్‌‌ చేసేలా ఈ మోటార్లు పనిచేయడానికి రూ.180 కోట్లతో 233/11 కేవీ విద్యుత్‌‌ సబ్‌‌ స్టేషన్‌‌ నిర్మించారు. ప్రతి మోటార్‌‌ రన్నింగ్‌‌ కోసం  భారీ స్థాయిలో ఉండే ట్రాన్స్‌‌ ఫార్మర్లను బిగించారు. ఈ పంప్‌‌హౌస్​కు జైపూర్‌‌ కేటీపీపీ నుంచి విద్యుత్‌‌ సరఫరా జరుగుతుంది. సుందిళ్ల, అన్నారం, కన్నెపల్లి పంప్‌‌హౌజ్‌‌లలో మోటార్లు నడిపించడానికి టవర్‌‌ కరెంట్‌‌ పోల్స్‌‌తో విద్యుత్‌‌ లైన్‌‌ వేశారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మూడు కరెంట్ పోల్స్ పడిపోయాయి.