
- రాష్ట్రాన్ని పణంగా పెట్టి కాళేశ్వరం కోసం లక్ష కోట్ల అప్పు: ఉత్తమ్
- ప్రాజెక్టు కూలడం ఎంత ఘోరమో ప్రజలు అర్థం చేసుకోవాలి
- భారత్ సమిట్లో మీడియాతో ఇరిగేషన్ మంత్రి వెల్లడి
హైదరాబాద్, వెలుగు:కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన రిపోర్టుపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అబద్ధాలు ఆపాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ వాళ్లలాగా తమకు చిల్లర ఆలోచనలు లేవని, డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలను పాటిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెలంగాణను పణంగా పెట్టి రూ.లక్ష కోట్ల అప్పు తీసుకొని ప్రజాధనం వృథా చేసిందన్నారు.
ఇలా రూ. లక్షల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి కట్టిన ప్రాజెక్టు ఇలా కూలిపోవడం ఎంత పెద్ద ఘోరమో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టును బీఆర్ఎస్ రీడిజైన్ చేసి నాసిరకంగా నిర్మించిందని.. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేసి ఉత్తర తెలంగాణ రైతులకు ద్రోహం చేసిందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన భారత్ సమిట్ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.
నివేదిక ఆధారంగా కాళేశ్వరం నిర్మాణంలో అవినీతిని బయటపెడతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నిరుపయోగంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ హయాంలో 280 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. ఇది దేశంలోనే అత్యధిక దిగుబడి అని తెలిపారు. సీతమ్మ సాగర్ బ్యారేజీకి కేంద్ర జలవనరుల శాఖ అనుమతి వచ్చిందని, దీనిద్వారా 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 68% వాటా రావాల్సి ఉండగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసిందన్నారు. తాము మాత్రం ట్రిబ్యునల్‌లో గట్టిగా వాదిస్తున్నామని తెలిపారు.