
- అదనంగా ఒక్క ఎకరాకూ సాగునీరు అందలే: మంత్రి ఉత్తమ్
- కాళేశ్వరం లేకుండానే దేశంలో వరి సాగులో టాప్‌లో నిలిచామని వ్యాఖ్య
- వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నం: మంత్రి తుమ్మల
- ఆర్థిక ఇబ్బందులున్నా.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్నం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- నిజామాబాద్‌లో రైతు మహోత్సవానికి హాజరు
నిజామాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.1.81 లక్షల కోట్లు కేసీఆర్ వృథా చేశారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆయన డిజైన్ చేసిన ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి కూడా అదనంగా సాగునీరు అందలేదన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడే బ్యారేజీలు కూలిపోయాయని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ, అన్నారం కూలినా.. వానాకాలంలో రైతులు 66.7 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసి 153.5 లక్షల టన్నుల వడ్లు పండించారని తెలిపారు. యాసంగిలో 57 లక్షల ఎకరాల సాగుతో 127.5 లక్షల టన్నుల దిగుబడి సాధించి దేశంలోనే టాప్ లో నిలిచారన్నారు. నిజామాబాద్‌లోని గిరిరాజ్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు మహోత్సవం కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.
‘‘సన్న వడ్లకు ఎంఎస్పీ మీద క్వింటాల్‌కు రూ.500 బోసన్ ఇస్తున్నాం. రేషన్ కార్డుల ద్వారా 3.10 కోట్ల మంది ఆకలి తీర్చేందుకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. రాష్ట్రంలో 84% మంది సన్నబియ్యం లబ్ధి పొందుతున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా ఈ స్కీమ్ అమలు చేస్తాం. తెలంగాణలో తప్ప దేశంలోని ఏ స్టేట్‌లో కూడా పేదలకు సన్న బియ్యం సప్లై చేయడం లేదు. ఎస్సారెస్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టుల పూడికతీత పనుల టెండర్లు ఈ నెల్లోనే పూర్తి చేస్తాం.
ఈ 2 ప్రాజెక్టుల కింద ఆయకట్టు పెంచుతాం. అవకాశం ఉన్న చోట్ల చెక్‌డ్యాంలు నిర్మిస్తాం’’అని ఉత్తమ్ అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా తక్కువ ఖర్చుతో ప్రజలకు ఎక్కువ ప్రయోజనం కలిగే పనులకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ‘‘యాసంగి వడ్ల కొనుగోలుకు గన్నీ బ్యాగ్‌ల కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తేవాలి. బాధ్యులైన ఆఫీసర్లపై యాక్షన్ తీసుకుంటాను. ఇందూర్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నేను ఎంపీగా ఉన్నప్పుడు పలుమార్లు పార్లమెంట్లో ప్రస్తావించా. కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా.. ఇప్పటి దాకా పనులు మొదలుపెట్టలేదు’’అని ఉత్తమ్ అన్నారు.
రైతుల బాగోగులు చూడటం మా బాధ్యత: మంత్రి తుమ్మల
రైతులంతా కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. రైతుల బాగోగులు చూడటం తమ బాధ్యత అని తెలిపారు. ‘‘వ్యవసాయ రంగానికి రేవంత్ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు, విదేశాలకు ఎగుమతి చేసే ఉత్పత్తులపై రైతులు ఫోకస్ పెట్టాలి. దేవరకొండలో ఓ రైతు ఎకరం కుంకుడు పంట వేసి రూ.6 లక్షల ఇన్కమ్ పొందాడు.
వచ్చే మూడున్నరేండ్లలో ప్రతి జిల్లాలో ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం. సాగు నీరు ఉందని వరి పంట మాత్రమే వేయడం సరికాదు. యూరియా, పురుగు మందుల వాడకం గణనీయంగా తగ్గించాలి’’అని మంత్రి తుమ్మల అన్నారు. సన్‌ఫ్లవర్, జొన్న, మక్కల కొనుగోళ్లతో ఏటా రూ.1,000 కోట్లు నష్టపోతున్నామని, అయినప్పటికీ రైతుల మేలు దృష్ట్యా కొనుగోళ్లు ఆపడం లేదని తెలిపారు.
ఇతర దేశాల్లో సాగు పద్ధతులపై స్టడీ చేయాలి: టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్
ఇతర దేశాల్లో సాగు పద్ధతులపై స్టడీ చేసేందుకు తెలంగాణ ఆదర్శ రైతులను విదేశాలకు తీసుకెళ్లాలని టీపీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ సూచించారు. రైతుల చల్లని చూపుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ‘‘ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం. కాంగ్రెస్ మాటిచ్చి ఎప్పుడూ మోసం చేయదు. నిజాంసాగర్‌లో పూడిక పెరిగి కెపాసిటీ 15 టీఎంసీలకు మించి పడిపోగా.. 1970లో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ 2 మీటర్ల ఎత్తు పెంచింది. నిజాంసాగర్ కింద మరో లక్ష ఎకరాలు, ఎస్సారెస్పీ కింద మరో లక్షన్నర ఎకరాల విస్తీర్ణం పెంచే ప్రపోజల్స్ సీఎం రేవంత్‌రెడ్డికి అందిస్తాం’’అని మహేశ్ గౌడ్ అన్నారు.
హెలికాప్టర్ ల్యాండింగ్‌లో సమన్వయ లోపం
రైతు మహోత్సవాల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రుల హెలికాప్టర్ ల్యాండింగ్‌లో సమన్వయ లోపం ఏర్పడింది. పైలెట్ పొరపాటు కారణంగా కలెక్టరేట్లోని హెలిపాడ్‌లో ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్.. రైతు మహోత్సవం నిర్వహిస్తున్న గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్లో దిగింది. దీంతో భారీగా వీచిన గాలికి స్వాగత తోరణం, టెంట్లు కుప్పకూలాయి. ఆ ప్రాంతమంతా దుమ్మూ, ధూళితో నిండిపోయింది. అధికారులు, పోలీసులు, నేతలు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. మంత్రులు దిగిన వెంటనే హెలికాప్టర్‌ను కలెక్టరేట్ హెలిపాడ్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మంత్రులు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.