
హైదరాబాద్: కాళేశ్వరం స్కాం దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచింది. కాళేశ్వరం ENC హరి రామ్ను అరెస్ట్ చేసిన ఏసీబీ రిమాండ్ కు తరలించింది. ఆయనపై ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. హరి రామ్ కుటుంబం పేరు మీద గజ్వేల్లో భారీగా చట్ట విరుద్ధమైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. ENC హరి రామ్, అతని బంధువుల ఇండ్లల్లో13చోట్ల ఏసీబీ సోదాలు చేసింది. హైదరాబాద్ నగరంలోని షేక్ పేట్, కొండాపూర్ ప్రాంతాల్లో విల్లాలు.. శ్రీనగర్ కాలనీ, నార్సింగి, మాదాపూర్ ఏరియాల్లో కాళేశ్వరం ENC హరి రామ్ పేరిట ఫ్లాట్స్ను ఏసీబీ అధికారులు గుర్తించారు.
తెలంగాణలోనే కాదు.. ఏపీ రాజధాని అమరావతిలో కూడా హరి రామ్ వాణిజ్య స్థలం కొన్నట్లు ఏసీబీ గుర్తించింది. సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పఠాన్ చెరులో 20 గుంటలు, శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ ఇండ్లు, 6 ఎకరాల మామిడి తోట, ఒక ఫామ్ హౌస్, కొత్తగూడెం, మిర్యాలగూడలో ఓపెన్ ప్లాట్లు.. ఇదీ ఏసీబీ గుర్తించిన కాళేశ్వరం ENC హరి రామ్ ఆస్తుల చిట్టా.
బీఎండబ్ల్యూ కారుతో సహా బంగారు ఆభరణాలు, పలు ఆస్తుల పత్రాలు, బ్యాంకు డిపాజిట్లు బయటపడ్డాయి. ఈఎన్సీ హరి రామ్పై ఇంకా ఏసీబీ దాడులు కొనసాగిస్తూనే ఉంటామని.. ఆయన దగ్గర ఉన్న ఆస్తులు కోట్లాది రూపాయల విలువైనవని ఏసీబీ అధికారులు తెలిపారు. అధికారిక వాల్యూ కంటే అనధికారిక బహిరంగ మార్కెట్ వాల్యూ 10 రెట్లు ఎక్కువ అని ఏసీబీ పేర్కొంది.