అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చినా న్యాయం జరగలే

పెద్దపల్లి, వెలుగు:  కాళేశ్వరం ముంపు బాధితులకు న్యాయం చేస్తామని   ఐదు నెలల క్రితం  అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాటిచ్చారు. కానీ,  నేటికీ బాధితులను పట్టించుకున్నవారు లేరు. సర్వేల పేరుతో సర్కార్  నాలుగేళ్లుగా కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  రానున్న  ఎలక్షన్ల లోపే తమ సమస్య  పరిష్కరించాలని  రైతులు డిమాండ్​ చేస్తున్నారు. లేకుంటే  ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ముంపు గ్రామాలైన ఆరెంద, మల్లారం, ఖాన్సాయిపేట, అమ్మగారిపేట ముంపు బాధితులు  రాస్తారోకోలు,  ధర్నాలు చేసి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గత మూడేళ్లుగా  రెండు పంటలు మునుగుతున్నట్టు రైతులు చెప్పడంతో ఒకసారి అధికారులు సర్వే చేసి వెళ్లారు.  కానీ ఆ సర్వే వివరాలు ఇప్పటి వరకు బయటపెట్టలేదు. బ్యారేజీల కింద మునుగుతున్న భూములన్నీ సర్కార్ తీసుకోవాలని, ఎకరానికి రూ. 20 లక్షలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.  

సర్వే  రిపోర్ట్​ అందలేదంటున్నరు...

కాళేశ్వరం బ్యాక్ వాటర్​తో  మునిగిపోయిన పంటలకు నష్టపరిహారంతో పాటు రెండేళ్లుగా క్రాప్ హాలిడే పరిహారం కూడా ఇవ్వాలని కాళేశ్వరం బ్యారేజీల ముంపు గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం భూములను తీసుకొని ఎకరానికి రూ. 20 లక్షలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే రెవెన్యూ, అగ్రికల్చర్ ఆఫీసర్లు  పరిహారం కోసం ఉన్నతాధికారులను అడిగితే సర్వే రిపోర్టు అందలేదని, అందిన వెంటనే పరిహారం ఇస్తామంటున్నారని రైతులు చెప్తున్నారు. అలాగే భూసేకరణ కోసం అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి అందజేశారు. అయినా భూమిని హ్యాండోవర్ చేసుకోవడానికి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటున్నారు.  వరద ఉదృతి పెరిగినప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల  బ్యారేజీల గేట్లు ఓపెన్ చేయడంతో బ్యాక్ వాటర్ తో వందలాది ఎకరాల పంటలు మునుగుతున్నాయి.  మంథని, రామగుండం, వెల్గటూరు  రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.  

ఒక్కసారే పరిహారం ఇచ్చి ఆపేసిండ్రు

గడిచిన మూడేళ్లుగా సాలుకు రెండు పంటల చొప్పున ఆరు పంటలు వేసినా  రైతుల చేతికి ఒక్క గింజ కూడా రాలేదు. ప్రతి పంట నీటి పాలైంది. మొదటి సంవత్సరం పంట నీట మునిగిన తర్వాత అధికారులు వచ్చి నష్టాన్ని లెక్కించి ఎకరానికి రూ. 19వేలు ఇచ్చిండ్రు. ఆ తర్వాత నష్టపోయిన ఐదు పంటలకు రూపాయి కూడా ఇవ్వలేదు.  ఏటా పంట నీట మునుగుతుందని అధికారులే పంట వేయవద్దని సూచించారు.కానీ, ఇప్పటి వరకు నీట మునిగిన పంటకు, క్రాప్​ హాలిడే పరిహారం ఇవ్వలేదంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కాక ముందు రూ. 2 లక్షలతో బోర్లు 
వేయించుకొని ప్రతీ యేడు రెండు పంటలు పండించే వాళ్లమని, నీటి తాకిడికి బోర్లు, పైప్లైన్లు కూడా మునిగిపోయాయని, అన్ని విధాలుగా నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

4వేల ఎకరాలకు వరద ముప్పు

మంథని మండల పరిధిలో పలు గ్రామాల పరిధిలో  దాదాపు 4000 ఎకరాలు ముంపునకు గురువుతున్నాయి.  గత మూడేళ్లుగా  కాళేశ్వరం బ్యారేజీల కింద ఉన్న పంటలు దాదాపు 20 వేల ఎకరాలు నీటిపాలైనాయి. అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్ కింద ముంపుకు గురవుతున్న గ్రామాల రైతులకు అండగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నిలబడ్డారు.  రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా బాధితులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. రైతులను డిల్లీ వరకు తీసుకెళ్లి సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో సమస్యపై చర్చించారు. సమస్య తీవ్రతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరి అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ముంపు గ్రామాల రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. 

సీఎం చెప్పినట్లు రైతులకు న్యాయం చేయాలే..

సీఎం హామీ ఇచ్చినట్లుగా వెంటనే సర్వే పూర్తి చేసి రైతులకు పరిహారం ఇయ్యాలే. మూడేండ్లు 6 సార్లు పంట వేసిన,   యేటా పంట చేతికచ్చే టైంలనే పంటలన్నీ వరద ముంపుకు గురైనయి. మొదటి యేడు ప్రభుత్వం ఒక్కసారి పంట నష్ట పరిహారం ఇచ్చింది. ఆ తర్వాత రూపాయి కూడా ఇయ్యలేదు. పంట చేతికి రాకపోతదా అనే ఆశతో పంటలు వేస్తున్నం కాని ముంపు తప్పుత లేదు. కనీసం క్రాప్ హాలిడే పరిహారం ఇయ్యలేదు. అందుకే భూములను తీసుకొని పరిహారం ఇయ్యాలని డిమాండ్ చేస్తున్నం.

సత్యనారాయణ,  సర్పంచ్, మల్లారం, పెద్దపల్లి జిల్లా

 ముంపు బాధితులకు  న్యాయం చేయాలే

కాళేశ్వరం ప్రాజెక్టు  అన్నారం బ్యారేజీ కింద మంథని మండలంలోని చాల గ్రామాల రైతుల భూములు ముంపునకు గురవుతున్నాయి.  ఆ భూములను ప్రభుత్వం తీసుకొని రైతులకు పరిహారం అందించాలి. ప్రతీ యేటా మునుగుతుండటంతో రైతులు భూములను పడావు పెడుతున్నరు. బతుకడానికి కూలీలుగా మారుతున్నరు అప్పుల పాలైతున్నరు. వెంటనే ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలే.

 చందుపట్ల సునీల్రెడ్డి,  బీజేపీ స్టేట్ లీడర్, మంథని