ముంచుతున్న కాళేశ్వరం : చెన్నూరులో రైతుల పక్షాన వివేక్ వెంకటస్వామి పోరాటం

వెలుగు, చెన్నూర్:  రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు చెన్నూర్​ నియోజకవర్గ రైతాంగం పాలిట శాపంగా మారింది. రూ.లక్ష కోట్ల ఖర్చుతో కట్టిన ఈ ప్రాజెక్టు నుంచి ఇక్కడి పొలాలకు చుక్క నీళ్లు కూడా రాకపోగా.. బ్యారేజీల బ్యాక్  వాటర్  వల్ల ఏటా వేల ఎకరాల్లో పంటలు మునుగుతున్నాయి. నియోజకవర్గంలోని జైపూర్, చెన్నూర్, కోటపల్లి మండలాల్లో దాదాపు 30వేల ఎకరాల్లో పంటలు నీటిపాలవుతున్నాయి. 

నష్టపరిహారం ఎకరాకు రూ.30వేలు అందించాలని, ముంపు భూములను ప్రభుత్వమే తీసుకొని ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించాలని రైతులు, ప్రతిపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇంతవరకు రైతులకు పైసా పరిహారం కూడా చెల్లించలేదు. ఏదైనా అవసరానికి భూములు అమ్ముకుందామన్నా ముంపు ప్రాంతమని కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదని రైతులు వాపోతున్నారు. రేట్లు సైతం ఇరవై, ముప్పై లక్షల నుంచి రూ.5లక్షలకు పడిపోయాయని ఆవేదన చెందుతున్నారు. 

ఇద్దరు కౌలు రైతుల ఆత్మహత్య..

కాళేశ్వరం బ్యాక్ వాటర్ లో పంటలు మునిగి నష్టపోవడంతో ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కోటపల్లి మండలం పుల్లగామకు చెందిన కామ లింగయ్య (60) 2020లో పదెకరాలు కౌలు పట్టి పత్తి వేశాడు. ఆగస్టు నెలాఖరులో గోదావరికి వరద పోటెత్తింది. మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్  వాటర్  వల్ల ప్రాణహిత ఒడ్డు పొంట 10వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అగ్రికల్చర్  ఆఫీసర్లు సర్వే చేసి సర్కారుకు రిపోర్టు ఇచ్చినప్పటికీ రైతులకు పరిహారం రాలేదు. అప్పులపాలైన లింగయ్య 2020 సెప్టెంబర్ 21న ఇంట్లో ఉన్న పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ఇస్తామని ఎమ్మెల్యే బాల్క సుమన్  ప్రకటించినప్పటికీ ఇంతవరకు ఆ ఊసేలేదు. 


 2021లో చెన్నూర్ జెండావాడకు చెందిన కమ్ముల రాజేశ్​ (28) బతుకమ్మవాగు దగ్గర్లో ఆరెకరాలు కౌలుకు తీసుకుని పత్తి పెట్టాడు. జూలై నెలాఖరులో అన్నారం బ్యారేజీ వాటర్ లో పంట మునిగింది. దాన్ని చెడగొట్టి మళ్లీ పత్తి, మిర్చి వేయగా, సెప్టెంబర్ మొదటివారంలో మరోసారి బ్యాక్  వాటర్ ముంచెత్తింది. పెట్టుబడులకు చేసిన రూ.5లక్షల అప్పు మీదపడడంతో మనస్తాపం చెంది సెప్టెంబర్ 23న చెన్నూర్ పెద్ద చెరువులో దూకాడు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆందోళనలు చేస్తే బాల్క సుమన్ కంటితుడుపుగా ఆర్థికసాయం అందించి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎక్స్ గ్రేషియా ఇప్పించడంలో విఫలమయ్యారు. 

బాల్క సుమన్​... మా గోడు వినపడడం లేదా?

కాళేశ్వరం ప్రాజెక్టుతోటి మాకు సుక్క నీళ్లత్తలేవ్​గని నాలుగేండ్ల సంది పంటలన్నీ మునుగుతున్నయ్​. మీరు గిట్ల రోడ్ల పొంట తిరుగుడు కాదు సారు, ఒక్కసారి చేన్లల్లకు వచ్చి సూడున్రి మా గోసేందో తెలుస్తది అంటూ చెన్నూర్ లో కాళేశ్వరం బ్యాక్​ వాటర్​ముంపు రైతులు ఎమ్మెల్యే బాల్క సుమన్​ను 2023 జూలైలో నిలదీశారు. సుమన్​ భారీ పోలీసు బందోబస్తు మధ్య బతుకమ్మ వాగు బ్రిడ్జిని పరిశీలించడానికి బయల్దేరగా, గోదావరి ఎక్స్​రోడ్డు వద్ద ఎదురుచూస్తున్న సుమారు 50 మంది రైతులు కాన్వాయ్​ను అడ్డుకున్నారు. నాలుగు సంవత్సరాల నుంచి పంటలు మునిగి తీవ్రంగా నష్టపోతున్నామని, స్థానిక ఎమ్మెల్యే అయిన  మీరు గానీ, సర్కారు గానీ తమను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఇయ్యకపోవడంతో తామంతా విషం తాగి చనిపోయే పరిస్థితి వచ్చిందని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులబాధకు భూములను అమ్ముకుందామంటే ముంపు భూములని రేటు రావడం లేదన్నారు. అటు భూములు అమ్ముకోలేక, ఇటు అప్పులు కట్టలేక అవస్థలు పడుతున్నామని తెలిపారు. ఇకనైనా మాకు ఏ విధమైన న్యాయం చేస్తారో చెప్పున్రి అంటూ నిలదీశారు. పంటనష్టం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, సీఎం కేసీఆర్​తో మాట్లాడి పరిహారం ఇప్పిస్తామని  చెప్తూ సుమన్​ అక్కడి నుంచి జారుకున్నారు.  

కేసీఆర్​ సైలెన్స్​..

‘కాళేశ్వరం ప్రాజెక్టు వరల్డ్​ వండర్’​ అంటూ ఇన్నాళ్లు గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్​ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దాని ఊసెత్తడం లేదు. ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు బుంగలు ఏర్పడడంతో కాళేశ్వరం బండారం బయటపడ్డది. దీంతో ఈ ప్రాజెక్టు గురించి సీఎం కేసీఆర్​ తన ఎన్నికల ప్రచార సభల్లో కనీసం పల్లెత్తు మాటెత్తడం లేదు. ఇటీవల  మందమర్రి, మంథని సభల్లో ఆ పార్టీ అభ్యర్థులు బాల్క సుమన్​, పుట్ట మధు కాళేశ్వరం బ్యాక్​ వాటర్​ వల్ల రెండు నియోజకవర్గాల్లో ఏటా పంటలు మునుగుతున్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని, గోదావరికి కరకట్టలు కట్టి ముంపు సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. కానీ కేసీఆర్​ తన ప్రసంగంలో ఎక్కడా ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా దాటవేశారంటే రైతులపై ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో ఆర్థం చేసుకోవచ్చు. 

నాలుగు ఎకరాలకు 3 గుంటలు రాసిన్రు.. 

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి మాకు కష్టాలు మొదలైనయ్​. నాకున్న నాలుగు ఎకరాల భూమి ఏటాబ్యాక్​ వాటర్​లో మునుగుతోంది. ఆఫీసర్లు సర్వే చేసి 3 గుంటలు మాత్రమే మునుగుతోందని బండలు పాతిన్రు.గింత అన్యాయం ఉంటదా? ముంపు భూములకు ఎకరానికి రూ.20 లక్షలు ఇయ్యాలె. 
- కోరల్ల రవీందర్​రెడ్డి, బబ్బెరచెల్క (కోటపల్లి మండలం)

నాలుగేండ్ల నుంచి భూమి బీడువోతున్నది..

శెట్​పల్లి గ్రామ శివారులో మాకు వ్యవసాయ భూములు ఉన్నయ్​. నాలుగేండ్ల నుంచి గోదావరి వరదల్లో 3 ఎకరాల భూమి మునుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లు రావడంతోనే పంటలు మునుగుతున్నయి. కలెక్టర్ కు చెప్పినా ఎలాంటి న్యాయం జరగలేదు. నాలుగు సంవత్సరాల నుంచి భూమి  బీడు పోతంది. ఎవరికీ చెప్పినా నష్టపరిహారం రాలేదు.
- కారుపాకల రాజం, శెట్​పల్లి (జైపూర్​ మండలం)