- ప్రతి పనికీ ముడుపులు ముట్టజెప్పిన ఏజెన్సీలు
- ఇంజినీర్లు మొదలు నాటి ప్రభుత్వ పెద్దల దాకా అందరికీ వాటా!
- ఇందుకోసమే ఆగమేఘాల మీద అంచనాల పెంపు
- ప్రాథమికంగా నిర్ధారించిన కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్
- పరిపాలనా అనుమతుల్లేకుండానే కాంట్రాక్టర్లకు చెల్లింపులు
- పనులు పూర్తి కాకుండానే వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు
- అంతా పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే వ్యవహారం
- క్వాలిటీ కంట్రోల్, మెయింటనెన్స్ గాలికి..
- పంప్ హౌస్ పనుల్లోనూ భారీగా అవకతవకలు
- అన్ని ఆధారాలతో రిపోర్ట్ రెడీ చేసిన జ్యుడీషియల్ కమిషన్
- కాగ్ లేవనెత్తిన అంశాలు సహా అన్ని వివరాలు పరిగణనలోకి
- వచ్చే నెల చివర్లో లేదంటే మార్చిలో సర్కారుకు నివేదిక
హైదరాబాద్, వెలుగు : లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో కింది నుంచి పైస్థాయి దాకా పెద్ద ఎత్తున కమీషన్ల దందా నడిచినట్లు ఈ ప్రాజెక్టుపై ఎంక్వైరీ చేస్తున్న జ్యుడీషియల్ కమిషన్ ప్రాథమికంగా నిర్ధారించింది. ఇంజినీర్లు మొదలుకొని నాటి ప్రభుత్వ పెద్దల వరకు అందరికీ కాంట్రాక్ట్ సంస్థలు భారీగా ముడుపులు ముట్టజెప్పాయని, వాటిని రాబట్టుకునేందుకు నిబంధనలు తుంగలో తొక్కాయని కమిషన్ అంచనాకు వచ్చింది. రూల్స్ బ్రేక్ చేసేందుకు అప్పట్లో అధికారులు, నాటి ప్రభుత్వ పెద్దలు సహకరించినట్లు గుర్తించింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాగ్ లేవనెత్తిన అంశాలను.. విజిలెన్స్ రిపోర్టులు, అఫిడవిట్లు ఇతరత్రా నివేదికలను జ్యుడీషియల్‌కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. కాళేశ్వరం కోసం ఆగమేఘాల మీద ఖర్చుల అంచనాల పెంపు, పరిపాలన అనుమతులు లేకుండానే చెల్లింపులు.. పనులు పూర్తి కాకుండానే కంప్లీషన్ సర్టిఫికెట్ల జారీ .. అంతా కమీషన్లలో భాగంగానే జరిగినట్లు భావిస్తున్నది. ఇప్పటిదాకా బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల నిర్మాణం లాంటి సివిల్‌వర్క్స్ వరకే అవినీతి పరిమితమైందని భావించినప్పటికీ.. విదేశాల నుంచి తెచ్చిన మోటార్ల కొనుగోలులోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు విచారణ తర్వాత కమిషన్ గుర్తించింది.
దీనిపై కమిషన్‌కు కొందరు రహస్యంగా ఆధారాలు అందించినట్లు తెలిసింది. అయితే పంప్‌హౌస్‌లకు సంబంధించిన వివరాలను విచారణ కమిషన్‌కు సంబంధించిన టర్మ్స్ అండ్ రిఫరెన్స్ (టీవోఆర్)లో లేవు. ఈ అంశంపై కమిషన్ ఎలా ముందుకు వెళ్తుందనేది చర్చకు దారితీసింది. కాగా, ఇప్పటికే 204 పేజీలకుపైగా రిపోర్ట్‌ను రెడీ చేసిన జ్యుడీషియల్ కమిషన్..వచ్చే నెల చివర్లో లేదంటే మార్చిలో రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదిక అందించే అవకాశం ఉంది.
ఐదు నెలలుగా విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న ప్రస్తుత, రిటైర్డ్ ఈఎన్సీలు, ఇంజినీర్లు, ఐఏఎస్‌లు, నిర్మాణంలో పాలుపంచుకున్న కంపెనీల ప్రతినిధులను జ్యుడీషియల్ కమిషన్ ఐదు నెలలుగా ఎంక్వైరీ చేస్తున్నది. మొదటి దశలో అఫిడవిట్లు తీసుకొని తర్వాత దశలో ఓపెన్కోర్టు ద్వారా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నది. ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నికల్ అంశాలు, పాలసీ నిర్ణయాలు, నిధుల విడుదల, నిర్వహణకు సంబంధించిన అన్ని రకాల వివరాలను సేకరించింది. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో జరిగిన అనేక అవకతవకలను, లోటుపాట్లను గుర్తించింది.
నిబంధనలేవీ పాటించకుండా ఆగమేఘాల మీద ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లను, పనులను పురమాయించడం, క్షేత్రస్థాయిలో పనులు పూర్తి కాకముందే పూర్తయినట్లు వర్క్కంప్లీషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం, కొన్ని పనులు చేయకుండానే చేసినట్లు చూపడం, నిర్వహణ చేయాల్సిన బాధ్యత ఏజెన్సీకి ఉన్నప్పటికీ ఆ విషయంలోనూ చూసీచూడనట్లు వ్యవహరించడం, బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకున్నా డిఫెక్ట్లయబులిటీ పీరియడ్ ప్రారంభమైందని సర్టిఫికెట్లు జారీ చేయడం, కరోనా టైంలోనూ ఏజెన్సీకి బ్యాంక్ గ్యారంటీలను రిలీజ్చేయాలని ఆదేశించడం లాంటివాటిని జ్యుడీషియల్ కమిషన్ ప్రధానంగా గుర్తించింది. నాటి ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి లేకుండా ఇవేవీ సాధ్యం కావని, అదే సమయంలో ఆఫీసర్ల అత్యుత్సాహం వెనుక కమీషన్ల దందా నడిచిందని తగిన ఆధారాలతో నిర్ధారణకు వచ్చింది.
అంచనాలను అడ్డగోలుగా పెంచేశారు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనాలను ఇష్టారీతిగా పెంచినట్లు జ్యుడీషియల్ కమిషన్ గుర్తించింది. కేవలం నెలల వ్యవధిలోనే భారీ మొత్తంలో అంచనాలు పెరగడం వెనుక ఏమి జరిగిందో లోతుగా ఆరా తీసింది. ఇంతచేసినా ఆయకట్టుకు నీళ్లు రాకపోవడం, మేడిగడ్డ కుంగిపోవడంతో ఇంతకీ ప్రాజెక్టు ఎవరి లబ్ధికోసం చేపట్టారనే కోణంలోనూ వివరాలు సేకరించింది. ముందుగా అనుకున్నట్లు తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు చేపడితే రూ.38,500 కోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందేవి. కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చాక రీ డిజైన్ పేరుతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను అనూహ్యంగా రూ.80,190 కోట్లకు పెంచారు. ఆ తర్వాత రూ.88,557 కోట్లకు, అనంతరం అడిషన్టీఎంసీ పేరుతో రూ.1.10 లక్షల కోట్లకు పెంచేశారు.
ఆపై మరిన్ని పనుల పేరుతో ఎవరు ఊహించని రీతిలో రూ.1.47 లక్షల కోట్లకు పనుల అంచనాలు పెరగడంపై కమిషన్ ఇప్పటికే వివరాలు తీసుకున్నది. ఉదాహరణకు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి 2016లో రూ.1,853.31 కోట్లతో టెండర్లు పిలువగా, ఎల్అండ్టీ - పీఎఈఎస్ జాయింట్ వెంచర్ 2.7 శాతం ఎక్సెస్‌కు కోట్ చేసి పనులు దక్కించుకుంది. కాగా, బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని 2018లో రూ.3,065.4 కోట్లకు అప్పటి ప్రభుత్వం పెంచింది. 2021లో ఇది రూ.4,321.44 కోట్లకు చేరింది.
మొత్తంగా 133.67 శాతం బ్యారేజీ నిర్మాణ వ్యయం పెంచారని అప్పట్లో కాగ్ బయటపెట్టింది. మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి రూ.93 వేల కోట్లకుపైగా ఖర్చు చేయగా, అడిషనల్టీఎంసీ సహా అనేక ప్యాకేజీల పనులు పెండింగ్‌లో ఉండి, లక్ష ఎకరాలకు కూడా కాళేశ్వరం ద్వారా నీరందడం లేదు. అకౌంట్స్ విషయంలో కాగ్ లేవనెత్తిన అన్ని అంశాలను, సంబంధిత అధికారుల వివరణను, అఫిడవిట్లను, క్షేత్రస్థాయిలో పనుల పరిశీలనతో ఏం జరిగిందో కమిషన్ నిర్ధారించుకున్నట్లు తెలిసింది.
పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే..
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా డిజైన్ల ఆమో దం, బ్యారేజీల స్థలాల ఫైనలైజ్, ఫైళ్ల మూమెంట్లు, పరిపాలన అనుమతులు, నిర్మాణం, నిర్వహణ అన్ని వ్యవహారాలు పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే చేశామని ఓపెన్ కోర్టు విచారణలో ఇంజినీర్ల నుంచి ఐఏఎస్‌ల దాకా జ్యుడీషియల్ కమిషన్‌కు వెల్లడించారు. ముఖ్యంగా పనులు పూర్తికాకపోయినా వర్క్ కంప్లీషన్సర్టిఫికెట్లు ఇవ్వడం, కరోనా టైంలో ఏజెన్సీకి బ్యాంక్ గ్యారెంటీలు రిలీజ్చేయడంలోనూ ఏదో మతలబు ఉందని పసిగట్టిన కమిషన్.. దీనికి సంబంధించి చాలా ఆధారాలు సేకరించినట్లు తెలుస్తున్నది. ఇలాంటి కీలక ప్రాజెక్టు విషయంలో నిబంధనలు పాటించకుండా నాడు ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేయడం, వాటిని అధికారులు పాటించడం, ఆమేరకు ఏజెన్సీలు లబ్ధిపొందడం ఒకదానికి ఒకటి లింక్ ఉన్నట్లు కమిషన్ భావిస్తున్నది.
బ్యారేజీల నిర్మాణ సమయంలో క్వాలిటీ కంట్రోల్ పట్టించుకోకపోవడం, నిర్వహణ బాధ్యతల నుంచి ఏజెన్సీలను వదిలేయడం, క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు చేయించకుండానే వేల కోట్ల రూపాయలు చెల్లించడం, రిజిస్టర్లలో అడ్డదిడ్డంగా మార్పులు చేయడం, బిల్లుల చెల్లింపుల్లోనూ మార్గదర్శకాలు పాటించకపోవడం, పరిపాలన అనుమతులు లేకుండానే ఫండ్స్ రిలీజ్చేయడం వెనుక కమీషన్ల దందా జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన విచారణ కమిషన్.. ఫైనాన్స్‌కు సంబంధించిన విషయాలను ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎలాంటి సెక్షన్లను పరిగణనలోకి తీసుకోవాలనే దానిపైనా ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.
నేటి నుంచి మళ్లీ ఓపెన్ కోర్టు
మంగళవారం నుంచి కాళేశ్వరం కమిషన్ మళ్లీ ఓపెన్ కోర్టు నిర్వహించనుంది. ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ఇతర ఆర్థిక శాఖ అధికారులను పిలవనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఫైనాన్స్వ్యవహారాలపై ప్రశ్నించే అవకాశముంది. అదే విధంగా వి.ప్రకాష్, - నిర్మాణ ఏజెన్సీలను ఈ దఫా విచారిస్తామని కమిషన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. మాజీ ఈఎన్సీలను మరోసారి ఓపెన్ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఇటు విచారణ చేస్తూనే ఎప్పటికప్పుడు రిపోర్ట్ తయారీలో కమిషన్ నిమగ్నమైంది. ఇప్పటి వరకు జరిగిన విచారణపై 204కుపైగా పేజీలతో రిపోర్ట్‌ను రెడీ చేసి పెట్టుకున్నట్లు తెలిసింది.
మోటార్ల కొనుగోలులోనూ భారీ అవకతవకలు
కాళేశ్వరం ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన 3 పంప్ హౌస్‌ల కోసం రూ.10 వేల కోట్లకుపైగా ఖర్చు చేశారు. విదేశాల నుంచి తెప్పించిన 46 బాహుబలి మోటార్లను బిగించగా, 2022లో గోదావరికి వచ్చిన వరదలకు కన్నెపల్లి (లక్ష్మి), అన్నారం (సరస్వతి) పంప్‌హౌస్‌లలోని 29 మోటార్లు , వాటర్ లిఫ్టింగ్‌కు సంబంధించిన ఇతర పరికరాలన్నీ నీట మునిగాయి. దీంతో వందల కోట్ల నష్టం వాటిల్లింది. నిజానికి ఎఫ్‌ఆర్‌ఎల్‌ను సరిగ్గా అంచనా వేయకుండా పంప్‌హౌస్‌లు నిర్మించడం, క్వాలిటీ పాటించకపోవడం వల్లే ఈ స్థాయిలో నష్టం జరిగిందని నిపుణులు తేల్చారు.
మోటార్ల కొనుగోళ్లలోనూ భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణ లు వచ్చాయి. కాగా, పంప్‌హౌస్‌లకు సంబంధించిన అంశాన్ని విచారణ కమిషన్ సబ్జెక్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు. మేడిగడ్డ కుంగినందున.. ప్రాజెక్టు నిర్మాణ వైఫల్యంపైనే విచారణ చేసేలా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కానీ, ఎంక్వైరీ సందర్భంగా పంప్‌హౌస్‌లు ఇతర అంశాల్లోనూ అవకతవకలు జరిగినట్లు కమిషన్ దృష్టికి వచ్చింది. దీనిపై కమిషన్ సుమోటాగా విచారణ చేస్తుందా? వదిలేస్తుందా? అనేది క్లారిటీ లేదు.