- అధికారికంగా అంచనా వేసిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్
హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం పంపు హౌస్ ల ము నకతో రూ.1,250 కోట్ల నష్టం వాటిల్లిందని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారికంగా అంచనా వేసింది. ఇందులో ఒక్క కన్నెపల్లి పంపుహౌస్ ముంపుతోనే రూ.1,200 కోట్ల నష్టం వాటిల్లిందని లెక్కగట్టింది. అన్నారం పంపుహౌస్ ముంపుతో రూ. 50 కోట్ల నష్టం జరిగిందని గుర్తించింది. కన్నెపల్లి పంపుహౌస్ లో పూర్తిగా దెబ్బతిన్న 6 మోటార్లను రూ. 40 కోట్ల చొప్పున రూ. 240 కోట్లతో కొనుగోలు చేసేందుకు ఇంజనీర్లు ఆర్డర్ చేశారు. ఇక్కడ సివిల్ పనులకు రూ. 300 కోట్లు, ఇతర ఎక్విప్మెంట్ కు రూ. 460 కోట్ల నష్టం వాటిల్లిందని గుర్తించారు. కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్ ల్లో రెండు కంట్రోల్ ప్యానళ్లు, ఇతర ఎక్విప్మెంట్ రూ. 250 కోట్లతో కొనుగోలు చేయనున్నారు. ఇందులో కన్నెపల్లి పంపుహౌస్ లో బిగించాల్సిన కంట్రోల్ ప్యానళ్లు, ఇతర ఎక్విప్మెంట్ కు రూ. 200 కోట్లు ఖర్చు చేయనున్నారు.
అన్నారం పంపుహౌస్ లో ఇప్పటికే ఒక పంపు పునరుద్ధరించారు. ప్రతి పది రోజులకు ఒకటి చొప్పున రానున్న నెల రోజుల్లో ఇంకో మూడు మోటార్లు ట్రయల్ రన్ చేయనున్నారు. అన్నారం పంపుహౌస్ లో ఈ నాలుగు మినహా మిగతా ఎనిమిది పంపుల పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చారు. కన్నెపల్లిలో ఇంత వరకూ ఒక్క మోటారును కూడా వెలికి తీయలేదని ఇంజనీర్లు చెప్తున్నారు. డిసెంబర్ నాటికి పంపుహౌస్ లో కనీసం రెండు మోటార్లను రన్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ప్రస్తుతం కన్నెపల్లి పంపుహౌస్ లో ప్రొటెక్షన్ వాల్ పునరుద్ధరణ పనులే చేస్తున్నామని తెలిపారు.