- వాటర్ లీకేజీని ఆపేందుకు ప్రయత్నాలు
- నాలుగు చోట్ల పైకి కనిపిస్తున్న బుంగలు
- గేట్ తెరిచి కిందికి 2 వేల క్యూసెక్కుల నీటి విడుదల
- బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదన్న ఈఈkal
- గత నెల 21న మేడిగడ్డలో కుంగిన పిల్లర్లు
జయశంకర్ భూపాలపల్లి/
మహాదేవ్‌పూర్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన అన్నారం(సరస్వతి) బ్యారేజీ పిల్లర్ల కింద పదిచోట్ల బుంగలు పడ్డాయి. నీళ్లు లీకవుతున్నాయి. మొన్న మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీ పిల్లర్లు కుంగిన విషయం మరవకముందే ఇప్పుడు అన్నారం బ్యారేజీ పిల్లర్ల కింద సీపేజ్‌లు ఏర్పడడంతో ప్రాజెక్టు ఇంజినీర్లు హుటాహుటిన రంగంలోకి దిగి.. కూలీల సాయంతో బస్తాల్లో ఇసుక నింపి బుంగ దగ్గర వేయిస్తున్నారు. అయినా వాటర్ లీకేజీ ఆగకపోవడంతో బ్యారేజీలోని ఒక గేట్ తెరిచి 2 వేల క్యుసెక్కుల నీటిని దిగువకు వృథాగా విడిచిపెడుతున్నారు. రూ. లక్ష కోట్లు అప్పు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో నిరుడు రెండు పంప్‌హౌస్‌లు నీట మునుగగా.. ఈ ఏడాది రెండు బ్యారేజీల్లో లోపాలు బయటపడ్డాయి.
పెద్ద పెద్ద బుంగలు
కాళేశ్వరంలో భాగంగా రూ. 2,147 కోట్లతో కట్టిన అన్నారం(సరస్వతి) రిజర్వాయర్ కెపాసిటీ10.87 టీఎంసీలు. 1,250 మీటర్ల పొడవున్న ఈ బ్యారేజీకి 66 గేట్లు ఏర్పాటు చేశారు. 2019 జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సీఎం కేసీఆర్ ఈ బ్యారేజీని ప్రారంభించారు. కాగా, బుధవారం పది చోట్ల పిల్లర్ల కింద బుంగలు పడి నీళ్లు లీకవుతున్నాయి. బ్లాక్ నెంబర్ 4లో 38వ గేట్‌కు ఎదురుగా 4, 5వ పిల్లర్ల మధ్య పడిన బుంగ దగ్గర వాటర్ లీకేజీ ఎక్కువగా ఉండటంతో ఇంజినీర్లు ఇసుక బస్తాలు వేసి లీకేజీ ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. 10 మందికిపైగా కూలీలను పెట్టి బ్యారేజీకి దిగువన గోదావరిలోనే ఉన్న ఇసుకను బస్తాల్లో నింపి పడవల ద్వారా తీసుకొచ్చి బుంగకు అడ్డుగా వేస్తున్నారు. బ్లాక్ నెంబర్ 3లో 28వ గేట్‌కు ఎదురుగా 5, 6వ పిల్లర్ల మధ్య.. ఇదే బ్లాక్‌లోని 31వ గేట్‌కు ఎదురుగా 8,9వ పిల్లర్ల మధ్య.. బ్లాక్ 4లో 33 వ గేట్‌కు ఎదురుగా 3, 4వ పిల్లర్ల దగ్గర కూడా పెద్ద, పెద్ద బుంగలు పడ్డాయి. ఈ నాలుగు చోట్ల బుంగలు పైకి కనిపిస్తున్నాయి. వీటితో పాటు మరో 6 చోట్ల కూడా బ్యారేజీ పొడవునా పిల్లర్ల కింద బుంగలు పడినట్లు మత్స్యకారులు చెప్తున్నారు. ఇవి నీటి అడుగుభాగంలో ఉండటం వల్ల వాటర్ లీకేజీ పైకి కనిపించడం లేదని వివరించారు. అన్నారం బ్యారేజీలో ప్రస్తుతం 5.74 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. బుంగలను రిపేర్ చేయడానికి సర్కారు ఇంజినీర్లు బ్యారేజీలోని నీటిని ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బుధవారం ఒక గేట్ తెరిచారు. 2 వేల క్యుసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
రెండు చోట్లనే..
గోదావరిపై 1,275 మీటర్ల పొడవున్న అన్నారం బ్యారేజీకి రెండు చోట్ల సీపేజ్‌లు (బుంగలు) ఏర్పడ్డాయి. కానీ ఎక్కడ కూడా ఇసుక బయటకు రావడం లేదు. సీపేజ్ ల వల్ల బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదు. నీళ్లు తగ్గినప్పుడు సీపేజ్ ఉన్న చోట మెటల్, సాండ్ బ్యాగ్స్, ఫిల్టర్ మీడియా మెటీరియల్ వేస్తున్నం. సాండ్ బ్యాగ్స్ తో రింగ్ బండ్ కూడా నిర్మిస్తున్నం. ఏటా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మెయింటనెన్స్ ఉంటుంది. అవసరమైతే కెమికల్ గ్రౌటింగ్ కూడా చేస్తం. అన్నారం బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదు.
- ఎ. యాదగిరి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అన్నారం బ్యారేజీ
నిరుడు రెండు పంప్‌హౌస్‌ల మునక
గతేడాది జులై 14న కన్నెపల్లి(లక్ష్మి), అన్నారం(సరస్వతి) పంప్‌హౌస్‌లు నీటమునిగి మోటార్లన్నీ ఖరాబయ్యాయి. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో ప్రొటెక్షన్ వాల్ కూలి 6 మోటార్లు తుక్కు కింద మారాయి. ఇప్పటికీ పూర్తిస్థాయిలో పంప్‌హౌస్ రిపేర్లు కాలేదు. అయితే.. రిపేర్ల అనంతరం 11 మోటార్లు పనిచేస్తున్నాయని చెప్తున్నా ఈ ఏడాది 5 మోటార్లను మాత్రమే నడిపించారు. అన్నారం పంప్‌హౌస్ కూడా అదే రోజు గోదావరి వరదలకు నీట మునిగింది. ఈ రెండు పంప్‌హౌస్‌లు మునగడం వల్ల రూ. వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ఇంజినీరింగ్ ఎక్స్‌పర్ట్‌లు చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా గోదావరిపై భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌ఫూర్ మం డలం అంబట్‌పల్లి దగ్గర మేడిగడ్డ (లక్ష్మి), అన్నారం గ్రామం దగ్గర అన్నారం( సర స్వతి), పెద్దపల్లి జిల్లా సిరిపురం దగ్గర సుందిళ్ల(పార్వతి) బ్యారేజీలు నిర్మించారు. కాళేశ్వరం దగ్గర ప్రాణహిత నీరు గోదావరిలో కలిసే చోటుకు సుమారు 20 కి.మీ దిగువన 16.17 టీఎంసీల కెపాసిటీతో మేడిగడ్డ బ్యారేజీని కట్టారు. ఈ నీటినే బాహుబలి మోటార్ల సాయంతో రివర్స్ పంపింగ్ చేసి గ్రావిటీ కెనాల్ ద్వారా మొదట అన్నారం బ్యారేజీలోకి.. అక్కడి నుంచి సుందిళ్లలోకి, అక్కడి నుంచి ఎల్లంపల్లిలోకి రివర్స్ పం పింగ్ చేస్తారు. కాళేశ్వరం రిజర్వాయర్లను ప్రారంభించి నాలుగున్నరేండ్లు అవుతుం డగా.. ఈ ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్‌లోని 20వ నంబర్ పిల్లర్ (పియర్) కుంగిపోగా, మరో ఆరు పిల్లర్లు దెబ్బతిన్నాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఓ టీమ్.. సీడబ్ల్యూసీ గోదావరి సర్కిల్ ఎస్‌ఈ దేవందర్ రావుతో కలిసి అక్టోబర్ 24న బ్యారేజీని పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇచ్చింది. నివేదికలోని వివరాలు బయటికి రాకముందే.. బుధవారం అన్నారం బ్యారేజీ పిల్లర్ల కింద పది బుంగలు పడ్డాయి.